Sunday, December 17, 2023

ఉపాధ్యాయులు మాత్రమే కాదు అందరూచదవవలసిన ఓ మంచికథ!!*

 *ఉపాధ్యాయులు మాత్రమే కాదు అందరూచదవవలసిన ఓ మంచికథ!!*

*🔮బహుమతి* ....
----------------------------
తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..

```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఒక గోశాలకు విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ గోశాలకు విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని గోశాలకు వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```.                               ‌(సేకరణ:- దాసవరం శంకర్రావు బ్యూరో చీఫ్ రిపోర్టర్)

No comments:

Post a Comment