*🎁మావయ్యొస్తాడు*
🕉️🦚🌹🌻💎🌈
*🍁అవడానికి అమ్మకి తోడబుట్టినవాడే అయినా నాన్నంత ప్రేమనీ అందిస్తాడు.*
*నెహ్రూ మీద ఇష్టంతో ఇందిరనీ ప్రేమించినట్టు ఆ ప్రేమ వంశపారంపర్యంగా సాగుతుంది. మావయ్యెప్పుడూ చెల్లినీ, చెల్లిపిల్లల్నీ కూడా అమితంగా ఆదరిస్తాడు.*
*ఊరినించి మావయ్యొస్తాడన్న కబురే కమ్మగా ఉండేది. ఆముందురోజు మధ్యాహ్నమే పిండాడించుకు రమ్మని ఖాకీరంగు గుడ్డసంచిలో అరకేజీ సెనగపప్పు పోసి మరకి పంపేది అమ్మ.*
*‘కారం ఆడిన తరవాత పొయ్యొద్దని చెప్పు. ఏ బియ్యమో ఆడాక మనవి ఆడమను. లేకపోతే గొట్రొచ్చేస్తుంది పిండి’ హెచ్చరికల అనంతరం ఆ సంచికన్నా వదులుగా వేలాడిపోతున్న నిక్కరు, గళ్లచొక్కా తొడుక్కుని పిండిమరకి బయల్దేరేవాణ్ణి.*
*మావయ్యకి జంతికలంటే ఇష్టం. అవి అమ్మ చేస్తే మరింత ఇష్టం. జంతికలగొట్టం పాతదైపోయిందని ఇంటిపక్క మామ్మగార్నడిగి కొత్త గొట్టం పట్టుకొచ్చేది. అందులో మూడునాలుగు రకాల బిళ్లలుండేవి. ఒకటి లావు జంతికలది, మరొకటి సన్నకారప్పూసది, ఇంకొకటి ఏదో నక్షత్రాకారంలో కన్నం ఉండేదీను.*
*అమ్మయితే కాసిని జంతికలు, బోల్డంత కారప్పూసా చేసేది. నాకైతే వర్షం పడుతోంటే వచ్చే శబ్దమూ, ఈ కారప్పూస వేగే చప్పుడూ ఒకలాగే అనిపించేవి. పైగా చలచల్లగా ఉన్న వాతావరణానికి వేడివేడి కారప్పూస జతకలిస్తే అమ్మకీ మావయ్యకీ మధ్య కూర్చున్నట్టనిపించేది.*
*ఉన్నంతలో ఏదో ఒక చీర కొనుక్కొచ్చేవాడు. అది పుట్టింటి మమకారమనేది అమ్మ. దాని ఖరీదెంతో తెలీదుగానీ, అమ్మ కళ్లలో ముత్యాల్లాంటి ఆనందబాష్పాలు మాత్రం చాలా విలువైనవి. అటువంటి అల్పసంతోషాల మధ్య గడిచిపోయింది బాల్యమంతా!*
*రైళ్లొచ్చే వేళలు మాకంతగా తెలీవు. ఏ రైల్లో దిగుతాడో సమాచారం ఉండేది. వారం ముందు రాసిన కార్డు ముక్కలో తాతగారు, అమ్మమ్మల సంగతుల్తోపాటు ఆ వీధిలో కాపరాలుండే మిగతావాళ్ల భోగట్టాలు, కాలవ కబుర్లు, తను పనిచేసే ఫాక్టరీ విషయాలూ కూడా ఉండేవి.*
*వీధిచివర రాజులావిడకి దెయ్యం పట్టిందని, సుబ్రమణ్యం గారమ్మాయి ఎవరో వైదికులబ్బాయిని ఇష్టపడుతోందని, చలమయ్యశెట్టి కొడుకులు తండ్రిని ఎదిరించి విడిపోయి వేరే కొట్టు పెట్టేసుకున్నారని, ఈయేడు కాలవ బాగా నిండుగా పారుతోందని, ఈతకని ఇంట్లోంచి వెళ్లిన సైకిలుకొట్టు మస్తాన్ కొడుకు మూడురోజుల తరవాత ఏలూరులో దొరికాడని, ఇలా అంతూపొంతూ లేని కబుర్లు ఆ కార్డునిండా!*
*‘రైళ్లన్నీ వెళిపోయుంటాయి, ఇక ఆఖరి బండికే దిగుతాడేమో?' అంటూ నాన్నగారు చెప్పులేసుకుని స్టేషనుకి బయల్దేరేవారు. ‘వచ్చినవాడు ఇంటికిరాడా యేం?’ అని అమ్మ వారించినా వినేవారుకాదు. నాన్నగారికి చుట్టాలన్నా, తాతగారికి చుట్టలన్నా భలే ఇష్టం. అవి వ్యసనాలు. మానమంటే మానగలిగేవి కావు.*
*మావయ్యతో కూర్చుంటే గంటలతరబడి కబుర్లు చెప్పేసుకునేవారు నాన్న. ఎవరెవరివో పెళ్లిళ్లలో జరిగిన మర్యాదలు, జరగని సత్కారాల సంగతులన్నీ బయటపడేవి ఆ కబుర్లలో.*
*‘ఒకమూల పెళ్లివారొచ్చేశారు, వీడింకా స్నానం చెయ్యకుండా పేకాట్లో కూర్చున్నాడు. పోనీ గెలుస్తాడా అంటే ఎప్పుడూ ఫుల్ కౌంటే! ఆఖరికి బ్రహ్మయ్యశాస్త్రొచ్చి ఒక్కరుపు అరిచేసరికి అప్పుడు లేచాడు. ఆడపిల్ల తండ్రన్నాక ఆమాత్రం బాధ్యత లేకపోతే ఎలాచెప్పు?’ ఇలా సాగిపోతుండేది ప్రవాహం.*
*వాళ్లెవరో తెలీకపోయినా మాకందరికీ కొన్ని విషయాలు మాత్రం భలే బోధపడిపోయేవి.*
*మగపెళ్లివారికి మర్యాదలు చెయ్యాలని, పెళ్లిళ్లలో పేకాటలవీ ఉధృతంగా ఆడతారని, ఆడపిల్లల్ని కన్నాక కాస్త అణకువగా బాధ్యతతో ఉండాలనీ... ఇలా కొన్ని రాజ్యాంగేతర రహస్యాలు అలా అలవోకగా తలకెక్కేసేవి.*
*నాన్నగారు ఏజెన్సీల్లో ఉద్యోగం చేసి సంపాయించినవాటిలో కణుసు చర్మంతో చేసిన పడక్కుర్చీ ఒకటి మా ఆస్తి. అదసలు భలే దుక్కలా ఉండేది. అందరిళ్లలోనూ మడతమంచం గుడ్డతో పడక్కుర్చీలుంటే మాయింట్లో ఇది ప్రత్యేకంగా కనబడేది.*
*మావయ్య రాగానే కాళ్లు కడుక్కొచ్చి అందులో కూర్చుంటాడు. తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి, మరింత విశ్రాంతిగా ఉంటుందని కాస్త చివరి మెట్టుమీదకి వాల్చి ఉంచేవాళ్లం.*
*రైలు దిగిన మావయ్య రిక్షా ఎక్కేవాడు. ఆ పక్కనే సైకిలు తొక్కుతూ నాన్న. దారిపొడవునా బోల్డన్ని కబుర్లు చెప్పేసుకుంటూ ఇల్లు చేరేవారు.*
*అల్లంతదూరాన రిక్షాలోంచి కనబడే మావయ్య. పొడుగైన మనిషవ్వడాన స్ఫుటంగా ఆనేవాడు. పక్కపాపిడి తీసి దువ్విన ఒత్తైన జుట్టు. చెంపలదగ్గర నెరిసిన వెంట్రుకలు కొన్ని మెరుస్తుండేవి. రంగులవీ ఇష్టపడని నిర్మలత్వం. పెదాలెప్పుడూ నవ్వుతూనో, అప్పుడే నవ్వు చాలించో కనబడుతుంటాయి. పొట్టిచేతుల చొక్కాకి పెద్ద జేబు, అందులో రెండు రంగుల పెన్నులు.*
*రిక్షాలోంచి దిగకముందే వీధిచివరికి చేరిన మేమంతా తన పెట్టే, సంచులూ తీసేసుకునేవాళ్లం. రాగానే చెంబుతో నీళ్లందించే వాడొకడు, తువ్వాలందించేదొకతీ!*
*‘ఏరా, బాగా చదువుతున్నావా? ఫస్టొస్తున్నావా?' అంటూ దగ్గరకి తీసుకునే వాత్సల్యం, రైల్లో అలుముకున్న బొగ్గువాసనా కలిసి మమ్మల్ని వింతగా పలకరించేవి.*
*‘స్నానం చేసెయ్ అన్నయ్యా, రైల్లో చిరాగ్గా ఉండుంటుంది!’ అంటూ వచ్చేది అమ్మ. తనచేతిలో మంచినీళ్లగ్లాసు ఒక్కటే ఉందీ అంటే దానర్ధం జంతికలవీ మమ్మల్ని తెచ్చిమ్మని. దానికి మామధ్య పోటీ ఉండేది మరి!*
*‘మొన్న పెదనాన్నగారొచ్చినపుడు నువ్వేగా తెచ్చిచ్చావు పాలకోవా? ఈసారి నన్నిమ్మంది అమ్మ!’ అంటూ వంతులేసుకునేవాళ్లం. ఆఖరికి జంతికలొకడు, సన్నపూస మరొకడూ పళ్లాల్లో పెట్టి తెచ్చిచ్చేవాళ్లం. ఆడపిల్లలు బిందెలోంచి మంచినీళ్ళు ముంచితెచ్చేవారు.*
*ఒక్కొక్క ముక్కా కొరుకుతూ నాన్నగారు, అమ్మా చెప్పే విషయాలు వింటూ, మధ్యలో మా చదువుల సంగతులు, నా బొమ్మల గొప్పలు, పెద్దన్నయ్య పాటలు, నాన్నగారి సిగరెట్ల మీద కంప్లైంట్లతో రెండు మూడు గంటలు గడిచిపోయేవి. స్నానానికి మాత్రం లేచేవాడు కాడు.*
*‘నువ్వు మొన్నేసిన సర్కస్ బొమ్మలు పట్రారా, మావయ్య చూస్తాడు!'*
*‘వీడి రైటింగ్ ఎంతబావుంటుందనుకున్నావు? నీ పుస్తకవొఁకటి తీసుకొచ్చి చూపించరా!'*
*‘దీనికీమధ్య పూలు గుచ్చడం నేర్పించానన్నయ్యా, మాలలవీ భలే కట్టేస్తోంది!’*
*‘నాన్న ఆరోగ్యం ఎలావుంది? చుట్టలేవఁన్నా తగ్గించారా ఇంకా అలాగే కాలుస్తున్నారా?’*
*మావయ్య మాటాడుతోంటే వింటూండగా కాలమలా సాగిపోయేది. తన నిష్కల్మషమైన మెచ్చుకోళ్ల మధ్య మా చిన్నిచిన్ని సరదాలు మరింత ఉజ్వలంగా వెలిగేవి. తన పొడుగాటి వేళ్లమధ్య ఇమిడిపోయే మా చిట్టిచేతులకి ఒక వింతైన ఆసరా కనబడేది.*
*మడతమంచం మీద బొంతపరిచి, పువ్వుల దుప్పటీ, మెత్తటి తలగడా అమర్చి, మంచం పక్కన ఒక చెంబుతో మంచినీళ్ళు, దానిమీదనొక గ్లాసు బోర్లించి పెట్టేవాళ్లం. చిరునవ్వుతూనే నిద్రపోయేవాడు.*
*తెల్లారే అందరికంటే ముందే లేచే అలవాటున్న మావయ్య పిల్లలందరికీ ఆకుల్నీ, పువ్వుల్నీ, పక్షుల్నీ పరిచయం చేసేవాడు. సూర్యకాంతి గొప్పదనం గురించి, పెద్దలపట్ల చూపాల్సిన గౌరవం గురించి బోధించేవాడు. కృతజ్ఞతంటే ఏవిఁటో పాఠంలా కాకుండా కథలా చెప్పేవాడు.*
*మావయ్యంటే మమకారపు మొగలిపొత్తు. అరుదుగా వచ్చినా ఆ పరిమళం తను వెళిపోయిన చాలాకాలం పాటు ఉండిపోయేది* .
........కొచ్చెర్లకోట జగదీశ్
🕉️🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment