*వదలకపోతే గతి లేదు!*
*దివ్యాత్మ స్వరూపులారా!*
మనం చిన్నప్పటి నుండి తీసుకోవడమే నేర్చుకున్నాము గానీ, మనకున్నది ఇతరులకు ఇవ్వడం నేర్చుకున్నామా? అలా ఇవ్వడం నేర్చుకుని ఉంటే, ఇప్పుడు బాధ పెడుతున్న దానిని, కాదనుకున్న దానిని సులభంగా వదలుకోవచ్చు!
మనకు వదలుకోవడం చేతకాదనే చెప్పాలి. దోగాడటం చేతనైన పిల్లాడిని క్రింద వదిలితే ఏది కనిపిస్తే, దానిని చేతపట్టేసుకుంటాడు. పెద్దయ్యేకొద్దీ తల్లిదండ్రులు మనకు సంబంధించినవాటిని మరొకరికి ఇవ్వడమనేది అంగీకరించక అలానే నేర్పేవారు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, అవతలివారి నుండి ఏదైనా పొందితేనో, ఉపయోగం అందుకుంటేనో తప్ప, సామాన్యంగా ఎదుటివారికి ఏదీ ఇవ్వజాలం. ఇదే (ఇవ్వడమనేది లేకుండా తీసుకోవడం) పిల్లలకు
కూడా అలవాటైపోతుంది.
ముందు శరీర అవసరాలకు ఇతరుల నుండి ఏమైనా పొందడమనే ప్రక్రియ సర్వసామాన్యంగా కొనసాగుతుంది. అదే సమయంలో ఇవ్వడమనేది లేకుండా కూడా పోతుంది. ఈ పొందడంలో స్వార్థం, లోభిత్వం, అసూయ, ద్వేషం తదితర అవకర గుణాలు పాదుకొని మహా శాఖోపశాఖలుగా పెరిగిపోతూంటాయి. వీటి మూలంగా దేహాభిమానం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో ప్రతి జన్మలోనూ మనుష్యుల కోసం, వస్తువుల కోసం, భూమి కోసం, మిద్దెల కోసం, మగువల కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, శారీరక సుఖాల కోసం, కీర్తి కోసం పరుగులు తీస్తూ, తపించిపోతూ, వాటిలో కొన్నింటిని పొందుతూ, మరి కొన్నిటి కోసం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఏ జన్మలోని ఏ జీవితమైనా పరుగులు ఉరుకులతో, అశాంతితో, కొరతతో తనువు చాలిస్తూ, ఈ జననమరణ చక్రంలో తిరుగుతూ ఉండటమే జరుగుతుండేది. ఈ పొందడం లేదా తీసుకోవడమనేది రాత్రింబగళ్ళు ఆసక్తిని వృద్ధి చేసి దుఃఖానికే కారణమగును.
ఈ పొందడం లేదా తీసుకోవడమనే ఆసక్తియే కోరిక. ఈ కోరిక ఒకదాని నుండి మరొక దానిపైకి మరలుతూ మనిషిలో దుర్గుణాల కొండను పెంచుతూ తిర్యక్ జన్మలకు మూలమవుతోంది. దీని విచిత్రమెలాంటిదంటే- ఇల్లూ వాకిలీ భార్యా పిల్లలూ ఆస్తులూ... ఇలా అన్నింటినీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగిగా పేరుగాంచినవాడిని సైతం భ్రాంతికి గురిచేస్తుంది. అన్నింటినీ వదిలేశాననుకున్నవాడు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఒక ఆశ్రమాన్నో మఠాన్నో నిర్మింపజూస్తాడు. నిర్మించిన తర్వాత దాని ఆశ్రమ/మఠ అభివృద్ధి కోసంగానైనా లేదా నిర్వహణ కోసంగా నైనా దాతల కోసం ఎదురు చూస్తుంటాడు. లేదా ఏదో ఒక వ్యాపారమో, వ్యాపకమో ఆరంభిస్తాడు. మరి డబ్బు కావాలి కదా! అదే సమయంలో శిష్యులను ప్రోగేసుకోవడం కూడా యధాలాపంగా జరిగిపోతుంది. మరి ఇక్కడ ఏమి పరిత్యజించినట్లు?
మొట్టమొదట సంసారం నందు విరక్తులై సన్యసించి, తిరిగి ఆశ్రమ/మఠ ఏర్పాటుకు, శిష్యసంగ్రహణమునకు, డబ్బు ఏర్పాటుకు ఆసక్తులవడమంటే- తమ లక్ష్యానికి తామే విఘాతం కలిగించుకొనుచున్నారని అర్థమవుతోంది కదూ!
నిజానికి ఈ ప్రపంచము, ఇందులో మనమూ అశాశ్వతులమైనప్పుడు మనం పరిగ్రహించినవేవైనా కూడా అవన్నీ అశాశ్వతమే కదా! ఈ మాత్రం అలోచన కూడా చేయలేని మనం ఆధ్యాత్మికవాదులమవుతామా?!
మరి మార్గమేమిటి? అన్నిటినీ వదిలేయడమే మార్గమని తెలుస్తున్నా కూడా వదలలేని అశక్తులుగానే ఉంటున్నాము. మాటలకు అన్నీ వదలమనీ, వేటి పట్ల కూడా ఆసక్తి వలదనీ కూడా సత్సంగాలలోనూ, సభావేదికలపైననూ చెవులు చిల్లులు పడేలా చెప్పగలం కానీ, ఆచరణలో ఒక్క నిమిషమైనా నిలువగలుగుతున్నామా?
అరణ్యములోని ఒక పక్షికి ఒకరోజు మంచి మాంసపు ముక్క దొరికింది. దానిని చూడటంతోనే ఆ పక్షికి అమితమైన సంతోషం కలిగింది. ఆ పక్షి తన భాగ్యానికి పొంగిపోతూ ఆ మాంసం ముక్కను నోట కరచుకొని ఎగిరిపోసాగింది. అది అక్కడే తినేస్తే ఆకలి తీరుండేది. కానీ అది లోభిత్వముతో దానిని పట్టుకొని ఆకాశంలో ఎగురుతోంది.
ఆ పక్షి మాంసం ముక్కను నోటకరచుకొని పోతుండటం అదే జాతి పక్షులు చూచి, దాని వెంటపడ్డాయి. కొన్ని పక్షులు దానిని ముక్కుతో పొడవసాగాయి. మరికొన్ని తమ రెక్కలతో దానిని కొట్టసాగాయి. ఇంకొన్ని తమ కాళ్ళ గోళ్ళతో దానిని రక్కసాగాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు ఎక్కడెక్కడికో దూరంగా ఎగిరిపోసాగిందా పక్షి.ఆదిత్యయోగీ..
దొరికిన మాంసపుముక్కను తినకుండా అనవసరంగా పట్టుకుపోతున్నందుకు అది మిగిలిన పక్షుల నుండి ఎంతో బాధను ఎదుర్కోవవలసి వచ్చింది. తన జాతి పక్షులే తనను బాధించుట ఆ పక్షికి చాలా బాధ కలిగింది. దీనికంతటికీ కారణం- తాను నోట కరచుకొని పట్టుకుపోతున్న మాంసపుముక్కయే అని గ్రహించినదై, ఆ మాంసాన్ని నోటి నుండి వదలి క్రింద పడవేసింది. అప్పుడా పక్షులు అన్నీ ఈ పక్షి వైపు రాక, మాంసపుముక్క వైపు వెళ్ళి, దాని కోసం ఒకదానికొకటి కొట్టుకోసాగాయి. నోటి నుండి మాసంపుముక్కను జారవిడచిన పక్షి ఇబ్బంది నుండి బయటపడి హాయిగా ఒక చోట కూర్చొని పక్షుల వైఖరిని చూడసాగింది.ఆదిత్యయోగీ..
నిజానికి ఇందులోని ఆ మొదటిపక్షిలాంటి వాళ్ళం మనం. ఆ మాంసపుముక్క -ప్రపంచములో మనం పొందినవి. మిద్దెలు, మేడలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, డబ్బు, భార్యాపిల్లలు, కుటుంబము, బంధువులు తదితర విషయసుఖాలతో కూడిన, భిన్నంగా కానవస్తున్న ఈ జగత్తు అంతా-ఆ మాంసపుముక్కయే. జగత్తును పట్టుకొని ఉన్నంతసేపూ ఎటు నుంచైనా బాధ పొంచి ఉంటూనే ఉంటుంది. విషయసుఖాల కాంక్షతో జగత్తును పట్టుకొని ఉండుటకు కారణం - దేహాభిమానమే! అంటే మనం పట్టుకున్నది దేహాభిమానాన్ని! ఈ దేహంపై ఎనలేని మోహం పెట్టుకున్నందువల్లనే లోకంపై మోహం చావకుండా ఉన్నది. మోహం ఉన్నంతసేపూ బాధలు తప్పవు.
అందుకే మనం వదలాల్సింది మాంసపుముక్కలాంటి జగత్తు కంటే, జగత్తు పట్ల మోహానికి ఆధారమైన దేహాభిమానాన్ని వదలాలి! దేహాభిమానాన్ని వదిలేస్తే సమస్తాన్నీ వదిలేసినట్లే!
దేహాభిమానం వదిలేయడమనేది వివేకంతోనే సాధ్యమవుతుంది. సర్వమూ కాలముచే నశింపు జరుగుతుందనేది సత్యం. కాలం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. తండ్రులు, తాతలు, వారితోపాటు వారు సంపాదించుకొని, నాడు అపురూపంగా చూసుకున్న వస్తుజాలమూ, ప్రేమించిన మనుష్యాది జీవులు సమస్తమూ కాలగర్భములో కలిసిపోయిన మాట సత్యం! మన కళ్ళ ముందే ఇతరులెంతో మందితోపాటు కుటుంబీకులు కూడా మరణిస్తుండుట చూస్తున్నాము. ఇలా నిత్యమూ చూస్తున్న మనకు కలగాల్సింది వైరాగ్యమే; ప్రపంచాసక్తి కాదు! ఇది మృత్యులోకము అని తెలిసి కూడా ఏదో పొందాలనే ఆసక్తితో అశాంతితో బ్రతుకులీడుస్తుండటం మన దౌర్భాగ్యమని చెప్పవచ్చు.
వదలుకోవడం చేతగాక, వైరాగ్యం అలవడక అగచాట్లు పడుతున్న మన కోసం భగవంతుడు, ఆ దత్తాత్రేయస్వామి ఎన్నో దృష్టాంతాలతో మనకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఆశిస్తూ, మన వినాశనానికి హేతువు అవుతున్న ఈ సమస్త ప్రపంచమును మరో కోణంలో గురువుగా ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఉండి చూస్తున్న ప్రతి దాని నుండీ, భగవత్ తత్త్వానికి దగ్గర చేర్చే విషయాన్ని స్వీకరించమని దత్తస్వామి బోధిస్తున్నారు.
మనకు ఎలాగూ స్వీకరించడమే తెలుసు కాబట్టి, ఆ స్వీకరణ ఏదో గురుమార్గం లేదా భగవత్మార్గం పట్టించే దాన్ని స్వీకరిస్తే (గ్రహిస్తే/తీసుకుంటే) మనకే మంచిది. భగవంతునికి దూరం చేసే విషయాన్ని పరిత్యజించడం అలవడాలి.
ప్రపంచం మనకు గురువై ఎలా నడిపిస్తుందనేందుకు అనేక దృష్టాంతాలు కలవు. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాలనుద ఓర్చుకుంటుంది భూమి. ఎంతమంది 'ఈ భూమి నాది నాది' అని ఎంతగా విభజించుకున్నా, | తగవులాడుకున్నా కూడా భూమి అందరికీ అనుకూలంగా ఉంటుంది.
అన్నింటికంటే నరదేహం ప్రశంసనీయ గురువుగా చెప్పవచ్చు. ఈ దేహమంత చెడ్డది లేదు, ఈ దేహమంత మంచిదీ లేదు. ముందుగా చెడు సంగతి చూద్దాం- గర్భంలో నెలల తరబడి కాలం గడిపి దేహం పుడుతుంది. పుట్టుకతోనే దేహాన్ని మరణం ఆశ్రయించి ఉంటుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా కాలం గడిపేస్తాడు. సుఖాల వెంపర్లాటతో మనశ్శాంతి ఉండదు. ప్రారబ్ధానుసారం సుఖం వచ్చినా, అట్లే దుఃఖాలు కూడా వస్తుంటాయి. సంతోషాలతోపాటు మానావమానాలు, ఛీత్కారాలు, అపోహలు, నిందలు, అపవాదాలు ఇలాంటివెన్నో చవిచూడాల్సి వస్తుంది ఎంతటి మనిషియైనా. నా యంతటివాడు లేడని అహంకరిస్తూ బ్రతికినా, చివరకు వృద్ధాప్యం దాపురించినప్పుడు వ్యాధులతో, మానసిక చింతనలతో పరిస్థితి దుర్బరంగా తయారై ఉంటుంది. ఇలాంటివారిని చూసినప్పుడు స్పష్టమవుతున్నది - దేహాభిమానులై దేహాన్ని పోషించుకున్నవారందరూ దుఃఖాన్నే పెంచుకుంటూ నశించిపోతున్నారని. దేహాన్ని ఎంత శ్రద్ధతో రక్షించుకున్నప్పటికీ చివరకు దేహం మృతి చెందుతుంది. పూడ్చబడిన దేహము కుక్కలకు, నక్కలకు, క్రిమికీటకాదులకు ఆహారమై పోతుంది. లేదా చితిలో ఉంచి దహనం చేయబడిన దేహం బూడిదకుప్పగా మారుతుంది. దేహమునే గురువుగా పెట్టుకొనిన వైరాగ్యం త్వరగా కలుగును.
అయితే ఇదే నరదేహము చెడ్డదని విస్మరిస్తే మోక్షమసలే లేదు. కారణం - ఇతర జీవులకు ఆహార నిద్ర భయము మైథునములు మాత్రమే కలవు. కానీ వివేక వైరాగ్యాలను నరదేహము ద్వారానే పొందగలడు జీవుడు. అందుకనే నరదేహము యోగ్యమనేది. మన యొక్క గమ్యస్థానానికి వెళ్ళునప్పుడు ఏదైనా వాహనాన్ని ఉపయోగించి జాగ్రత్త వహించి ఎలా వెళ్తామో అలా -అంతటా స్వస్వరూప స్థానంలో (అంతా భగవత్ స్వరూపంగా గోచరించేంతవరకూ) నిలిచేంతవరకూ శరీరాన్ని పోషించుకుంటూనే, ఆసక్తి వహించకుండా, సాధనకు ఉపయోగించుకుంటూ జాగరూకతతో ఉండాలి.
దేహంతో జాగ్రత్త ఏమిటంటే- ఇది చెడ్డదని వదిలేస్తే మోక్షము లేదు. మంచిదని అభిమానిస్తే పతనమే. అందుకే దేహాన్ని మన స్వాధీనంలో ఉంచుకొని జాగరూకతతో సాధన సాగించవలెను.
ఇలా భూమి నుండి, కనిపిస్తున్న ఆకాశం నుండి, నరదేహాల నుండి, వస్తుజాలం నుండి, ఆఖరికి శత్రువుల నుండి కూడా పాఠాలు స్వీకరించి భగవత్తత్త్వాన్ని పట్టుకునేవాడే సాధకుడు అవుతాడు.
ఎప్పుడైతే సమస్తమునూ గురువుగా భావన చేసి, స్వీకరించాల్సిన దానిని మాత్రమే స్వీకరిస్తుంటే, యధాలాపంగానే దేహాభిమానం విడనాడబడి, ఈ ప్రపంచంలో ఉంటున్నా, దేనిని చూస్తున్నా, ప్రారబ్ధానుసారంగా సంక్రమించిన సుఖాలను | అనుభవిస్తున్నా. దేని కోసం ప్రయత్నం చేస్తున్నా, దేని ప్రభావమూ ఆ సాధకుని మీద పడదు.
అంటే ఇక్కడ వ్యక్తి దేనినీ కావాలనుకోవడం లేదు. దేనినీ వద్దనుకోవడం లేదు. తానున్న పరిస్థితిలో ఏదైనా కావాలని ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం విఫలమైనా అతడు పట్టించుకోడు. అంటే ఇక్కడ పొందాలనుకోవడమనేది గాఢంగా లేదు. అదే వ్యక్తికి కష్టాలు వచ్చినా, దారిద్య్రం వచ్చినా వాటినీ తిరస్కరించేది ఉండదు. తామరాకుపై నీటిబొట్టులా ప్రపంచంతోనే ప్రపంచంలోనే ఉంటూనే దేనినీ అంటుకోకుండా ఉండటమే-వదలడంతో సమమవుతుంది. అట్టి వివేక వైరాగ్యాలు కేవలం పుస్తక పఠనతోనో, వ్యక్తుల మాటలతోనో రావు. దృఢసంకల్పం ఉండి అందుకు సమాయత్తమై ఉంటేనే, ప్రపంచం గురువుగా ఉండి చేసే బోధ మనసుకు ఎక్కేలా దత్తప్రభువు (భగవంతుడు) చేస్తారు!
నేను, నువ్వు, అంతా పరమాత్మయే అన్న ఎరుకను స్థిరపరచుకునేందుకు మనం సిద్ధమై యుంటే, విశ్వమంతా గురువుగా ఉండి చేసే బోధ మనం గ్రహించేందుకు దత్తకృప గురురూపకంగా సాక్షాత్కరించి తోడ్పాటునందించుననేది దత్తప్రభువు, ఋషులు మనకందించిన హామీ!..
No comments:
Post a Comment