Friday, December 22, 2023

ద్వైధీ భావన* (2023 జాగృతి-వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో *ప్రధమ బహుమతి* పొందిన కథ రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు

 *ద్వైధీ భావన*
(2023  జాగృతి-వాకాటి పాండురంగారావు స్మారక 
 దీపావళి కథల పోటీలో *ప్రధమ బహుమతి* పొందిన కథ 
రచయిత 
శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు 

9848607127
*****
*ద్వైధీభావన* -కథ 

‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్...’ అన్న సుమతీ శతకకారుడు పద్య చందాన ఉంటుందా ఊరు, గోదావరీ తీరాన.
ఆ ఊళ్లో ధర్మాసుపత్రనే పేరుతొ వైద్యశాల నడుపుతున్నాడు డాక్టర్ సచ్చిదానందమూర్తి. అక్కడ పేదలకు వైద్యం ఉచితం. డాక్టర్ మూర్తి ఒక వ్యసనాల పుట్ట. పేదలకు ఉచిత వైద్యం అతని మొదటి వ్యసనమైతే, పుస్తకపఠనం మరో వ్యసనం. స్నేహితుడు సుబ్బారావుతో ప్రతీ ఆదివారం సాయంత్రం తను చదివింది అవలోకనం చేయడం అతని ఇంకో వ్యసనం. ఆపద వేళల్లో మనిషి మరో మనిషికి సాయపడాలన్నది అతని తత్వమైతే, అలా ఆదుకునే మనస్తత్వం అతని మరో వ్యసనం. ఇలా చెప్పుకుంటూ పొతే అతని వ్యసనాలన్ని సమాజ శ్రేయస్సుకు సహాయ పడేవే.

ఇక సుబ్బారావు సంగతికొస్తే, వైద్యోనారాయణో హరి అంటూనే సచ్చిదానందమూర్తిని కూడా స్మరిస్తాడు. అతను చెప్పింది కాదనకుండా వింటాడు. అతనడిగింది అవుననేలా చెబుతాడు. దైవభక్తుడు, పరోపకారి. మంచి, చెడులను విశ్లేషించే కాలజ్ఞాని.

ఆరోజు ఆదివారం. స్నేహితుడు సుబ్బారావు రానే వచ్చాడు.
"సుబ్బారావ్! నేనసలే కొన్ని సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే మరీ ఇంతాలస్యంగా వస్తే ఎలాగోయ్? అయ్యిందా నీ పంపిణీ కార్యక్రమం.” సుబ్బారావు ఆదివారం ఆసుపత్రి రోగులకు పళ్ళు, ఫలహారాలు, పంచిపెడ్తుంటాడు. అంతేకాదు కొంత సహాయం వస్త్ర రూపేణా, ధన రూపేణా కూడా తన పరిధిలో చేస్తుంటాడు.

“ఆలస్యమా! అబ్బే ఆలస్యానికి నాకూ పడదని నీకు తెల్సు. అయినా ఆషాడ పెళ్ళికొడుకులా ఆ తొందరేంటి చరకులవారు. ఇప్పుడు సమయం నాలుగేగా అయ్యింది.” మేలమాడాడు సుబ్బారావు.
“చరకుడు...! అబ్బో నీ చమత్కారాలకేం గాని, నా సందేహాల గురించి చర్చించేదేమైన ఉందా...లేదా?”
“అసలు నేనోచ్చేది నువ్వు చెప్పింది వినడానికే కదా?”
“అయితే విను.” డాక్టర్ మూర్తి మొదలెట్టాడు, “ఒక్కొక్కసారి కొన్ని పరస్పర విరుద్ధ సామ్యాలు నన్ను గందరగోళంలో పడేస్తాయి. అవి ఏమిటంటే  ‘వీడు చాలా సహజంగా మాట్లాడుతాడోయ్, వీడి మాటల్లో ఏదో తర్కముందోయ్, అసలు వీడి మాటలు మరీ వితర్కంగా ఉంటాయోయ్’, అని చాలామంది చాలా సందర్భాల్లో అంటూండడం మనం వింటుంటాం. అలాంటి ఈ తర్క, వితర్కల గురించి నువ్వేమైనా చెప్పగలవా?" అడిగాడు మూర్తి.
“తర్కమంటే ఊహ, వాదన, కారణం ఇలా ఎన్నో అర్ధాలున్నాయి. ఇంగ్లీషులో లాజిక్ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తర్కమంటే ది సైన్స్ ఆఫ్ రీజనింగ్. బాగా చెప్పాను కదూ.” మేధావిలా అన్నాడు సుబ్బారావు.
“నువ్వు మేధావివే. కర్ర విరగలేదు. సర్లే వదిలేయ్. సోది కోసం వెళ్తే అనే సామెతుంది చూశావూ...అలా మనం ఎదో కావాలని వెదుకుతుంటే, ఇంకోకటేదో దొరికి మనకి ఆసక్తిని కలిగిస్తుంది. అలా ఆసక్తిని కలిగించే కణాదుడనే ఓ మహానుభావుడి గురించి నాకివాళ తెల్సింది."అన్నాడు.
“కణాదుడా...! ఆయనెవరు?" ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు.
“నాకూ ఆయన గురించి మొదటిసారిగా తెల్సింది.  ముందు ఆయనో ఋషనుకున్నాను. కాని, ఆయన కీ.పూ.600 శతాబ్దం చెందిన ఒక శాస్త్రవేత్తట. ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడుట. ఈ సకల చరాచర సృష్టి అణు నిర్మితమని ఆయనో సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడుట. ఆయన సిద్ధాంత ప్రకారం ఈ జగత్తులోని పదార్ధాలన్ని అణువులతోను, ఆ అణువులు విడగొట్టాడానికి వీలులేని సూక్ష్మాతి సూక్ష్మ అణువులతోను ఏర్పడతాయని చెప్పాడు. విభిన్న పరమాణువుల విలక్షణ కలయికవల్ల పంచభూతాలు ఏర్పడ్డాయని కూడా అభిప్రాయపడ్డాడు. దాన్ని వైశేషిక దర్శనమన్నాడు. ఆ దర్శనంలో ధర్మం గురించి కూడా ప్రస్తావనుంది. మనుషులకు ఇహ, పరలోక సుఖములు దేనివలన కల్గుతాయో దాన్నే ధర్మం అంటారని దానికి వేద ప్రమాణము కూడా ఉందని చెప్పాడు. ధర్మమార్గాన నిజాయితీతో పయనించే ప్రతి ఒక్కరు ఆ దేవుడి దూతలేనని, దేవానం మనుష్య రూపేణా అన్నాడు. ఏ జ్ఞానమైనా, ఏ విజ్ఞానమైనా సమాజశ్రేయస్సు కుపయోగాపడాలని, ఆపదలలో మానవులు ఒకరినొకరు ఆదుకోవాలన్నది కణాదుడు తీవ్రంగా కాంక్షించాడు. అణు సిద్ధాంతాన్ని ఎంతగా విశ్వసించాడంటే తన అంతిమ ఘడియల్లో ఆయన మిత్రులు కొంతమంది ఆయనను మోక్షప్రాప్తికై నారాయణ స్మరణ చేయమని కోరినా, తను నమ్మిన సిద్ధాంతమే తనకు మోక్షమని తలచి అంత్యదశలో కూడా అణువు, అణువు అని స్మరిస్తూనే మరణించాడట. అటువంటి మహావ్యక్తికి మన హిందూ ధర్మ పరంపరలో గౌరవనీయమైన ఋషిస్థానాన్ని కలిగించి ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అంగీకరించడం గమనార్హం. మన ఉపనిషత్తులు, పురాణాలు ఈ ప్రపంచమంతా నారాయణమయమని చాటి చెప్పాయి. కానీ, కణాదుడు దానికి విరుద్ధంగా ప్రపంచమంతా అణుమయమని ప్రకటించాడు. ఇదీ సంగ్రహంగా కణాదుడు గురించి నేను తెల్సుకున్నది. అయినా ఇదంతా నీకెందుకు చెబ్తున్నాననే ధర్మసందేహం నీకు రావచ్చని నాకు తోస్తోంది. అవునా?" సుబ్బారావుని ఆసక్తిగా పరికిస్తూ అన్నాడు మూర్తి. 
 
“అవును. సందేహం వచ్చిన మాట నిజం. అది ధర్మమో, అధర్మమో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతంలో నున్న నేను ఇహంలోను, పరంలోను సుఖాలను వెదుక్కోవటం లేదు కనుక."ధీటుగానే సమాధానమిచ్చాడు సుబ్బారావు.
“ఓహో! కణాదుడుని అప్పుడే బానే వంటబట్టించు కున్నావు. తెలివైనవాడివి. నీ పరిశీలనా శక్తికి ఓ చిన్న పరీక్ష. పైన నే చెప్పిన కణాదుడు విషయంలో రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలున్నాయి. ఇప్పుడు నీకొక కథ చెప్తాను. ఆ విరుద్ధ ప్రకటనలు ఆ కథలో ఎలా ఇమిడి ఉన్నాయో చెప్పాలి. లేకపోతే నీకు తెల్సు కదా ఏమౌతుందో......?"
డాక్టర్ మూర్తి సుబ్బారావుల పరిచయం విచిత్రంగా జరిగింది. ఆ పరిచయం పెరిగి పెద్దదై ఒకరికొకరు ఆప్తమిత్రులయ్యారు. డాక్టర్ మూర్తి కథను చెప్పాడానికుపక్రమించాడు

###

సమయం ఉదయం అయిదున్నర గంటలు. సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తూ సమస్త ప్రకృతిని పులకరింప చేస్తున్నాడు. గోదావరిలో మూడు మునకలేసిన సోమయాజులు, రెండు చేతుల్లోకి నీరు తీసుకుని ఓం సూర్యాయనమః అని జపిస్తూ సూర్యునికి అర్ఘ్యం అర్పించి తడి పంచెతో గట్టుమీదున్న శివలింగంపై పంచపాత్రతో తెచ్చుకున్న నీళ్ళను పోసి నమస్కరించాడు. 'ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ, గురు శుక్రు శనేభ్యశ్చ రాహువే కేతువే నమః!' అంటూ నవగ్రహ ప్రదక్షిణ పూర్తిచేసి ఇంటికి బయల్దేరాడు. ఇంట్లో యధాప్రకారం నిత్యపూజ కావించి ముందు గదిలోకొచ్చి అతని కోసం ఎదురుచూస్తున్న వారికి నమస్కరించి తన స్థానంలో కూర్చున్నాడు.
సోమయాజులంటే దేవీపట్నం చుట్టుపక్కల ప్రజలకు భక్తి, గౌరవము. భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు, నవగ్రహాల కదలికలు ఆయన చెప్పుచేతల్లో ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోనే వారి జాతక సమస్యల పరిష్కారం కోసం సోమయాజులింటికి పొద్దున్నే చేరిపోతారు. జ్యోతిష్యం సోమయాజులు ప్రవృత్తి. వృత్తి రీత్యా అతనొక ప్రైవేట్ కంపెనీ లో గుమస్తా. ఏడుగంటల నుండి తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విని, వాటికి పరిష్కారాలు వివరించిన తర్వాతే ఉద్యోగానికి తయారవుతాడు. ఇది నిత్యం జరిగే తంతు. అందుకే ఆ రెండు గంటలు సోమయాజులు తీరికలేకుండా ఉంటాడు.
“మీ జాతకంలో దోషమంటూ ఏమీలేదు. కాకపోతే సూర్యానుగ్రహం కావాలి. గ్రహ శాంతి కోసం కొన్ని జపాలు, దానాలు చేయాలి. 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్.....' రోజు శుచిగా ఆదిత్యహృదయాన్ని పఠించండి. ఆపై భానుడి  
 లేలేత కిరణాలు మీ శరీరాన్ని సోకేలా సూర్యామస్కారాలు చేయండి." అంటూ ఒక కాగితం తీసుకుని ఒక శ్లోకం వ్రాసి చదివాడు.
“ఈ శ్లోకాన్ని రోజూ నిష్టగా చదవండి. ఏదో నేను చెప్పానని ఇదొక్కటి చేస్తే సరిపోదు. యధావిధిగా మందులు కూడా వాడాలి. ఎట్టి పరిస్థిల్లోనూ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది చాలా ముఖ్యం. 'వైద్యో నారాయణో హరి....... వైద్యుడు దేవుడుతో సమానం. అన్నీ దేవుడే చేయలేడు కనుక, మన ఆరోగ్యాలను సంరక్షించడానికి వైద్యులనిచ్చాడు. అందుకే వారిపై నమ్మకముంచండి. మీ ఆరోగ్యం తొందరలోనే కుదుటపడుతుంది. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోండి, అప్పుడు మీ ఆరోగ్యం మీ చెప్పు చేతల్లో ఉంటుంది. శుభం." అని కాగితాన్ని అందించాడు.
అతను భక్తితో నమస్కరించి కొన్ని పండ్లతో బాటుగా కొంత సొమ్మును సోమయాజుల కివ్వబోయాడు.
"నేను సొమ్ము కాశపడి ఈ ప్రవృత్తిని చేపట్ట లేదు. మీరంతా నాకేదో తెల్సునని నమ్మి నా దగ్గరకు వస్తున్నారు. నేను అల్పుణ్ణి. నిజంగా నాకేం తెలుసో, ఏం తెలియదో ఆ నారాయణుడికే తెలుసు. డబ్బు తీసుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేయలేను.” అంటూ కేవలం పళ్ళని తీసుకుని డబ్బుని సున్నితంగా తిరస్కరించాడు సోమయాజులు. వివిధ సమస్యలతో వచ్చినవారికి సందేహ నివృత్తిని, నివారణ చర్యలను చెప్పి ఉద్యోగ వేళయ్యిందని లేవబోతుంటే,
"నమస్కారమండీ...."మూడేళ్ళ కుర్రవాణ్ణి తీసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. “పెళ్ళైన పదేళ్ళకు పుట్టాడండి మా బాబు. చురుకుతనం లేదు, పిలిస్తే పలకడు. మాట్లాడడు. ఆడుకోడు. చూపు సరిగ్గా నిలబడక, మెడను పక్కకి వాల్చి ఉంటాడు. మా పల్లెలో ఆచారిగారికి చూపించాం. ఆయన ఏవో కొన్ని పసరు మందులిచ్చి ఆలస్యంగా పుట్టిన కొంతమందిలో ఇలాంటి లక్షణాలు సాధారణమేనని, మరి కొన్నాళ్ళలలో మామూలు స్థితికి వస్తాడని చెప్పారు. రోజులు గడుస్తున్నాయి కానీ వాడిలో ఏ మార్పు రావడం లేదు. మాకు చాలా ఆందోళనగా ఉంది. మా బాబు జాతకంలో దోషం ఏమైనా ఉందానని మీరు పరిశీలించి చెబుతారేమోనని ఆశతో వచ్చానండి." దైన్యంగా పరిస్థితిని వివరించాడు.
ఆతను చెప్పింది విని, "మీ సమస్యను పరిష్కరించే సామర్ధ్యం నాకు లేదు. బాబుని మంచి మానసిక వైద్యునికి చూపించండి. తర్వాత ఆ నారాయణుడే చూసుకుంటాడు.” అనునయంగా మాట్లాడి అతను వెళ్ళిన తర్వాత ఆఫీసు కెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.

###

 రాత్రి ఎనిమిదయ్యింది. బాగా వాన పడుతోంది. వెంకటానికి ఏక్సిడెంటయ్యిందని వసుమతి ఫోనుచేయడంతో కంగారుగా ఆఫీసునుండి హాస్పిటల్ కి పరిగెత్తాడు సోమయాజులు. ఎమర్జెన్సీ వార్డు దగ్గర వెక్కివెక్కి ఏడుస్తున్న వసుమతి దగ్గరకెళ్ళి ఆమెను ఓదారుస్తూ, “ఏం జరిగింది. వాడెలా ఉన్నాడు ?" ఆత్రంగా అడిగాడు.
భర్తను చూసి గొల్లుమంది వసుమతి. "కాలేజీ నుండి వస్తూంటే వర్షంవల్ల బైకు స్కిడ్డయ్యి వేగంగా రోడ్ డివైడర్ని గుద్దేసరికి తలకు గట్టి దెబ్బ తగిలిందిట. ఎడంచెయ్యి, కొన్ని పక్కటెముకలు కూడా విరిగాయిట. ఇంకా ఎక్కడెక్కడో దెబ్బలు తగిలాయో ఎక్సరేలు, స్కాన్లు తీస్తేగాని తెలియదట." ఏడుస్తున్న వసుమతి నొదలి వార్డులో కెళ్ళాడు.
“డాక్టర్ నా కొడుక్కి ఎలావుంది చెప్పండి డాక్టర్ ?" అక్కడున్న డాక్టర్ని అడిగాడు.
“వెరీ బ్యాడ్... మల్టిపుల్ ఫ్రాక్చర్స్. హెడ్ ఇంజురీ. అర్జంటుగా ఆపరేషన్ చెయ్యాలి. బ్లడ్ కావాలి. మీరు రెడీ అంటే మేం ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసినా నలభై ఎనిమిది గంటల వరకు ఏం చెప్పలేం. పేషంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. మీరే మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదమే.....” ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్లు చూసి కొన్ని కాగితాలు చేతిలో పెట్టి రిసెప్షన్లో కనుక్కోమన్నాడు.
వసుమతి మళ్ళీ భోరుమంది. రిసెప్షన్లో ఆ కాగితాలు చూపిస్తే అడ్వాన్సుగా లక్ష రూపాయిలు కట్టండి. ఆ తరవాత ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తామనేసరికి, ఏం చెయ్యాలో పాలుపోలేదు సోమయాజులకు. “ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలంటే మాటలా? ఇప్పుడేం చెయ్యాలి? ఇంత రాత్రి అంత డబ్బు ఎక్కడ్నించి తేవాలి?" మధనపడూతూ అక్కడున్న బెంచిపై కూలబడి కళ్ళు మూసుకున్నాడు. కొడుకు వెంకటావధాని జాతకం కళ్ళముందు కనబడింది. దాని ప్రకారం వాడు పూర్ణాయుష్కుడు. మరెందుకిలా జరుగుతోంది? గ్రహాలు, జాతకాలంటూ తను కాలహరణం చేస్తున్నాడు. తన కొడుకు చనిపోవల్సేందేనా? తను నమ్ముకున్న దైవం నారాయణుడే తన్నీ ఆపదనుంచి కాపడగలడు." చేతనా, అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు.
“సోమయాజులుగారు.....సోమయాజులుగారు" అన్న పిలుపుతో కళ్ళు విప్పి చూసాడు. తెల్లని కోటు, మెళ్ళో స్టెతస్కోప్ తో ఎదురుగా ఒక డాక్టర్.  
“మీరు దేవీపట్నం సోమయాజులుగారు కదూ? నన్ను గుర్తు పట్టారా? నేనండీ...డాక్టర్ మూర్తిని. మీకు గుర్తుందోలేదో చాలా కాలం క్రితం ఓ విపత్కర పరిస్థితిలో మిమ్మల్ని కలిసాను. ఈ హాస్పిటల్ మాదే. ఇది కట్టిన తర్వాత నా జీవితంలోనూ, కాపురంలోనూ ఊహించని పరిణామాలు సంభవించి నన్ను వత్తిడికి గురిచేశాయి. ఆ వత్తిడి తట్టుకోలేక మానసికంగా కృంగిపోయాను. ఆ దశలో నేను పిచ్చివాడినై పోతానేమో నా భార్య
 భయపడిపోయింది. అప్పడే మిమ్మల్ని కలవమని ఎవరో నా భార్యకు సలహా ఇచ్చారు. అణునిర్మాణం మానవ కణనిర్మాణం చదివిన నాకు జాతకాలు, గ్రహాలపై నమ్మకం లేదు. కానీ, నన్ను నమ్మిన వారి కోసం నా నమ్మకాలను పక్కన పెట్టి మీ దగ్గర కొచ్చాను. తర్క వితర్కాలకది సమయం కాదు. వాటి కతీతమైనది నా రుగ్మత, నా భార్య నమ్మకమూ. నా గ్రహాల కదలికలను పరిశీలించి కొన్ని సలహాలిచ్చారు. మీ సలహాలను కూడా ఆచరిస్తే పోయేదేమీ లేదని విశ్వసించి పాటించాను. ఏదేమైతేనేం ఇదిగో ఇలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టేరా? అదిసరే మీరేమిటీ ఈ టైంలో ఇక్కడ? ఎవరికైనా...?" అంత పెద్ద డాక్టరు వినమ్రంగా అడిగేసరికి భోరుమంటూ సోమయాజులు జరిగింది చెప్పాడు.
“మీరేం బాధ పడకండి. మీలా గ్రహాల స్థితిగతుల్ని మార్చలేనేమో కాని, మీ అబ్బాయి ఆరోగ్యాన్ని మాత్రం బాగు చేయగలనని భరోసా ఇస్తున్నాను.” నమస్కరించి వెంకటావధానిని చూడడానికి వెళ్ళారా డాక్టర్.
డాక్టరుగారు ఎంత అభయమిచ్చినా రాత్రంతా హాస్పిటల్లో ఆందోళనతోనే గడిపారు వసుమతి, సోమయాజులు. తెలతెలవారుతుండగా కొడుకు త్వరలోనే కోలుకుంటాడని వార్త తెలిసి,
“జాతకాలు, గ్రహాలూ నమ్మని డాక్టర్ తన సలహాలని పాటించి ప్రతికూలతల నుంచి బయటపడడమేమిటి? గ్రహాల స్థితిగతులను బట్టి రుగ్మతలుంటాయని నమ్మిన తనను ఆ డాక్టరే దేవుడిలా వచ్చి ఆదుకోవడమేమిటి? ఆ నారాయణుడి లీల కాకపొతే.” అనుకున్నాడు సోమయాజులు.

###

“మరి కథ విన్నావుగా. కణాదుడు సర్వం అణుమయమన్నాడు. సోమయాజులు  సర్వం నారాయణమయమని నమ్మాడు. ఈ ద్వైధీభావనే నన్ను అయోమయానికి గురిచేస్తోంది. ఇక నీ పరిశీలన, విశ్లేషణ వింటే ఏమౌతానో?" కవ్వింతగా అన్నాడు మూర్తి.
“గ్రహాల స్థితిగతుల ననుసరించి మానవ రుగ్మతలుంటాయని విశ్వసించే సోమయాజులు, అదంతా మూఢ నమ్మకమని భావించిన డాక్టరు నీ కథలో రెండు విభిన్న ప్రవృతులు కల్గిన వ్యక్తులు.  ‘నేను అల్పుణ్ణి. నిజంగా నాకేం తెలుసో, ఏం తెలియదో ఆ దేవుడికి మాత్రమే తెలుసుననుకునే’ సోమయాజులకు కణాదుడు ప్రతిపాదించిన అణుసిద్ధాంతం బహుశా తెలియకపోవచ్చు. కాని ఆధునిక వైజ్ఞానికశాస్త్రానికి ప్రతినిధిగా, మానవ శరీరరుగ్మతలను పోగొట్టే డాక్టరుకు అణుసిద్ధాంతం, మానవశరీర కణనిర్మాణము తెలిసినా కూడా భార్య బలవంతంమీద సోమయాజులను ఆశ్రయించి స్వస్థత పొందాడు. మరి కణాదుడు ఏం చెప్పాడు? ఏ జ్ఞానమైనా, ఏ విజ్ఞానమైనా సమాజశ్రేయాస్సు కుపయోగాపడాలని, నిజాయితీగా ధర్మమార్గాన పయనించే ప్రతి ఒక్కరు ఆ దేవుడి దూతలేనని. అవునా? మీ కథలో సోమయాజులు, డాక్టరు ఇద్దరు నిస్వార్ధంతో, పరోపకార ధర్మంతో ప్రవర్తించారు, నియమబద్ధమైన తర్కాన్ని ప్రదర్శించారు. ప్రపంచం అణుమయమైనపుడు, సర్వవ్యాపక నారాయణతత్త్వం దానిని కూడా ప్రభావితం చేస్తుందన్నది అక్షరసత్యం. నారాయణవాదం లేని అణువాదం అర్థరహితమేమో అని నాకనిపిస్తుంది. ఈ ద్వైధీభావనను విస్మరించకుండా, సమాజశ్రేయస్సుకు పాటుపడే ప్రతిమనిషిలోని అణువణువు నారాయణమయమే అనుకుంటే సరిపోతుంది.” సుబ్బారావు నవ్వుతూ తన విశ్లేషణను ముగించాడు.
(అయిపోయింది)
#####

No comments:

Post a Comment