ఆత్మ నిర్భరత
స్వశక్తిమీద నమ్మకంతో, మనిషి తనకుతానే సమగ్రమైన స్వయం సమృద్ధి సాధించుకోగల వీలుంది. ఆత్మ నిర్భరతగా వ్యవహరించే ఆ శక్తిని వివేకానందుడు ‘ఆత్మశ్రద్ధ’ అన్నారు. ముక్కోటి దేవతలపై మనుషులు కనబరచే భక్తి శ్రద్ధలకన్నా మిన్నగా అది దేశవాసులందరిలో ప్రస్ఫుటం కావాలని ఆయన ఆకాంక్షించారు. దయనీయమైన పరిస్థితుల వలయంలో చిక్కుకున్నప్పటికీ- ఇతరుల సహాయం కోసం పడిగాపులు పడుతూ నిరీక్షించకుండా, ప్రతికూలతలన్నింటినీ ప్రావీణ్యాలుగా మార్చుకోనీయగలదా సంకల్పశక్తి. ఆత్మనిర్భరత అలవరచుకుని ముందుకు సాగితే, తమ భవితకు తామే నిర్మాతలు కాగలరని యువత తెలుసుకోవాలన్నది వివేకానందుల ఉద్బోధ.

ఆత్మ నిర్భరత ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనకు తానే యజమాని. మరొకరికి బానిసగా అతడుండలేడు. ఆధునిక భావకవి ఒకరు, అర్థవంతమైన అతిచిన్న మాటల్లో హెచ్చరికలా వినిపించినట్లు, ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని’ ఎదురుచూసి మోసపోకూడదనే దృఢమైన నిర్ణయంతో తన కార్యాచరణను అతడు రూపుదిద్దుకొంటాడు. మనిషికి అసాధ్యమనిపించే పనులన్నింటినీ ఆత్మనిర్భరత సుసాధ్యం చేస్తుందని, అతడికి చేయలేనిదంటూ ఉండదని దలైలామా ఎప్పుడూ అంటారు.
ఆత్మనిర్భరతతో ఆరోగ్యకరమైన పరిణామాలు జీవం ఉన్న ప్రతిచోటా కనిపిస్తాయి. గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారడం చూస్తే అది గమనించవచ్చు. ఆ ప్రాణి గూడులాంటిదొకటి తనచుట్టూ నిర్మించుకుని, సుషుప్తిలోకి జారుకుని అచేతనావస్థలోకి చేరుకున్నట్లు అనిపించినా- స్వయం నిర్భరత చెక్కుచెదర నందుకే కొద్ది కాలానికి రంగులమయమైన రెక్కలతో వెనక్కివచ్చి ఎగురుతుంది. కొత్త జీవితం ప్రారంభిస్తుంది.
ఆత్మ నిర్భరత మనుషులంద రిలో నిద్రాణమై ఉండే గొప్ప శక్తి. ప్రేరణ లభించినప్పుడు అది పెల్లుబుకుతుంది. హనుమంతుడి వంటి మహా శక్తిశాలికి కలిగిన అనుభవం ఆ విషయమే చెబు తుంది. సహచరులు నీకది సాధ్యమే అని ప్రోత్సహించగా, శతయోజనాల దూరంలో సముద్రం మధ్య ఉన్న లంకాద్వీపానికి లంఘించి చేరుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకుని రామకార్యాన్ని విజయవంతంగా నిర్వహించాడు.
అనిశ్చిత మనస్కుడై అర్జునుడు స్వయం నిర్భరతను కోల్పోరాదని, కార్యోన్ముఖుడై ఉండాలనే- కృష్ణపరమాత్ముడు గీతోపదేశం చేశాడు.
గ్రామీణుల ఆర్థిక దైన్యానికి కారణం వారు స్వశక్తిని నమ్మకపోవడమేనన్నారు గాంధీజీ. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించమని స్వరాజ్య సాధనకోసం పోరాటం చేసిన సమయంలో జాతికి ఆయన పిలుపిచ్చారు.
ద్వితీయ ప్రపంచ సంగ్రామం ముగిసిన అనంతరం జర్మన్లు, జపనీయులు తమ వ్యవస్థలన్నీ కుప్పకూలి ఉండటాన్ని చూశారు. స్వయం నిర్భరత పోగొట్టుకోని కారణంగా, వాటన్నింటినీ అచిరకాలంలో పునర్నిర్మించుకున్నారు.
ఆత్మ నిర్భరత అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయిస్తుంది. వేదాంతి ఎమర్సన్- తన చేదు అనుభవాలు జీర్ణించుకోవడానికి ఆత్మనిర్భరతవంటి దివ్యౌషధం ఒక్కటి మనిషికి చాలంటారు. కోట్లాది సంవత్సరాలుగా, కంటికి కనిపించే సంకటాలనైనా, కనిపించని కరోనాలవంటి మహమ్మారులనైనా ఎదుర్కొంటూ అతడు ఇప్పటికీ ఈ మహీతలం మీద మనుగడ సాగిస్తున్నాడంటే- ఆత్మనిర్భరతను కాపాడుకోవడం వల్లనే. అది తనలో ఉన్నంత కాలం మనిషి అద్భుతాలు చేస్తూ జీవిస్తూనే ఉంటాడు!.. ఆదిత్యయోగీ..
.
No comments:
Post a Comment