Tuesday, July 22, 2025

 దేవాలయాల అద్భుతాలను గుర్తించుదాం

భారతీయ ఆలయవ్యవస్థని భారతీయులైనా సరిగ్గా అర్ధం చేసుకునే ప్రయత్నాలు జరగడం లేదు. అన్ని మతాలతోపాటు హిందూమతాన్ని కూడా కలిపి, వాటి స్థాయిలోనే హిందూ భావనల్ని అంచనా వేయడం ఇప్పుడు జరుగుతున్న పెద్ద తప్పిదం. ప్రతి మతభావనకు దాని ప్రత్యేకత ఉంటుంది. అది వేరే విషయం.

           హిందూమతంగా వ్యవహరింపబడుతున్న భారతీయ సనాతనధర్మంలో దేవాలయాల నిర్మాణాన్ని అనేక కోణాలలో పరిశీలించవలని ఉంది. మొదటిగా మనం తెలుసుకోవలసినది - అవి కేవలం విశ్వాసానికి నిలయమైన ప్రార్ధనామందిరాల వంటివి కావు. వారంలో ఒకసారి వెళ్ళి క్షమాపణలు చెప్పుకునే ప్రాంతాలు కూడా కావు.

           మన దేవాలయాల కట్టడాల వెనుక ఒక పద్ధతి ఉంది. ఒక విజ్ఞానం ఉంది. అపూర్వమైన కళా సౌందర్యం మాత్రమే కాక - నిర్మాణవైఖరిలో ఉన్న మెలకువలను గమనించితే ఆ ప్రాంతపు ప్రకృతి పరివేశాన్ని, జల స్థల వనరుల్ని సమతౌల్యపరిచి, సమృద్ధి చేసే వైజ్ఞానిక రహస్యమేదో దాగి ఉంది. కానీ ప్రభుత్వాల రాజకీయ ప్రాబల్యంలో ఉన్న మేధావివర్గం, వైజ్ఞానిక రంగం వీటి గురించి అలోచించి, పరిశోధించడం లేదు.

 మన ఆంధ్రదేశంలోనే 'మహానంది' వంటి ఆలయాలను పోలి కర్నూలు పరిసరాలలో కొన్ని శివాలయాలు ఉన్నాయి. అక్కడ ఆలయం, సమీపంలోనే చక్కని కొలను, దానిలోని నీటితో చాలా ఎకరాలకు సాగుదల జరగడం... ఏదో విజ్ఞానపరమైన నిర్మాణ విధానాన్ని చెబుతోంది. పర్వత ప్రాంతాలలో, నదీ తీరాలలో, అరణ్యభూములలో ప్రత్యేక తరహాలలో ఆలయాలు నిర్మించబడిఉన్నాయి. అవి ఏదో తోచినట్టు కట్టుకున్న మతకేంద్రాలుగా కాకుండా ఒక ప్రత్యేక అవగాహనతో నిర్మించుకున్నవిగా స్పష్టమౌతుంది. ఆ అవగాహన ఏమయ్యుంటుందో ఆలోచించాలి.

ఏ రకపు శిలాశాస్త్రం, శిల్పశాస్త్రం ఏర్పరచుకోవడం చేత హంపి ఆలయాల స్తంభాలు సంగీత, జంత్ర వాద్య స్వరాలను పలుకుతున్నాయో ఇంతవరకు సరిగా గమనించలేదు. కొన్ని గ్రామాలలోని ఆలయాల గోడలు, గోపురాలు ఆ ఊరి వాతావరణాన్ని సైతం అదుపు చేసే లక్షణంతో నిర్మించారు. అనేక ఆలయాల సమీపాలలో కోనేరులు ఆ ఊరి జలవ్యవస్థను సమృద్ధి పరచే నిమిత్తంగానూ, ఆలయాన్ని దృఢంగా నిలిపేందుకుగానూ నిర్మాణమై ఉండవచ్చు.

డేవిడ్ స్మిత్ లాంటి పాశ్చాత్యులు చిదంబరం లాంటి క్షేత్రాలలో ఆలయ నిర్మాణ విధానంలోని అద్భుతాలను వారి గ్రంథాలలో కొనియాడారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని కట్టడాలు మనకున్నాయి.

మన విగ్రహ శిల్ప నిర్మాణాలలో శిలను ఎంచుకోవడం దగ్గర నుండి, శిల్పీకరించడం వరకు చాలా క్రమపద్ధతులు ఉన్నాయి. మంత్ర, యంత్ర విజ్ఞానం, స్థల, జల విజ్ఞానం వంటివి అధ్యయనం చేసి పరస్పరాధారంగా నిర్మించినవే మన ఆలయాలు.

డా॥ జాన్ డి. మిల్వే అనబడే కాలిఫోర్నియా విశ్వ విద్యాలయాచార్యుడు కాశీక్షేత్రంలోని ద్వాదశాదిత్యుల మందిరాలను పరిశీలించి సౌరశక్తిని పుష్కలంగా గ్రహించే కేంద్రాలుగా వాటిని వైజ్ఞానికంగా ఋజువు చేశాడు. అదే క్షేత్రంలోని ఏభై ఆరు గణపతుల మందిరాలు వైశ్వికశక్తిని కేంద్రీకరించుకున్న ప్రాంతాలుగా గుర్తించి నిరూపించాడు. "మేము యంత్రాల సాయంతో వీటిని గుర్తించగలుగుతున్నాం. కానీ ఏ యంత్రమూ లేకుండా అత్యంత ప్రాచీనకాలంలోనే భారతీయ విజ్ఞానవేత్తలు ఈ భూకేంద్రాల్లోని శక్తిని ఎలా గ్రహించగలిగారో! అప్పట్లో ఈ విజ్ఞానం ఈ దేశంలో ఉండేదేమో! లేక, అద్భుతమైన ధ్యానశక్తితో గోచరమై ఉండవచ్చు" అని అతడు స్వయంగా అబ్బురపడ్డాడు.

బాగా ఆలోచిస్తే ప్రాచీన ఆలయాలకు కేవలం కట్టడాల ప్రాధాన్యమే కాక ఆ నేలలో కూడా ఒక అద్భుత శక్తిరహస్యం కేంద్రీకృతమై ఉన్నదని అర్ధమౌతోంది. దీనిని బట్టి మన ఇష్టానుసారం ప్రాచీన ఆలయాలలోని దేవతలను, స్థానాలను మార్చరాదన్నది స్పష్టమౌతుంది.

అంతేకాక భిన్న భిన్న ఆలయాలకు భిన్న భిన్న ఆగమ శాస్త్రవిధానాలు ఉన్నాయి. పురుష విగ్రహాలకు వాడే శిల వేరు. స్త్రీ శిల్పాలకు శిల వేరు. మూలవిరాట్టుకు ఉపయోగించే శిలలోనూ, పరివార దేవతలకు వినియోగించే శిలలోను కూడా భేదాలున్నాయి. 

కుడ్య శిల్పాలకు వాడే శిలలు వేరు. అలాగే కొలతల భేదాలు కూడా ఉంటాయి. ఆలయానికీ, గర్భగుడికీ, అందులోని లింగానికీ, లేదా మూలవిరాట్టుకీ కొలతలలో నిర్దిష్టమైన శాస్త్రపు పరిమాణాలున్నాయి. దిశల నిర్దేశాలున్నాయి. అలాగే ఆయా మందిరాలలో జరిగే సేవారూప కైంకర్యాలవల్ల జాగృతమయ్యే శక్తి పరిథులు కూడా విశిష్టమైనవి.

వీటన్నిటినీ విశ్లేషిస్తూ వెళితే - మనమేదో మొక్కుబడిగా వెళ్ళి దండాలు పెడుతున్నంత తేలికపాటి విషయం కాదు దేవాలయ వ్యవస్థ అంటే... అన్నది అర్థమౌతుంది. ప్రతి దేవాలయానికి తనదైన ప్రత్యేకత ఉంది.

ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక, దైవిక, కళా... విద్యల సమాహారమే భారతీయ దేవాలయం.

మూర్ఖత్వం, హింస ప్రాతిపదికగా గల భావనాభూమికతో ఉన్న విదేశీయుల దాడులలో చాలా పోగొట్టుకున్నాం. మిగిలిన వాటిని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఉన్నవాటిని పరిశీలనాత్మక దృష్టితో గమనించితే మరికొన్ని విజ్ఞాన రహస్యాలను వెలికి తీయగలమన్న ఆలోచన కూడా మనవారికి కలగడం లేదు. మన ప్రాచీనులు విజ్ఞానరహితులనే భావన మనలో ప్రగాఢంగా ఉండడం చేతనే ఈ నిర్లక్ష్య వైఖరి ప్రబలుతోంది. 

అన్నిటినీ మించి మన భౌతికదృష్టికి మించిన దివ్యత్వ మహిమ వీటి వెనుక ఉన్నదనే భావనలో ఏ సందేహమూ లేదు.

నేలను క్షేత్రంగా, నీటిని తీర్ధంగా ఆవిష్కరించుకున్న తపోబల సంపన్నులున్న దివ్య భారతసంస్కృతికి వారసులమైన మనం వాటి పవిత్రతను, సంప్రదాయ మర్యాదలను అతిక్రమించకుండానే ఆ విజ్ఞానాన్ని గమనించే ప్రయత్నాలు చేస్తే ప్రపంచం ఆశ్చర్యపడే అద్భుతాలను అందించగలం.

No comments:

Post a Comment