Thursday, February 12, 2026

 పరామర్శ

మా బందువొకడుండె మల్లికార్జునుడు,
భోళాగ వుంటాడు బురిడీలు చేస్తాడు ,
కాటిలో పుర్రెలతొ ఆడుకుంటుంటాడు,
సరి గంగ స్నానాలు సరదాలు వాడికి,
ఒళ్ళంత బూడిదను పులుముకుంటాడు,
చిన్ననాటినుంచి దేశదిమ్మరి వాడు,
భ్రమరాంబతో కలిసి బతుకుతున్నాడని
'ఎరుక' తెలిసినవారు చెప్పగా విన్నాను,
చుట్టపు చూపుగా కలిసి రావాలని
శ్రీశైలమునకు నే వెళ్ళివచ్చాను,
శివుడితో ముచ్చటలు పెట్టి వచ్చాను.

అమృతమును ఒదిలేసి గరళమును తాగావు 
అదియేమి తెలివ'ని అడిగానయా!
అందరూ తలకొకటి తన్నుకొని పోతుంటె,
 అదికూడ దక్కద'ని తాగాను అన్నాడయా!

ఎఱ్ఱి బాగలవాడ, ఎనక ముందై పోతే
ఏమిటౌ నీ 'కత' ని అడిగానయా!
ఆలి తాళే తనకు శ్రీ రామ రక్ష అని
 ముక్కంటి ఎంతో మురిసిపోయాడయా!

ఔనురా, ఓరబ్బి!
ఆడదంటే నీకు అంత బులుపేమిరా?
ఆలికెందుకు సగము తనువునిచ్చావు!
అతివలందరి ముందు చులకనైనావు!‍?'
లోక నిందను తనకు తెలిపానయా,
లోగుట్టు ఏమిటని అడిగానయా!

జన్మనిచ్చిన అమ్మ గుర్తుకొచ్చింది.
ఆమె యిచ్చిన దానిలో సగమేగ యిచ్చాను!
అది కూడా తప్పేనా?' అన్నాడయా!
ఆ మాటతో కంగు తిన్నానయా.

ఏమిరా, నీ కతలు? వింతలకే వింతరా!
ఒక్కటైనాగాని చక్కగా చేయవు.
ముద్దుగా చెప్పితే పుర్రె కెక్కదు కాగ,
ముక్కు మీదే నీకు కోపముంటుంది.
తిక్క శంకర నాకు అర్థమే కావు.'
మనసులో మాటనే చెప్పానయా,
ముఖము మీదే కడిగి వచ్చానయా!

ఉలకక పలకక ఉన్నాడయా,
కళ్ళుమూసుకు నవ్వుకున్నాడయా!

నీ గోల నాకేల? నే నీకు చెప్పాల?
నా వాడివని తలచి నోరు జారాను,
మనసులో పెట్టుకొని మథన పడబోకు,
నన్నేమి అనబోకు, నను మరిచి పోకు.
ఉన్నదానిలో కొంత హుండీలొ వేశాను,
మళ్ళిమళ్ళీ వచ్చి చూసి పోతుంటాను.'
కష్టసుఖములు అడిగి వచ్చానయా,
బాగుంటె చాలని మొక్కానయా.

శ్రీ శైలమునకు వెళ్ళి వచ్చానయా,
శివుడితో ముచ్చటలు పెట్టి వచ్చానయా!!!!.      

No comments:

Post a Comment