Tuesday, July 22, 2025

 *కార్తవీర్యార్జునుడి కథ*
కార్తవీర్యార్జునుడు హైహయ వంశపు రాజు. వింధ్య పర్వతాల చెంతనగల మహిష్మతీపురం అతడి రాజధాని. పురోహితుడైన గర్గ మహర్షి ఉపదేశంతో దత్తాత్రేయుణ్ని ప్రసన్నం చేసుకున్న వీరుడు- కార్తవీర్యార్జునుడు. శత్రువుల నుంచి ఓటమి లేకుండా వరాలు పొందాడు.

కార్తవీర్యుడి కథ రావణాసురుడికి తెలిసింది. వేయి చేతులతో వీరవిహారం చేసే కార్తవీర్యుణ్ని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో కార్తవీర్యుడు నర్మదా నదీతీరాన సరసాల్లో మునిగితేలుతున్నాడు. అటువంటి స్త్రీలోలుడు తనతో యుద్ధానికి రాలేడని రావణుడు భావించాడు. అయితే బలాఢ్యుడైన కార్తవీర్యుడు రావణాసురుణ్ని ఓడించి బందీని చేశాడు. రావణుడి తాత పులస్త్య బ్రహ్మ. మనవడి పరాజయం వార్త విని పరుగున వచ్చి కార్తవీర్యుణ్ని మంచి చేసుకుని రావణుణ్ని విడిపించుకున్నాడు.
ఒకసారి అగ్నిదేవుడు ఆకలితో అలమటిస్తూ కార్తవీర్యుడి దగ్గరికి వచ్చి తనకు ఆహారం సమకూర్చమని అడిగాడు. కారడవులను కార్చిచ్చుతో దహించినప్పుడే అగ్నిదేవుడికి ఆకలి చల్లారుతుంది. భారతంలో ఖాండవవనాన్ని- కృష్ణార్జునుల సాయంతో ఆహుతి చేసినట్లే- కార్తవీర్యుడి అనుమతితో గిరినగర అరణ్యాలను భక్షించడానికి అగ్ని సిద్ధపడ్డాడు. అదే అటవీ ప్రాంతంలో వరుణుడి కుమారుడు మైత్రీ వరుణుడి ఆశ్రమం ఉంది. అగ్నిదేవుడి ప్రతాపానికి అది కూడా కాలి బూడిదైంది. గొప్ప తపస్సంపన్నుడైన ఆయన జరిగిందానికి స్పందించకపోయినా, ఆయన కుమారుడు మాత్రం ఈ దురాగతానికి కారణమైన కార్తవీర్యుడి వేయి చేతులను- పరుశురాముడు వచ్చి ఖండించుగాక! అని శపించాడు.

శాపగ్రస్తుడైన నాటి నుంచి కార్తవీర్యుడు ధర్మమార్గంలో జీవించడం ఆరంభించాడు. అయినా ఆ స్థితిలో సైతం లోభానికి లోబడి భ్రష్టుడైన ఉదంతాన్ని భాగవతం వివరించింది. ఒకరోజు అతడు పరివారంతో సహా వేటకు వెళ్లాడు. ఎక్కడెక్కడో తిరిగి, ఆకలిదప్పులు పీడిస్తుంటే చివరికి పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరాడు. జమదగ్ని సాదరంగా ఆహ్వానించాడు. ఏ కందమూలాలో పెడతాడని కార్తవీర్యుడు ఆశిస్తే- పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం వడ్డించాడు. అప్పటికప్పుడు అంత గొప్ప విందుకు ఏర్పాట్లు ఎలా జరిగాయని కార్తవీర్యుడికి అనుమానం వచ్చి ఆరాతీశాడు. జమదగ్ని మహర్షి వద్ద గల సుశీల అనే గోవు కారణంగా క్షణాల్లో రాజోచితమైన భోజనం సిద్ధమైందని తెలిసింది. వెంటనే కార్తవీర్యుణ్ని లోభం ఆవహించింది. మహిమాన్విత కామధేనువును తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ‘మీవంటి బలహీనుల దగ్గర దానికి రక్షణలేదు, ఏ బందిపోట్లో ఎత్తుకుపోతే ఎలా’ అనే విచిత్రమైన తర్కంతో దాన్ని బలవంతంగా తోలుకుపోయాడు. జమదగ్ని మౌనం వహించాడు కానీ, ప్రతాపవంతుడైన కొడుకు పరశురాముడు ఊరుకుంటాడా? వెళ్లి వేయి చేతులూ నరికేసి గోవును దక్కించుకున్నాడు. అరిషడ్వర్గాల్లో ఒకటైన లోభం కారణంగా మనిషి ఎంతకు దిగజారతాడో చెబుతుంది కార్తవీర్యుడి కథ.
~ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment