Friday, May 15, 2026

 మనం తఱచుగా ఈ ఆశీర్వాదం వింటాం.

పది కాలాల పాటు చల్లగా ఉండండి....
ఈ వాక్య నిర్మాణం ఎప్పుడైనా ఆలోచించారా.
పది కాలాలు అంటే ఏవేవి?
వర్ష కాలం చలికాలం, వేసవి కాలం అని లెక్కిస్తే మూడు కాలాలే.
పోనీ వసంతం మొదలైన ఋతువులు లెక్కిస్తే అవి ఆరే ఋతువులు.
మరి ఈ పది కాలాలు ఎక్కడినుంచి వచ్చినవో?
సంస్కృతం లో పాణినీయ వ్యాకరణం సిద్ధాంత కౌముది లో ధాతు పరిచ్ఛేదంలో కాలాలు దశవిధ లకారాలు.
వర్తమానే లట్, భూతే లిట్ అనద్యతన భూతే లఙ్ అంటూ పది విధములైన కాలములు tenses ఉంటాయి.
అవి 1.లట్, 2.లిట్, 3.లుట్, 4.లృట్, 5.లేట్, 6.లోట్, 7.లఙ్, 8. లిఙ్,9.లుఙ్,10.లృఙ్.
ఈ పదివిధాల లకారాలే పదికాలాలు.
ఈ పదికాలాలలో మన జీవితం హాయిగా సాగాలి.

మరి చల్లగా ఉండడంఅనే పదం ఎలా సంస్కృతం నుండి వచ్చింది?
దీనికి ఋగ్వేదంలో మంత్రం ఆధారం.
రాష్ట్రము అనే భావనను వేదం బాగా వ్యాఖ్యానించింది.

    క్షేమం రాష్ట్రస్య శీతమ్ 

ఈ మంత్రం లో శీతము అంటే చల్లదనం.
క్షేమమే రాష్ట్ర మునకు చల్లదనం ఇస్తుందని వ్యాఖ్యలు ఉన్నాయి.
శీతము అంటే సుఖముగా శయనించ గలిగే పరిస్థితి అని అర్థం.
శీఙ్ శయనే అనే ధాతువు నుండి కృత్ప్రత్యయాంత శబ్దం నిర్మాణం అయి శీతము అంటే క్షేమం అనే అర్థం వస్తుంది.
అందుకే చల్లగా ఉండాలని దీవెనలు.
మన తెలుగు వాళ్ళు సాధ్యులు.
అటు వ్యాకరణాన్ని, ఇటు వేదాన్ని అధ్యయనం చేసి రంగరించి మరీ ఆశీస్సులు అందించగల సామర్థ్యం మన సొత్తు.

No comments:

Post a Comment