Friday, April 24, 2026

 *గాజు - వజ్రం* 
🙏🙏🙏🙏🙏
ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటు చేయబడింది. పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు.

పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు. రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు. 

అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి, నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు. అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను." అన్నాడు.

" ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు.

అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపు రేఖలతో, ఒకేలా ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి.

రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు.

దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క.
కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించ లేకపోయారు... ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్ప వచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి, ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను. కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ ఇప్పటికి ఇలా  మొత్తాన్ని గెలుపొందాను” అన్నాడు.

"నేను దానిని పరీక్షించలేను" అన్నాడు రాజు.

దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం."
అన్నారు.

ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించడానికి ముందుకు రాలేకపోయారు. 

ఇంతలో హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది.
ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు.

"నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ కూడా వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు.

ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు.

"మహారాజా!  నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివి తేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునే మో...ఒకవేళ నేను విజయం సాధించలేక పోయినా, మీరు ఎలాగూ పందెం కి సిద్ధంగా లేరు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు."

అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందు వల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు.

ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజు ముక్క అని అడిగారు.

ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి, 'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది కేవలం గాజు ముక్క!' అని చెప్పాడు.

అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...
ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు.

అందరూ చాలా సంతోషించారు. ఆ వచ్చిన వ్యక్తి కూడా వజ్రాలలో నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా ఉన్నారని చాలా సంతోషించాడు.

ఆ వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకేసారి తమ ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడి ని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు?" అని.

అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. ఎండకి వేడెక్కి ఉన్నది గాజు... అంతే." అన్నాడు.

జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు, బంధింపబడిపోతారు..అలాంటి వారు "గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ...  మాత్రమే "విలువైన వజ్రం". !!
💎

ఒకసారి మనస్సు సామరస్య స్థితిలోకి వస్తే, దానిపై బాహ్య పరిస్థితుల, బాహ్య వాతావరణ ప్రభావం ఉండదు, అంతర్గత కలవరం కూడా ఉండదు.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment