" ఈ రచన నా స్వంతరచన " - తులసీభాను
💜💛 మనసు కథలు 💛💜
💚💚 మరువలేని ప్రేమ 💚💚
సువర్ణా, సువర్ణా... అంటూ లోపలికి వచ్చాడు ప్రదీప్. గేటు వేసేసి ఇంటి తాళం తీసాడు.
సువర్ణ చిక్కుడుకాయలు వలుస్తూ భోజనాలబల్ల దగ్గర కూర్చుని ఉంది. మళ్ళీ సువర్ణా, సువర్ణా అని పిలుస్తూ సువర్ణ దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యేసి తల మీద ఓ ముద్దు పెట్టాడు.
ఎహే చెయ్యకలా అంటూ విసుక్కుంది సువర్ణ,
ప్రదీప్ ని. ప్రదీప్ బల్ల మీదున్న సీసాలోని నీరు తాగి తానూ చిక్కుడుకాయలు వలుస్తూ సువర్ణ మొహాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు.
సన్నగా సువర్ణకి ఇష్టమైన 'మనిషొకో స్నేహం మనసుకో దాహం' అనే ఆత్మబంధువు సినిమా
పాట వినిపిస్తోంది. ఇరవైనాలుగు గంటలూ సువర్ణకి ఇష్టమైన పాటలు సిడీ లు పెడుతూనే ఉంటాడు ప్రదీప్.
సువర్ణకి ఇష్టమైన వాతావరణం ఇంట్లో స్రృష్టించి ఉంచుతాడు ఎప్పుడూ ప్రదీప్.
చిక్కడుకాయలు వలిచేసారు అనుకున్నాక సువర్ణ లేచి పడగ్గదిలోకి వెళ్ళబోయింది. సువర్ణా ఆగు అంటూ సువర్ణ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు చేతులు కడగడానికి పంపు దగ్గరికి.
ఏయ్ నా చెయ్యి వదులు అని చెయ్యి విదిలించుకుంది సువర్ణ. కాదమ్మా చేతులు మురికి అయ్యాయి కదా అన్నాడు ప్రదీప్.
ఎక్కడా ఏమీ లేదు చూడు అనేసి గబగబా గదిలోకి వెళ్ళి పడుకుండిపోయింది సువర్ణ.
ప్రదీప్ వంటింట్లోకి వెళ్ళి సువర్ణకి ఇష్టమైన మామిడికాయ పప్పన్నం కలిపి ఊరమిరపకాయలు పక్కన వేసి సువర్ణ దగ్గరకు వచ్చి ఆమె నోటికి ముద్దను అందించబోయాడు. ఛీ నువ్వెవరు నాకు తినిపించడానికి అని సువర్ణ గిన్నెను తీసేసుకుంది. ఇది ఇలా జరగొచ్చు అని తెలుసు కాబట్టి ప్రదీప్ టక్కున చెంచాను అందించాడు సువర్ణకు.
హూ అంటూ ప్రదీప్ మీద విసుక్కుంటూనే చెంచాతో గబగబా అన్నం తింటోంది ఆకలితో ఉన్న సువర్ణ.
ఆ సాయంత్రం సువర్ణ జుట్టును దువ్వుతున్నాడు ప్రదీప్. నువ్వెవరు నా జుట్టు దువ్వటానికి, దువ్వెన నాకు ఇవ్వు అంటోంది సువర్ణ.
వద్దమ్మా జుట్టు చిక్కు చేసుకుంటావు అంటున్నాడు ప్రదీప్. నన్ను అమ్మా అమ్మా అంటావు కదా అంటే నువ్వు పిల్లాడివి కదా, మరి నా మాట నువ్వు వినాలి, దువ్వెన ఇచ్చెయ్యి నాకు అంది మొండిగా సువర్ణ. పర్లేదు సువర్ణా నేను చేస్తాగా, ఇదుగో నీకు ఇష్టమైన మల్లెపూలమాల కూడా ఉంది.
జడ వేసి పూలు పెడతాను ప్లీజ్ అని బతిమాలుతున్నాడు ప్రదీప్.
నెమ్మది నెమ్మదిగా సువర్ణను ఒప్పించుకుంటూ లక్షణంగా జడేసి పూలు జడలో పెట్టి అద్దంలో చూపించాడు సువర్ణకు. ఎవరు ఈవిడ అంది అద్దంలో తనను తానే చూసుకుంటూ.
మతిమరుపు పెరిగిపోయింది సువర్ణకు అని అనుకుంటూ, సరే సరే అని అంటూ అద్దం పక్కకు తీసేసి ఫోన్ లో మంచి మంచి ప్రక్రృతి ఫొటోలు చూపిస్తున్నాడు ప్రదీప్.
మరొక కొత్తరోజు. కొడుకు పొద్దున్నే తలుపు తట్టాడు. ప్రదీప్ తలుపు తీసాడు. కొడుకు శ్రవణ్, కోడలు సమీర. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా అంటూ శ్రవణ్ ప్రదీప్ ని కౌగలించుకున్నాడు.
సువర్ణ ఎవరూ అన్నట్టు ఆసక్తిగా హాల్లోకి వచ్చి చూస్తోంది. అమ్మా అంటూ శ్రవణ్ సువర్ణను దగ్గరకు తీసుకోబోయాడు. ఊ అంటూ విసురుగా వెనక్కి జరిగింది ఎవరో అన్నట్టుగా. శ్రవణ్, సమీర ప్రదీప్ ని చూసారు సమస్య పెరిగినట్లుందిగా అన్నట్టు. అవునని తలూపాడు ప్రదీప్.
అయినా ప్రదీప్ లానే సహనంగా శ్రవణ్ సువర్ణతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. సువర్ణకు బుద్ధి పుడితే వినేది లేదంటే విసుగ్గా మొహం పెట్టుకునేది. సాయంత్రం ఇల్లంతా అలంకరణ మొదలుపెట్టాడు శ్రవణ్. తల్లితో పదిసార్లయినా చెప్పాడు, అమ్మా ఇవాళ నాన్నది షష్ఠి పూర్తి, నాన్నకు అరవై ఏళ్ళు నిండాయి అని. ఆ విషయం అయితే అర్ధం చేసుకోలేదు కానీ సువర్ణ అమ్మా అమ్మా అని అతనూ పిలుస్తాడు, నువ్వూ పిలుస్తావు ఎవరు మీరంతా చిరాకు చేస్తూ నన్నూ అని గట్టిగా విసుక్కుంది. అమ్మా నేను నీ కన్నకొడుకుని, ఆయన నీ భర్త అని స్పష్టం చేసాడు శ్రవణ్. ఆ అని చిరాగ్గా మొహం పెట్టింది తప్ప భావోద్వేగాలు తెలియలేదు సువర్ణకు.
బంధాలను మరిచిపోయి నాలుగేళ్ళు అవుతోంది సువర్ణకు అల్జీమర్స్ అనే మతిమరపు వ్యాధి వచ్చి. ప్రదీప్ , సువర్ణ ఒకే తరగతి విద్యార్థులు . ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో మూడు నెలల్లో సువర్ణకూ అరవై యేళ్ళు నిండుతాయి. శ్రవణ్, సమీరలది కూడా ప్రేమవివాహమే. సమీర తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే ప్రదీప్ వాళ్ళే దగ్గరుండి వాళ్ళ పెళ్ళి జరిపించారు.
వారం రోజులు ఉన్నారు శ్రవణ్, సమీర సువర్ణ వాళ్ళ దగ్గర. పూర్తి పరాయిమనిషిలా ప్రవర్తిస్తున్న సువర్ణను చూసి ప్రదీప్ పరంగా బాధ వేసింది సమీరకు. మావగారితో చెప్పింది " ఏదైనా వ్రృద్ధాశ్రమంలో అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉండేచోట అత్తయ్యను ఉంచుదాము. తన దగ్గర ఎవరున్నా ఆవిడకు పట్టింపు లేదు కదా, మరి మీరే ఎందుకుండాలి, ఆవిడతో పాటూ మీ జీవితమూ నిస్సారంగా మారిపోయింది. అంది సమీర.
ప్రదీప్ చిన్నగా నవ్వుతున్నాడు ఆ నవ్వు వెనుక బాధ శ్రవణ్ కు తెలుస్తోంది. ప్రదీప్ చెప్పాడు పిచ్చితల్లీ ఆవిడ దగ్గర ఎవరున్నా ఆవిడకు పట్టింపు లేదు. కానీ నాకు ఆవిడతో ఉన్నాను అన్న త్రృప్తి సంత్రృప్తి ప్రశాంతత చాలు మిగిలిఉన్న ఈ జీవితం మొత్తం ఆవిడ పేరు మీద రాసిచ్చేస్తాను. ఆవిడ భుజం మీద చెయ్యేసి ఆవిడ తల మీద ఓ ముద్దు పెడితే నాకు ఆ రోజు పరిపూర్ణమయినట్లే అని. శ్రవణ్ ప్రదీప్ దగ్గరకు వచ్చి చాలా ఆప్యాయంగా అపురూపంగా కౌగలించుకుని తండ్రి భుజం మీద నిజమే అన్నట్టు చేతితో తట్టాడు.
ప్రేమ...
రోజులతో, వయసులతో ముగిసిపోయేది కాదు, అనంతాల వరకూ మనుష్యులనూ, మనసులనూ కలిసి నడిచేలా చేసేది, నడిపించేది...
తులసీభాను
మంగళవారం
11 july 2023
🌹సేకరణ 🌹
No comments:
Post a Comment