Friday, May 15, 2026

 కాలిన కట్టెలు :

భోజరాజు కవి పండితులను సత్కరిస్తూ ధారానగరంలో పరిపాలన సాగించే కాలంలో మాళవదేశంలో అతి పేద బ్రాహ్మణు-డొకడుండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యంకూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తనవంటివారికి సయితం కాళి దాసు తలుచుకుంటే, ఏదోవిధంగా సత్కరం  జరుగుతున్నదని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకను ధారానగరం చేరి కాళిదాస దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఆ బ్రాహ్మణుడి దుస్థితిగురించి విని, "అయ్యా నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజసభకు రా. వట్టిచేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకువచ్చి రాజుకియ్యి. నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేటట్లు ప్రయత్నిస్తాను" అని సలహా ఇచ్చాడు.

ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని సంతోషించి, ఎక్కడో ఒక చెరుకుగడ సంపాదించి, దాన్ని తుండ్లుగా నరికి తన కొల్లాయి గుడ్డలో మూటగట్టుకున్నాడు. ఆ రాత్రి సత్రంలో భోజనంచేసి, మూట దగ్గిర పెట్టుకుని సత్రం ముందున్న చెట్టుకింద దుప్పటి పరుచుకు పడుకుని నిద్రపోయాడు.  

ఆ సత్రం ఊరికి ఒక పక్కగా వున్నది. ప్రతి రాత్రీ అక్కడ విశ్రమించేందుకూ, వీలైతే ఉచితంగా భోజనం సంపాయించేందుకూ అనేకులు వస్తూవుండేవాళ్ళు. ఆ సత్రాన్ని అంటిపెట్టుకుని వుంటూ, ఆదమరిచి నిద్రపోయేవాళ్ళ వస్తువుల్ని, డబ్బునూ సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు వుండేవాడు.

బ్రాహ్మణుడి మూటలో చెరుకుతుండ్లు ఉన్నట్టు కనిపెట్టిన ఆ తుంటరికుర్రాడు, బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో మూట విప్పి, చెరుకుముక్కలు తీసుకుని, వాటికి బదులుగా కాల్చి ఆర్పిన కపుల్లలు నాలుగు కొల్లాయిగుడ్డలో మూటగట్టి తన దారిన తాను పోయాడు.

ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుని సరాసరి రాజ సభకు వెళ్ళాడు.
కాళిదాసాది కవిపండితులతోసహా నిండు శొలువులో కూర్చుని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు, "మహా ప్రభూ! తమ దర్శనార్థం మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మ ణుడు వచ్చి ఉన్నాడు,” అని విన్నవించారు. రాజు ఆ బ్రాహ్మణ్ణి లోపల ప్రవేశ పెట్టమని ఉత్తరువు చేశాడు.

బ్రాహ్మణుడు సభలోకి వచ్చి, మూట విప్పి అందులోని కాలిన కట్టెపుల్లలను రాజుఎదుట పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మణుడికి పైప్రాణాలు పైనే పోయినంత పని జరిగింది. సభికులంతా ఆ వింతకు విరగబడి నవ్వారు.
రాజుకుమాత్రం పట్టరాని ఆగ్రహం వచ్చి, "దీని అర్థమేమిటి?” అని అడిగాడు.

అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కాళిదాసు లేచి
"ప్రభూ! ఇందులో గొప్ప గూఢార్థం ఉన్నది. సెలవైతే చెప్పగలను,” అన్నాడు.
"ఏమిటది?” అన్నాడురాజు ఆశ్చర్యంతో.
కాళిదాను ఈవిధంగా చెప్పాడు

"దగ్ధం ఖాండవ మర్జునేన చ వృథా 
దివ్యద్రుమై ర్భూషితం, 
దగ్ధ వాయుసుతేన హేమరచితా 
లంకాపురీ స్వర్గభూః,
దగ్ధస్సర్వ సుఖాస్పదశ్చ మదనో హా ! హా !! 
వృథా శంభునా 
దారిద్య్రం ఘనతాపదం 
భువి నృణాం కేనాపి నో దహ్యతే.

"దివ్యమైన వృక్షాలు గల ఖాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహిం చాడు, స్వర్గాన్ని మరిపించగల లంకాపట్ట ణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించివేశాడు. అందరికీ సుఖం చేకూర్చే మన్మథుణ్ణి మహాశివుడు నిర్దయగా దహిం చాడు. కానీ  మానవులను పీడించే దరిద్రాన్ని ఏ మహానుభావుడూ దహించడే! ఆ పనికి మీరైనా పూనుకోరాదా" అని ఈ బ్రాహ్మణుడు మీకు హెచ్చరికచేస్తున్నాడు.
అది విని రాజు చాలా సంతోషించి, బ్రాహ్మణుణ్ణి ఘనంగా బహూకరించాడు.
తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కాని గొప్ప సన్మానం జరిగింది. తన కళ్ళను తానే నమ్మలేక వెనక్కు తిరిగిచూసుకుంటూ సభనుంచి వెళ్ళిపోయాడు.
"ఆ బ్రాహ్మణుడలా వెనక వెనక చూస్తూ పోవటానికేమి కారణం?" అని భోజ రాజు కాళి దాసు నడిగాడు.
"మీరు దగ్ధంచేసిన దరిద్రదేవత మళ్ళీ తన వెంట రావటం లేదుగదా అని ఆ బ్రాహ్మణుడి భయం,” అని యుక్తిగా కాళి దాసు జవాబుచెప్పాడు.

చందమామ కోసం కె. కాంతారావు గారి రచన - వారికీ మా ధన్యవాదాలు.

No comments:

Post a Comment