బీబి నాంచారమ్మ
దక్షిణ భారతదేశంలో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం బీబి నాంచారమ్మ లేదా తుళుక్క నాచ్చియార్ (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీరంగం రంగనాథుని భక్తురాలిగా మారి జీవితాంతం రంగనాథుని సేవ చేసుకుని జీవిత చరమాంకంలో ఆయనలో ఐక్యం అయ్యిందనే కథలు వినిపిస్తుంటాయి, వాటిలో ఉన్న వాస్తవికతను పట్టించుకోకుండా మనం కూడా వాటిని నమ్ముతుంటాం. దాని వల్ల స్వధర్మానికి జరిగే అనర్థాలు మన ఆలోచనకు అందకపోవచ్చు కూడా కాబట్టి హేతుబద్ధంగా ఆలోచించి నిజాన్ని తెలుసుకుందాం, ధర్మాన్ని ఆచరిద్దాం...
బీబీ అనేదిఉర్దూ పదం. "నాంచారి" తమిళం. రెండింటికీ ఒకటే అర్ధం. ఈ "బీబీ నాంచారమ్మ" గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. బీబీ నాంచారమ్మకి కనకదుర్గ ఆడపడచు అట. భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చిందట. నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని విశ్లేశకులు భావిస్తున్నారు. 1780లో చంద్రగిరిని పట్టుకొన్న హైదర్అలీ తిరుమల సంపదను కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఈ కథలేనని ఒక అభిప్రాయం. బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది మహమ్మదీయులు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు. తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది. శ్రీరంగంలో రంగనాధుని ఆలయంలో తుళుక్కు నాచియార్ గుడి ఉంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగంనుండి తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశా బీబీనాంచారమ్మ ఒకరు అయ్యుండొచ్చు.
నాంచారమ్మ గురించి రకరకాల గాధలు
బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ (సంపత్ కుమారుడి) విగ్రహమని, విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని, రామానుజుడు వెళ్ళి తెచ్చాడని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.
బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి వారు నిజంగా వివాహం చేసుకున్నారా అంటే పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం తిరుమల ఆలయం యొక్క స్థలపురాణం లో కానీ స్వామి వారి భక్తుల యొక్క చరిత్ర లో కానీ తిరుమల కు సంబంధించి ఎక్కడ కూడా బీబీనాంచారి అనే భక్తురాలి పేరు మనకు కనిపించదు. ఆ పేరు కల భక్తురాలు ఎప్పుడైనా తిరుమలకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఒక చిన్న ఆధారం కూడా మనకు దొరకదు.
మరి బీబీనాంచారి అనే భక్తురాలు ఏ ఆలయం యొక్క చరిత్రలో కనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన వివరాలు మనకు మైసూరు సమీపంలోని మెల్కోటే ఆలయం యొక్క చరిత్ర లో కనిపిస్తుంది.అక్కడి చరిత్ర ఏమిటి అని ఒకసారి పరిశీలిద్దాం.
ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది. కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీకి తెప్పిస్తాడు. ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలుకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.
అలాగే ఆమె ముస్లిం కాదు. బహు మతావలంబీకురాలయిన దూదేకుల స్త్రీ అని అంటారు. మైసూరు రాజు, దొడ్డ కృష్ణరాజ వొడియారు (1717-1731) పట్టమహిషి చెలువాంబ, కన్నడంలో బీబీ నాంచారు కథ ఆధారితంగా వరనందీ కళ్యాణ అనే కావ్యాన్ని సాంగత్య పద్యాలలో రచించింది. చెలువాంబ వరనందిని సత్యభామ అవతారంగా వర్ణించింది.
అదే నిజమైతే తాళ్ళపాకనుండి తిరుమల వరకు దాదాపు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య, తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.
ఢిల్లీ సుల్తానులు మెల్కోటే ఆలయం పై దాడి చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్లిపోయారు అని అప్పుడు రామానుజుల వారు డిల్లీకి వెళ్ళి సుల్తాన్ తో మాట్లాడి ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు అని చెబుతారు. కాకపోతే ఆ స్వామి వారి విగ్రహాన్ని ఎంతో ఇష్టంగా ప్రాణం గా ప్రేమించే ఆ సుల్తాన్ కూతురు స్వామి వారి విగ్రహాన్ని వదిలి ఉండలేక మెల్కోటే ఆలయానికి వచ్చి అక్కడ ఆలయం ముందు తనువు చాలించి స్వామి లో ఐక్యం అయింది అని కొందరు భావిస్తారు.
నిజానికి అక్కడ ఉన్న స్వామి వారి విగ్రహం చాలా అద్భుతమైన సౌందర్యం తో ఉంటుంది.ఎంత సేపు చూసినా తనివితీరని రూపం అక్కడున్న చలువ నారాయణ స్వామి రూపం .అక్కడ స్వామిని కూడా పగలు కాకుండా సాయంత్రం పూట అదికూడా వెన్నెల్లో ఊరేగింపు చేస్తారు.అందుకే ఆ స్వామిని చలువ నారాయణస్వామి అని అంటారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ. చరిత్ర ను కొంచెం పరిశీలిస్తే రామానుజుల వారి జీవితకాలం1017 నుంచి 1137 వరకు .ఒక మానవుని సంపూర్ణఆయువు 120 యేళ్ళు రామానుజుల వారు అలా పరిపూర్ణజీవితాన్ని గడిపారు. కానీ రామానుజుల వారి కాలం లో డిల్లీ నీ సుల్తానులు పాలిస్తున్నారా లేదా అని పరిశీలిస్తే అప్పటికి డిల్లీ ఇంకా ముస్లిం సుల్తానుల చేతుల్లోకి పోలేదు అప్పుడు డిల్లీనీ పాలిస్తుంది రాజపుత్రులు ఐన తోమర్లు అంటే కచ్చితంగా చెప్పాలి అంటే అనంగపాల తోమర్ అనే హిందూరాజు డిల్లీని పాలిస్తున్నాడు.
రామానుజుల వారు పరమపదం పొందిన 60 ఏళ్లకు డిల్లీ సుల్తానుల పరం అయింది.అంటే కుతుబ్ బుద్ధిన్ ఐబక్ అనే ఘోరీ సైన్యాధిపతి డిల్లీసుల్తాన్ అయ్యాడు.ఇతడి వంశాన్ని మామ్లుక్ రాజవంశం లేదా బానిస వంశం అంటారు.
పోనీ దక్షిణ భారత దేశం పైకి మొదట దాడి చేసిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తరుపున మాలిక్ కాఫర్ దాడి చేశాడు అదికూడా రామానుజల వారి కాలం తరువాత దాదాపు 150 సంవత్సరాలకు
దీన్ని బట్టి పరిశీలిస్తే రామానుజుల కాలంలో మెల్కోటే ఆలయంపై ముస్లిము ల దాడి జరగలేదు అని తెలుస్తుంది .అలా దాడి జరగనప్పుడు రామానుజుల వారు డిల్లీ వెళ్ళడం అబద్ధము. ఆ డిల్లీ సుల్తాన్ కూతురు మెల్కోటే రావడం కూడా అబద్దం. ఇంకా విచిత్రం ఏమిటంటే డిల్లీ సుల్తాన్ అంటారు కానీ ఆ సుల్తాన్ పేరు ను ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. తరువాత కాలం లో అంటే 14 లేదా 15 వ శతాబ్ద కాలం లో బీబీ నాంచారి కథను సృష్టించి ఉండవచ్చు. దీన్ని బట్టి పరిశీలిస్తే బీబీ నాంచారి అనే భక్తురాలు కల్పితం అని కచ్చితంగా భావించవచ్చు.
“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ”
----- భగవద్గీత 3-35
చరిత్రను వక్రీకరించి, అబద్ధాలను ప్రచారం చేసి నమ్మకాలను కలుషితం చేసి, మతాంతర వివాహాలకు ప్రోత్సాహమిచ్చేలా హిందూ ధర్మాన్ని బలహీన పరిచేలా చేయటం అనేది దశాబ్దాల నుండే మొదలయ్యిందని భావించవచ్చు
No comments:
Post a Comment