సత్యమేవ జయతే
కొందరికి అపారమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. జనాన్ని ఉర్రూతలూగించే వాక్పటిమ ఉంటుంది. వివిధ అంశాల మీద లోతైన అవగాహన కూడా ఉంటుంది. ఎన్ని మంచి లక్షణాలున్నా కించిత్ అసురగుణం తోడైతే పాలగిన్నెలో విషపు చుక్క విదిలించినట్టే! అలాంటి వ్యక్తి వ్యవస్థను మింగేస్తాడు. రావణుడు ఆ కోవకు చెందినవాడే! వాల్మీకి మహర్షి దశకంఠుడి రూపవర్ణన చేస్తూ 'అతడు మృత్యువులా ఉంటాడు, అతని సమక్షంలో వీచేందుకు వాయువు కూడా భయపడుతుంది, అతన్ని చూడగానే సముద్రం సైతం నిశ్చలమవుతుంది' అంటాడు. అదీ అసుర బలం!
అలాంటివారు ఎంత వెలుగు వెలిగినా స్వయంకృతాల కారణంగానే పతనమవుతారు. సీతాపహరణం అటువంటి ఘట్టమే! రావణుడు బ్రహ్మవంశంలో పుట్టినా, బ్రహ్మాండాన్ని జయించినా చివరికి మానవమాత్రుడైన రాముడి చేతిలో మరణించాడు. రాముడిపై విజయం సాధించేందుకు రావణుడు పలురకాల మాయలు చేశాడు, ఎన్నో కుట్రలు పన్నాడు. ఓటమిని తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయినా మట్టికరవక తప్పలేదు.
రాముడెప్పుడూ తాను పరమాత్మనని ప్రక టించుకోలేదు, పదహారణాల మనిషిననే చెప్పు కొన్నాడు. నిజానికి నిలువెత్తు ధర్మం రామచం ద్రుడు. విలువల బాటసారి. ఎన్ని కష్టాలెదు రైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. దశ కంఠుడి ప్రతి కుతంత్రాన్నీ సమర్థంగా తిప్పికొ ట్టాడు. అంతిమంగా రామతత్వమే నిలబడింది.
నేటి సామాజిక ప్రభావశీలురు వివిధ రంగా లలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రచార మాధ్యమాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. వీరిలో కొందరు నవీకరణ, అందం, ఆహారం, సాంకేతి కత వంటి రంగాలలో నోటికొచ్చింది చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. వాళ్ల వీడియోలను చూసేవారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి... కనిపించేదీ, వినిపించేదీ ఏదీ నిజం కాదు. మనం తొందరపడి స్వల్పకాలిక ప్రయోజనాలను ఆశించకూడదు, తాత్కాలిక ఆనందాలను కోరు కోకూడదు. ఏ విషయమైనా ముందుచూపుతో వ్యవహరిస్తూ జాగరూకత పాటించాలి.
అనైతిక ప్రచారాలు, అబద్దపు రూపాలు రామాయణ కాలంలోనూ ఉన్నాయి. మారీ చుడు కామరూప విద్యతో బంగారు జింకలా మారతాడు. నేలకూలుతూ 'హే సీతా, తమ్ముడూ లక్ష్మణా' అంటూ రాముడి గొంతును అనుకరిస్తాడు. రావణుడు సీతమ్మ ముందు రాముడి కృత్రిమ శిరస్సును పెట్టి బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంద్రజిత్తు నేటి సైబర్ మాయలను తలపించే అదృశ్యదాడులలో సిద్ధహస్తుడు. అయినా చివరికి అబద్ధం బద్దలైంది, అసత్యం అంతమైంది. ఏ యుగంలో అయినా సత్యానిదే అంతిమ విజయం. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రకృతి వనరుల దోపిడీ లాంటివన్నీ రావ ణాంశ సంభూతుల లక్షణాలు. వాటిని ఎదిరించడానికి మనం రాముడి అడుగుజాడలలో నడవాలి. ఉత్తమ పౌరులు ఎప్పుడూ ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించాలి. అప్పుడు రాముడే మన చేయి పట్టుకుని గెలిపిస్తాడు!
రామాయణానికి ఒక గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈ మహాకావ్యం ఎలా గెల వాలో చెబుతుంది, ఎలా గెలవకూడదో కూడా హెచ్చరిస్తుంది. అది యుద్ధంలో కావచ్చు, జీవితంలో కావచ్చు!
కె.వి.సుమలత
No comments:
Post a Comment