*మళ్ళీ చిన్న పిల్లలుగా తయారు కండి !!!*
*ప్రేమస్వరూపులారా!*
మీరందరూ మళ్ళీ చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము. పిల్లలలో కోపతాపములు, అసూయ, డంబము, అహంకారమువంటి దుర్గుణాలు ఉండవు. ఒక పర్యాయం ఏసుక్రీస్తు తన చుట్టూ చేరిన గుంపులో ఒక తల్లివద్ద చంటి బిడ్డను చూశాడు. ఆ బిడ్డను ఎత్తుకొని, “ఈ చంటిబిడ్డ అంటే నాకెంతో ప్రీతి. ఎందుకంటే, ఈ బిడ్డయొక్క భావములన్నీ భగవంతుని భావములవలె నిర్మల మైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనవి” అన్నాడు.
పెరిగే కొలదీ పిల్లలలో ఆశా పాశములు, కోపతాపములు ప్రారంభమౌతుంటాయి. వాటితో పాటు విచారములుకూడా పెరుగుతుంటాయి. కనుకనే, వయస్సు పెరిగే కొలదీ కోరికలను తగ్గించుకుంటూ రావాలి. కోరికపై మనం అదుపు సాధించాలి. అప్పుడే మనలో దైవశక్తి ఆవిర్భవిస్తుంది. వయస్సు పెరిగే కొలదీ మనలోని ఆశలే మనలను క్రుంగదీస్తున్నాయి. కాబట్టి, ఆ మాయను మనం పూర్తిగా తొలగించుకోవాలి.
చిన్నబిడ్డలకు ఎంత నిర్మలమైన భావము! ఎంత నిశ్చలమైన తత్త్వము! ఎంత నిస్వార్థమైన సంకల్పను! అదియే దైవత్వమునకు చిహ్నము. మనము అట్టి నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన భావములతో జీవించాలి..
ప్రేమస్వరూపులారా! దినమునకు కనీసం ఒక్క నిమిషమైనా మీరు చిన్నపిల్లలుగా తయారుకండి. కోరికలు తలెత్తితే 'ఛీ, ఇవి నాకు తగినవి కావు' అని వాటిని ప్రక్కకు నెట్టండి. ఆవిధంగా కోరికలను ఢీకొట్టినప్పుడే మనం ధైర్యంగా నిలువగలము. - బాబా.
*28.8.2004 - సనాతన సారథి, మా 2013 పు – 15.*
No comments:
Post a Comment