Sunday, December 31, 2023

త్రికరణశుద్ధి

 🪔🪔అంతర్యామి 🪔🪔

#త్రికరణశుద్ధి#

🍁మనసు, మాట, పని- ఈ మూడింటినీ కలిపి త్రికరణాలు అంటారు. కరణం అంటే సాధనం అని అర్థం. ఏదైనా పని చేయడానికి సాధనం అవసరం. ఈ మూడూ వేర్వేరు సాధనాలు. ఒకటి ఆలోచనా సాధనం. మరొకటి వ్యక్తీకరణ సాధనం. మూడోది ఆచరణ సాధనం. ఆలోచన, వ్యక్తీకరణ, ఆచరణ అనే మూడింటికీ అనుసంధానత. అవినాభావ సంబంధం ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి లోపించినా సరైన ఫలితం ఉండదు. ఎలాగంటే.. పని జరగకుండా, మనసు-మాట ఒకటైతే చాలదు. కేవలం మాటల పని జరగదు. కానీ, పని జరగాలంటే మాటల ఆసరా ఉండాలి. వట్టి మాటలు కట్టిపెట్టి- గట్టి మేల్ తలపెట్టవోయ్ అని కవి అనడానికీ కారణం ఇదే.

🍁మూడు కరణాలు ఏక తాటిమీదకు రావడానికి మార్గాన్ని ఆదిశంకరులు వివేక చూడామణిలో ఇలా చెప్పారు- 'వాక్కును మనసులోను, మనసును బుద్ధిలోను లీనం చేసి ఆ రెండింటి సమాహారంతో కర్మను ఆచరిస్తే అది శుద్ధమవుతుంది. అదే త్రికరణ శుద్ధి'. ఇలా జరిగిననాడు అద్భుతమైన ఫలితాలను పొందగలరని బోధించారాయన. రాగద్వేషాలకు అతీతులైన మహాత్ములకు మాత్రమే ఈ మూడూ ఒక్కటిగా ఉంటాయి. అదీ స్వచ్చంగా, వారు మనసులో వచ్చే శుద్ధమైన ఆలోచనలనే మాటల రూపంలో చెబుతారు. అలా చెప్పిందే చేస్తారు. అందువల్ల వచ్చే ఫలితాలు సైతం లోకోపకార కారకాలవుతాయి.

🍁సాధారణ మానవులకు మూడింటిలో ఏదో ఒకటి లోపించవచ్చు. అందువల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. ఉదాహరణకు మనసులో మంచి ఆలోచన వచ్చినా మాట రూపంలోకి మారేసరికి తేడా జరగవచ్చు. ఫలితంగా కర్మ నిర్వర్తించడం లోపం ఏర్పడుతుంది. దానికి కారణం మానవ సహజమైన లోభం. కొందరి ఆలోచనలకు, చెప్పే మాటకు, చేత(కర్మ)కు పొంతనే ఉండదు. వీటిని బట్టి చూస్తే 'అందరి నుంచి త్రికరణశుద్ధిని ఆశించలేము కదా' అనే సందేహం కలుగుతుంది. ఆ మాటా నిజమే. నిజానికి అందరూ మహాత్ములు కాలేరు. అయితే, త్రికరణాలు శుద్ధంగా లేకపోయినా వాటిని సరైన పద్ధతిలో పనిచేయిస్తే ప్రగతి ఉంటుంది. ఎలాగంటే... మాటల్లో చెప్పలేక పోయినా శుద్ధమైన ఆలోచనలు చేయడం, ఆలోచనలూ పనులు ఎలా ఉన్నా ఇతరులకు స్ఫూర్తి కలిగించేలా మంచిగా మాట్లాడటం, అందరికీ కాకపోయినా ఏ ఒక్కరికైనా ఉపకారం జరిగే పనులు చేయడం తదితరాల వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అందుకోసం మహాత్ములు ఎన్నో సూచనలు చేశారు.

🍁పతంజలి మహర్షి యోగదర్శనంలో మనసును నియంత్రించుకునే మార్గాలు చెప్పాడు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి అనే పది రకాలైన అభ్యాసాల ద్వారా మానవుడు వివేకాన్ని పొంది ముక్తుడు కాగలడని బోధించాడు. ఫలితంగా ఒక కాకపోయినా మరొకసారైనా ఒక మంచి పని చేయవచ్చు. క్రమంగా అది అలవాటుగా మారవచ్చునని ఉపదేశించాడు. 
🍁బంధమోక్షాలకు కారణం మనసే. 
🍁కాబట్టి మనసును నియంత్రించే సాధనలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.🙏

- ✍️అయ్యగారి శ్రీనివాసరావు
Shri ram jay ram jay jay ram
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment