*🌻పూజల్లో దోషాలు🌻*
🥀ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.
🥀ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదల మీద పడి "అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది.
🥀నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను" అని ప్రాధేయపడింది.
🥀ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు...
"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా!" అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.
🥀ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.
🥀అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.
🥀తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, "ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా " అనడిగాడు.
🥀ఆమె ఆయనకు నమస్కరించి "అయ్యా! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.
🥀"ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.
🥀ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.
🥀"అవ్వా! తప్పు చదువుతున్నావు! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది" అని కోపంతో వెళ్ళిపోయాడు.
🥀ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ "తవ, మమ" అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.
🥀ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.
🥀ఓ రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.
🥀ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి..."అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.
🥀కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.
🥀మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. కావాలని చేయరు ఎవరూ! పొరపాటులు జరగవచ్చు అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.
No comments:
Post a Comment