ఒక యువకుడు గురువు దగ్గరకి వెళ్లి "ఒకడు నా జీవితాన్ని నరకం చేస్తున్నాడు గురూజీ” అన్నాడు.
“ఏం చేస్తున్నాడు? రోజూ వచ్చి డబ్బులు అడుగుతున్నాడా? బెదిరిస్తున్నాడా?” అడిగాడు గురువు.
“వాడు ఇక్కడ ఉండడు. కానీ కనపడిన ప్రతివాడితో నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టటం లేదు. రక్తం మరుగుతోంది. ఆ చిరాకంతా నా భార్యా పిల్లల మీద పడుతోంది”.
“వాడిని ఏమి చెయ్యాలనుకు౦టున్నావు?”
“చంపేయాలనుకుంటున్నాను."“చంపితే జైలుకు వెళ్తావు. వాడికి కావలసింది అదే కదా” అన్నాడు గురువు.యువకుడు దెబ్బ తిన్నట్టూ చూసి, “మరి నా సమస్యకి ఏమిటి పరిష్కారం గురూజీ?” అని అడిగాడు.
గురువు అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్ళి తాళం వేసి, కిటికీలోంచి చెవి లోపలికి విసిరేసి “…సమాధానం కావాలనుకున్నప్పుడు బయటకు రా” అని వెళ్ళి పోయాడు.
యువకుడికి అర్థం కాలేదు. “పరిష్కారం కోసం వస్తే గదిలో తాళం వేసి చెవి నాకు ఇచ్చాడేమిటి? ఈ గురువు పిచ్చివాడిలా ఉన్నాడు” అని నవ్వుకున్నాడు. కాస్సేపు ఏమీ తోచలేదు. నేల మీద చిన్న చాక్‌పీస్ ముక్క కనపడింది. దాంతో గోడ మీద బొమ్మలు గీయసాగాడు. అంతలో ఆకలేసింది. ఆశ్రమం కిటికీ లోంచి కనపడుతోన్న అరటి గెలలు చూస్తో౦టే అది మరింత ఎక్కువైంది.
మరో రెండు గంటలు గడిచే సరికి మొహం మీద నవ్వు మాయమైంది. కడుపులో ప్రేవులు భయంకరంగా అరవసాగాయి. ఇక భరించలేక... అసహనం కోపంగా మారి... తలుపులు బద్దలు కొట్టయినా సరే స్వామిని నిలదీద్దామని వెళ్లి... ... నిశ్చేష్టుడయ్యాడు. బయట తాళం వేసి లేదు. తలుపులు దగ్గరకి వేసి ఉన్నాయంతే.
“నన్ను తిట్టాలనీ, వీలయితే కొట్టాలనీ అనుకుంటున్నావు కదూ” అన్నాడు గది బయటే నిలబడి ఉన్న గురువు ప్రశాంతంగా.
యువకుడు అపరాధ భావనతో తల దించుకుని, “క్షమించండి. తప్పే. కానీ మీరు ఇదంతా ఎందుకు చేశారో, గదిలో పెట్టి ఎందుకు తాళం వేశారో అర్థం కావటం లేదు” అన్నాడు.
గురువు అతన్ని ఆశ్రమం పక్కనే ఉన్న తోటకి తీసుకు వెళ్లాడు. అక్కడ చెట్టు క్రింద ఎండిన ఆకులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. “చూడు… ఆకుల్ని ఈ చెట్టు ఎలా వదిలేసిందో” అన్నాడు.
“ఇందులో విశేషం ఏముంది స్వామీ? రాత్రి గాలికి పడిపోయాయి” అన్నాడు యువకుడు తేలిగ్గా.“కాదు. చెట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేసింది కాబట్టే పడిపోయాయి” అన్నాడు గురువు.
ఈ కొత్త థియరీకి యువకుడు అయోమయంగా చూశాడు. “చెట్టు ఆకుల్ని ఎందుకు వదిలేసింది? ఆలోచించు. వదలక పోతే ఆ చెట్టు పచ్చదనం లేక చచ్చిపోయి ఉండేది. అవునా?”.ఈ కొత్త సిద్ధాంతానికి యువకుడు అవాక్కయ్యాడు.
“వసంతంలో చిగుర్లు వెయ్యటం కోసం శిశిర౦లో శేషపత్రాల్ని వదిలేయటమే చెట్టు మనకి చెప్పే జీవిత సత్యం..! నీ శత్రువు నిన్ను నీ నిద్రకూ, భార్యా పిల్లలకూ దూరం చేస్తున్నాడు. చెట్టు ఎండుటాకుని వదిలేసినట్టూ వదిలెయ్యకుండా ఎందుకు గుండెల్లో పెట్టుకుని పోషిస్తున్నావు?”
అతడితో కలిసి ఆశ్రమం వైపు నడుస్తూ చెప్పాడు. “భయం, కోపం, దుఃఖం- ఎండిపోయిన ఆకుల్లాటివి. అవి సమస్యలు కావు. వాటిని వదల్లేని మన మనసే మన సమస్య. అనుమానం ఇంకా పెద్ద సమస్య. నేను నీ గదికి తాళం వెయ్యలేదు. ఒకవేళ వేసినా, నీకిచ్చిన చెవితో లోపల్నుంచి కూడా తెరవవచ్చు. కనీస౦ నువ్వా ప్రయత్నం కూడా చెయ్యలేదు..! నీ కిటికీ పక్కనే ఓ కర్ర ఉంది. దాంతో అరటి పళ్ళు తె౦పుకోవచ్చు. నీ దృష్టి అసలు అటు పోనేలేదు..! గోడలపై పిచ్చి పిచ్చి బొమ్మలు వేసుకుంటూ నన్ను తిట్టుకోవటం తోనే నీకు సరిపోయింది. సిగ్గు పడకు. అందరూ చేసేది అదే..! సమస్యకి ‘పరిష్కారాలు’ ఆలోచించకుండా, ‘పరిణామాలు’ ఆలోచిస్తూ, అందమైన జీవితం గది గోడల్ని నిరర్థక వ్యధల చాక్-పీస్తో పాడు చేస్తారు. ప్రస్తుతం నీ ప్రత్యర్థి పట్ల నువ్వు చేస్తున్నది కూడా అదే”.
ఒక వెలుగు కిరణం మేఘాల్ని చీల్చుకుని వచ్చినట్టు అయింది. ఒక సత్యం అర్థం అయినట్టు యువకుడు నమస్కరించాడు. “వెళ్లిరా. ఒక విషయం గుర్తు పెట్టుకో..! మనల్ని బంధించి ఉంచేవి తాళాలు కావు. తెరవటానికి చెయ్యని మన ప్రయత్నాలు...!” అన్నాడు గురువు.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment