మనం జీవితంలో వెంబడిస్తున్నవి నిజంగా మన కలలా? లేక సమాజం మనలో నాటిన కోరికలా?
ఎందుకంటే ఇది "ఏ ఉద్యోగం మంచిది?" అనే ప్రశ్న కాదు..."నేను పరుగెత్తుతున్న దారి నిజంగా నాదేనా?" అని మనల్ని మనమే ప్రశ్నించుకునే ప్రశ్న.
నాకు కొన్నిసార్లు ఒక చిన్న దృశ్యం గుర్తుకు వస్తుంది. పచ్చిక బయల్లో వంద గొర్రెలు ఒకదాని వెనుక ఒకటి పరుగెత్తుతుంటాయి. ముందు ఉన్న గొర్రె ఎందుకు పరిగెడుతుందో వెనుక ఉన్న తొంభై తొమ్మిది గొర్రెలకు తెలియదు. అయినా అవి కూడా అదే దారిలో పరిగెడతాయి.
కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలానే అనిపిస్తాయి. పదో తరగతి అయింది...
ఇంటర్ చదవాలి.ఇంటర్ అయింది...
ఇంజినీరింగ్ చేయాలి. ఉద్యోగం రావాలి.
ఇల్లు కొనాలి. కారు కొనాలి. పిల్లలను అదే పందెంలోకి దింపాలి. ఒక్కసారి కూడా మనం ఆగి..."ఇది నిజంగా నా కలేనా?" అని ప్రశ్నించుకోము.
మనిషి పుట్టినప్పుడు అతనికి పేరు కూడా ఉండదు. కానీ పెరిగే కొద్దీ...పేరు సమాజం ఇస్తుంది. భాష సమాజం నేర్పుతుంది.
మతం సమాజం పరిచయం చేస్తుంది.
కులం సమాజం చెబుతుంది. విజయం అంటే ఏమిటో కూడా సమాజమే నిర్వచిస్తుంది.
అప్పుడు...మన కలలు మాత్రమే సమాజం ప్రభావం లేకుండా ఉంటాయని ఎలా చెప్పగలం?
మనోవిజ్ఞానశాస్త్రం చెబుతుంది...మన కోరికల్లో చాలా వరకు పోలికల వల్ల పుడతాయి.
పక్కింటివాడు కారు కొంటే...మనకూ కావాలనిపిస్తుంది. స్నేహితుడు విదేశాలకు వెళ్తే...మన జీవితమే వెనుకబడి పోయిందనిపిస్తుంది. ఇది మన కోరిక కాదు.
మన పోలిక.
ఆధ్యాత్మికత మరో మాట చెబుతుంది.
ఉపనిషత్తులు పదే పదే ఒక ప్రశ్న అడుగుతాయి."నువ్వు ఎవరు గమనించండి...
"నువ్వు ఏమి సంపాదించావు?" అని అడగలేదు."ఏ పదవిలో ఉన్నావు?" అని అడగలేదు. ఎందుకంటే...మనల్ని మనం తెలుసుకోకపోతే...మన కోరికలు కూడా అప్పుగా తెచ్చుకున్నవే అవుతాయి.
మా నాన్న ఒక మాట చెప్పేవారు."ఆకలి నీది అయితేనే భోజనం రుచిస్తుంది. పక్కవాడి ఆకలితో నువ్వు తినలేవు."అదే విధంగా...
కల కూడా నీదైతేనే దాని కోసం పడిన కష్టం ఆనందంగా ఉంటుంది. లేకపోతే...జీవితం మొత్తం ఇతరుల కలలకు మనమే కూలీలమైపోతాం.
సామాజికంగా చూస్తే...సమాజం లేకుండా మనిషి ఎదగలేడు.కాబట్టి సమాజం ప్రభావం తప్పు కాదు.కానీ...సమాజం చెప్పిందే జీవితం అని నమ్మడం ప్రమాదం.
తాత్వికంగా చూస్తే...మనిషి జీవితంలో మూడు రకాల కోరికలు ఉంటాయి.ఒకటి...
శరీరం కోరుకునేవి.రెండోది...సమాజం నేర్పినవి. మూడోది...మన ఆత్మ నిశ్శబ్దంగా పిలిచేవి. మొదటి రెండింటి శబ్దం చాలా పెద్దగా ఉంటుంది. మూడోది మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే చాలా మంది జీవితాంతం మొదటి రెండు కోరికలనే నెరవేర్చుతూ గడిపేస్తారు. తమ అసలు పిలుపు వినలేరు.
అందుకే నాకు జీవితంలో అత్యంత ధైర్యమైన మనిషి ఎవరో తెలుసా? పెద్ద ఇల్లు కట్టినవాడు కాదు. పెద్ద పదవి సాధించినవాడు కాదు.
"ఇది నా కల కాదు" అని ఒప్పుకునే ధైర్యం ఉన్నవాడు.
ఎందుకంటే...ప్రపంచాన్ని మోసం చేయడం సులభం. మనల్ని మనం మోసం చేయకుండా ఉండడం చాలా కష్టం. చివరగా ఒక మాటతో ముగిస్తాను.
మనం జీవితంలో వెంబడిస్తున్న ప్రతి కోరిక ముందు ఒకసారి ఆగి ఇలా అడగాలి...
"ఇది నా హృదయం పుట్టించిన కలా?""లేక సమాజం నా మనసులో నాటిన విత్తనమా?"
ఆ రెండు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజే...మన జీవితం ఇతరుల చప్పట్లతో కాదు... మన అంతరాత్మ చిరునవ్వుతో నడుస్తుంది.
✍️ సమాజ శ్రేయోభిలాషి👏
No comments:
Post a Comment