Saturday, July 4, 2026

*బ్రహ్మార్పణమే* *కర్మఫలాలన్నీ...*
* -శ్రీకూర్మపురాణం
ధ్యానం గురించి సవివరంగా చెప్పిన కూర్మపురాణం ముఖ్యమైన మూడు యోగాలలో కర్మయోగం గురించి చెబుతోంది. కర్మయోగం సాధించడానికి మొదటగా నాలుగు సోపానాలు చెప్పింది.
1)కర్మలు బ్రహ్మ మందుంచటం,
2)సంగరహితుడు కావటం,
3)కామం విడిచిపెట్టటం,
4) ప్రసన్న మనస్సుతో కర్మలు ఆచరించటం
అనే నాలుగుసోపానాల ద్వారా మోక్షస్థానానికి వెడతాడని చెప్పింది.

దీని అనంతరం కర్మలు ఎలా చేయాలో చెబుతోంది.

బ్రహ్మణా దీయతే దేయం బ్రహ్మణే సంప్రదీయతే|
బ్రహ్మైవ దీయతే చేతి బ్రహ్మార్పణమిదం పరమ్||
అనే శ్లోకం ద్వారా అతి ముఖ్యమైన కర్మతత్త్వం చెబుతోంది.

ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సకలమూ ఆ పరబ్రహ్మమే ఇస్తున్నది. కనుక బ్రహ్మము ఇచ్చేది బ్రహ్మానికే ఇస్తున్నాను అని భావించాలి. ఇచ్చేవాడూ బ్రహ్మమే, ఇస్తున్న వస్తుసంపదా బ్రహ్మమే, కనుక బ్రహ్మమునకే తిరిగి ఇస్తున్నాను అని బ్రహ్మార్పణం చెప్పడమే ఉత్తమ బ్రహ్మార్పణంగా చెప్పింది. ఇదే పైన చెప్పిన నాలుగో నిబంధనలో కర్మలు బ్రహ్మయందు ఉంచటం అంటే.

అంటే మనం ప్రపంచంలో అనుభవిస్తున్న సమస్తమూ ఆ పరమాత్మే ఇచ్చాడు. ఆయన ప్రతిరూపాలే ప్రపంచంలోని విషయవస్తువులు. కనుక వీటిని ‘‘నేను‘‘ అనుభవిస్తున్నాను అనే భావన లేకుండా, ఈ అనుభవిస్తోంది కూడా ఆయనే అని నేను కాదు అనే స్పృహలో సతతం ఉండాలి. అదే అహంకారం లేకుండా ఉండటం అవుతుంది. ఇలా ఉంటూ కర్మలు చేయాలి.

పైన చెప్పిన శ్లోకం చదవగానే అందరికీ గుర్తుకు వచ్చేది గీతలోని ఈ శ్లోకం.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం|
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా||
ఆచరణాత్మక భగవద్గీత మొత్తం ఈ శ్లోకంలో ఉందని అనుభవజ్ఞులు చెబుతారు. కర్మలు ఎలా చేయాలో ఇది చెబుతోందని అంటారు. సరిగ్గా దీన్ని పోలిన శ్లోకమే కూర్మపురాణంలో పైన కూడా చెప్పింది.

పూజలూ జపాలు అత్యంత శ్రద్ధతో చేసి చివరిగా బ్రహ్మార్పణం చెబుతారు. అంటే చేసిన కర్మఫలం (పుణ్యం) మొత్తం ఆ పరమాత్మకే చెందాలి అని ధారపోయడం. ఈ విధంగా కర్మఫలం ధారపోయడం వెనుక ఉన్న నిజమైన జ్ఞానం ఇదే. చేసేవాడు, చేయించేవాడు, ఏ వస్తువులతో చేస్తున్నామో ఆ వస్తువులు అన్నీ ఆ పరబ్రహ్మకు చెందినవే. కనుక ఆయనకే సొంతం. ఇందులో ‘‘నేను‘‘ అనేది ఏమీ లేదు అని భావించడమే అహంకారరహితంగా కర్మలు చేయడం. ఇదే కర్మల నుంచీ విమోచన కలిగించే మార్గం.

ఈ శ్లోకమే కాక కర్మలను బ్రహ్మార్పణం చేయడం గురించి మరింత వివరంగా కూర్మపురాణం చెబుతోంది. అది మరింత వివరంగా ముందుముందు తెలుసుకుందాం.
ఆధారం: మా గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య తెలుగులోకి అనువక్తీకరించిన శ్రీకూర్మపురాణ మూల ప్రతి.           *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment