మిత్రులు అందరికి విజ్ఞప్తి...
ఈరోజు మనం ఒక స్థితి (ఆధ్యాత్మిక, భౌతిక, ప్రాపంచిక) లో ఉన్నామంటే అదంతా మన పూర్వజన్మ సుకృతం, ఈ జన్మలో మన ప్రయత్నం. ప్రాపంచిక స్థితిగతులు మనం చేసుకున్న కర్మఫలాలు. ఆధ్యాత్మిక ఉన్నతి మనం జన్మజన్మలుగా చేస్తున్న సాధనాఫలితం. మనం ఏ స్థితిలో పూర్వజన్మలలో శరీరం వదిలామో అక్కడకు ఈ జన్మలో త్వరగా ప్రయాణం చేస్తాము. అక్కడ నుండి ఎంత పైకి వెళ్ళగలుగుతామో అన్న విషయం పూర్తిగా మన సాధన మీద ఆధారపడి వుంటుంది.
*నేనేదో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను. అసలు నేను ఉద్ధరింపబడతానా?* అనే సందేహాలు వద్దు.
ఒక విషయం మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ప్రతీ ఒక్కరు ఏదో ఒక మెట్టు మీద ఉన్న వాళ్ళమే. కొందరు పై మెట్ల పై ఉంటె కొందరం కింద సోపానంలో ఉండవచ్చు. ఈ ఆధ్యాత్మిక వైకుంఠపాళీ లో గురు అనుగ్రహం, దైవానుగ్రహాలు మనకు ఒక్కసారి పైకి తీసుకెళ్ళే నిచ్చేనలైతే...
కామక్రోధలోభమోహాదులు మనను కిందకు పడదోసే పాములు.
మనం ప్రతీ ఒక్కరం ఒకొక్క వేగంగా మన ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ ఉంటాము. మన స్థితినిబట్టి మనకు గురువులు ఏమి చెయ్యాలో నిర్దేశిస్తారు. అసలు గురువు దొరకడం కూడా దైవానుగ్రహమే. మన సాధన ఒక స్థితికి వచ్చాక మనం పూజిస్తున్న భగవంతుడే గురువును మనకు దగ్గర చేస్తాడు. మన పక్కనే గురువు ఉన్నా కూడా మనకు సమయం వచ్చేదాకా వారిలో ఆ తేజస్సును మనం దర్శించలేకపోవచ్చు.
ఒకసారి గురువు లభ్యమయ్యాక వారు మనలోని మనఃప్రవృత్తులను బట్టి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తారు. కొందరికి ధనం మీద వ్యామోహం విపరీతంగా ఉన్నవారికి దానం చెయ్యమని, మరి దేనికో ఖర్చు చెయ్యమని చెబుతారు. వారిని ఆ ధనపరంగా చూస్తె పాడయిపోయేది మనమే. కొందరికి కామవికారాలు తొలగించడానికి మరొక సాధన ఏర్పాటు చేస్తారు. కొందరికి గర్వం అణచడానికి మరొక సవాలు విసురుతారు. మనం తట్టుకోగలిగిన సవాళ్ళనే దేవుడు ఇస్తాడని పెద్దలు చెబుతారు.
మన పాపపుణ్యాలు మనం వాటిని అనుభవించే స్థితిలోనే పక్వమై మనకు అందుతాయి. మనకు ఏ సాధన ప్రాప్తం వుందో ఏ పద్ధతి ప్రకారం తప్పక మజిలీ చేరుతామో అదే మనకు దొరుకుతూ వుంటుంది.
లౌకిక ఉదాహరణకు గూగుల్ మాప్స్ తీసుకోండి. ఒక ప్రదేశం నుండి మరొక చోటికి వెళ్లాలని మనం అడిగితే ఒక నాలుగు రకాల దారులు చూపుతుంది. మరల కార్ లో వెళ్ళే దారి వేరేగాను, నడక దారి వేరేగాను, ట్రైన్ లో వెళ్ళే దారి వేరేగాను అందులోను మరెన్నో దారులు కనబడతాయి. నీకున్న అవకాశాన్ని బట్టి దాన్ని అనుసరిస్తాము. వీటి ఒకొక్క దానిలో మజిలీలు కూడా మారుతూ ఉంటాయి. దీన్నే మనం ఆధ్యాత్మికానికి అన్వయం చేసుకుంటే వేరొకరి సాధనాక్రమం మనకన్నా భిన్నంగా ఉంటుంది. వారి సాధనా సంపత్తి మనకన్నా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారికున్న అనుగ్రహం మరెంతో వైభవంగా వుంటుంది. వారు మనకన్నా ఎన్నో మైళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను సరిగ్గా సాధన చేస్తున్నానా, అసలు నేను ఉద్ధరింపబడతానా అన్న అనుమానాలు మనకు రావడం సహజం.
ఎవరు ఏ దారిలో వెళ్ళినా చివరకు చేరవలసిన మజిలీ మనలను దేవుడు చేరుస్తాడు. ఆయన మీద పూర్తి నమ్మకం, శ్రద్ధ, ఓపిక మనకు ఉండాలి. తప్పక ఉద్ధరింపబడతాము. మన క్లాస్ లో ఉన్న అందరూ ఒకే లాగ ఎలాగున మార్కులు తెచ్చుకోలేదో ఒకే వయసు వారు మనం ఒకే రకంగా ప్రయత్నం చేసినా ఒకే రకం స్థితి పొందలేకపోవచ్చు.
అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు. మన సాధన ఒక స్థితికి చేరాక మనకు కూడా గురు అనుగ్రహం లభిస్తుంది. మనం చేస్తున్న సాధనా ఫలితం పరుగులుపెడుతుంది. ఇప్పటివరకు గురువులు లేరేమి అని బాధ అవసరం లేదు. మనకు వారు తప్పక మార్గనిర్దేశం చేస్తారు. గురువుల అడుగుజాడల్లో నడుస్తున్న శిష్యులు మనకు రోల్ మోడల్స్. మున్ముందు మన స్థితి కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి వస్తుంది. అప్పటి వరకు పరమగురువులైన ఆదిశంకరులు నిర్దేశించిన విధంగా మన సాధన చేస్తూ ఉండడమే మనం చెయ్యవలసిన కర్తవ్యం.
(ఇటువంటి విషయాలు విశ్లేషణల మీద మీకు ఆసక్తి అభిరుచి ఉంటే.... మరిన్ని తెలుసుకుందుకు *నా లోకి నేను....* channel లో క్రింది లింక్ ద్వారా చేరగలరు. ఆసక్తి ఉన్నవారికి ఈ విషయం చేర్చగలరు.)
https://whatsapp.com/channel/0029Va567NnAe5Vl0dB8sj1D
🙏💚💦💚🙏
మీ *మురళీకృష్ణ*
💚💦🔔💦💚
No comments:
Post a Comment