Sunday, April 26, 2026

మనకున్న వారం లోని 7రోజుల్లో కొన్ని మాత్రమే మంచివి

 మనకున్న వారం లోని 7రోజుల్లో కొన్ని మాత్రమే మంచివి ఉదా: శుక్రవారం మంచిది, కొన్ని చెడ్డవి ఉదా: పేరులోనే శుభం ఉన్న మంగళవారం ఎందుకు చెడ్డదిగా ఎందుకు అయ్యాయి?
శుభోదయం సార్ 😊 మీ ప్రశ్న వినగానే నాకూ మా నాన్న గుర్తొచ్చాడు. ఎందుకంటే ఈ ప్రశ్న ఎప్పుడూ ఇట్లాంటివి అనగానే బాగా నవ్వుతాడు. అసలు ఈ వారం రోజుల కథ ఏంటో చెప్తా.

ఆదివారం అంటే సూర్యుడు. ఆది దేవుడు. సోమవారం అంటే చంద్రుడు. సోముడు అంటే చంద్రుడే. మంగళవారం అంటే మంగళ గ్రహం. బుధవారం బుధుడు. గురువారం గురుడు. శుక్రవారం శుక్రుడు. శనివారం శని. అంతే. నవగ్రహాల్లో ఏడు గ్రహాల పేర్లు. మనం ఆకాశం వైపు చూడటం మానేసి క్యాలెండర్ వైపు చూస్తున్నాం. అందుకే రోజులకు పేర్లు పెట్టుకున్నాం. సైన్స్ సార్ ఇది. సూపర్ స్టిషన్ కాదు.

ఇప్పుడు మంగళవారం మంచిది కాదు అంటారు. పేరులోనే మంగళం ఉంది కదా. శుభం ఉంది కదా. మరి ఎందుకు బ్యాడ్ అయింది. శుక్రవారం ఎందుకు గుడ్ అయింది.

కారణం సింపుల్. మన భయం. మన బద్ధకం. మన బేరం.

మంగళవారం మంగళ గ్రహం. కుజుడు. కోపం. యుద్ధం. రక్తం. అగ్ని. అందుకే ఆ రోజు గొడవలు వద్దు. జుట్టు కట్ చేయొద్దు. గోర్లు కట్ చేయొద్దు. అప్పు ఇవ్వొద్దు. కొత్త బట్ట కట్టొద్దు. లిస్ట్ పెద్దది. ఎందుకు. కుజుడు కోపం వస్తే కొడతాడు అని. మరి పోలీస్ స్టేషన్ మంగళవారం మూసేస్తారా. హాస్పిటల్ లో ఆపరేషన్ ఆపేస్తారా. బార్డర్ లో సోల్జర్ గన్ దించేస్తాడా. లేదు కదా.

శుక్రవారం శుక్రుడు. లక్ష్మీ దేవి రోజు. డబ్బు. ఐశ్వర్యం. సౌందర్యం. అందుకే ఆ రోజు మంచిది. బంగారం కొనాలి. బిజినెస్ మొదలుపెట్టాలి. పెళ్లి చూపులు కావాలి. మరి శుక్రవారం బ్యాంక్ దొంగతనం జరగదా. ఆ రోజు యాక్సిడెంట్ అవ్వదా. అవుతుంది కదా.

అసలు మంచి రోజు అంటే ఏంటి సార్. మా నాన్న ఒక మాట అనేవాడు. నీకు పని చేయాలనిపించిన రోజే మంచి రోజు. వాయిదా వేయాలంటే ఒక సాకు కావాలి. ఆ సాకే మంగళవారం. అమావాస్య. రాహుకాలం. యమగండం.

చెట్టు నాటాలని ఉంది. ఈరోజు మంగళవారం కదా. వద్దు. రేపు చూద్దాం. రేపు వర్షం. ఎల్లుండి వేడి. 20 ఏళ్లు గడిచిపోతాయి. చెట్టు నాటం. నీడ లేదు. ఆక్సిజన్ లేదు. కానీ మంచి రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. చెట్టు నాటడానికి మంచి రోజు ఏంటి. 20 ఏళ్ల కిందట. కుదరదా. ఐతే ఈరోజు. ఇప్పుడే.

మూఢనమ్మకం అంటే ఇదే. మనల్ని మనం మోసం చేసుకోవడం. లేదా మన భయాన్ని అడ్డం పెట్టుకుని ఎదుటివాడు వ్యాపారం చేసుకోవడం. పంచాంగం చూసి ముహూర్తం పెడతాడు. దక్షిణ ఇవ్వాలి. హోమం చేయాలి. దోషం ఉంది తీయాలి. అన్నీ రేట్లు. మంగళవారం పుట్టావు కాబట్టి జాతకం లో కుజదోషం. పరిహారం చేయాలి. క్యాష్ కట్టాలి. అంతే తంతు.

గ్రహాలు మనల్ని నడిపిస్తాయా. మనమే గ్రహాల పేరుతో కథలు అల్లుకున్నాం. సూర్యుడు లేకపోతే బతకలేం. నిజం. చంద్రుడు లేకపోతే అలలు లేవు. నిజం. కానీ శనివారం తైలాభిషేకం చేయకపోతే శని పట్టుకుంటాడు అనేది అబద్ధం. శని 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నీ జుట్టుకు ఆయిల్ రాశావో లేదో ఆయనకు తెలియదు.

కాబట్టి రోజు మంచిది కాదు. చెడ్డది కాదు. రోజు అంటే 24 గంటలు. సూర్యోదయం సూర్యాస్తమయం. మధ్యలో నీ పని. నీ బుద్ధి. నీ కష్టం. అదే నీ జాతకం.

మంగళవారం కదా అని మంచం దిగకుండా ఉంటే మూలన పడతావు. శుక్రవారం కదా అని ఎగిరితే బోర్లా పడతావు.

పని చేయి. ఫలితం వస్తుంది. అదే నిజమైన మంగళం. అదే నిజమైన శుక్రం.

డౌట్ ఉంటే క్యాలెండర్ తగలబెట్టు. వాచ్ చూసుకుని పని మొదలుపెట్టు. ఆ క్షణమే బ్రహ్మ ముహూర్తం 🙏

నమ్మండి✍️TMS RAO

No comments:

Post a Comment