మనస్సాక్షి మహాభారతం
రచన : ‘కాశీకవి’ శతావధానిశేఖర ‘విద్యావారిధి’ డా॥ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
10. అలవాట్లు - పొరపాట్లు
ఏ కాలంలోనైనా మానవుల వివేకాన్ని పోగొట్టి చెడ్డపనులు చేయించే దుర్వ్యసనాలు నిత్యనూతనంగా విజృంభిస్తూనే ఉంటాయి. వాటి మాయలో పడినవారు తాము పతనం కావటమే కాక కుటుంబానికీ, సమాజానికీ కూడా కష్టనష్టాలను కలిగిస్తారు.
ఏదో ఒక రూపంలో మానవులను ప్రలోభపెట్టే సామర్థ్యం గల వ్యసనాలను క్రోడీకరించి ఏడింటిని సప్తవ్యసనాలుగా ప్రకటించారు. వ్యసనం అంటే మానలేని అలవాటు. ఏడింటిలో మొదటిది మద్యపానం. స్త్రీ, వేట, జూదం, వాక్పారుష్యం (నోటిదురుసు) దండ పారుష్యం (కఠినంగా దండించటం), అర్థదూషణం (ధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టటం) మిగిలిన ఆరు. వీటిలో ఏదో ఒకటి మనకు తెలియకుండానే మనలో ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి అలవాటును వారు ఏవేవో కారణాలు చెప్పి సమర్థిస్తూ ఉంటారు. చేతులు కాలాక చెంపలు వేసుకుంటారు.
మృతసంజీవని విద్యను కనిపెట్టినవాడు, రాక్షసుల గురువు, మహానీతివేత్త అయిన శు క్రాచార్యునికి ఉన్న వ్యసనం మద్యపానం. అంతటి మహానుభావుడు మద్యం మత్తులో ఒళు తెలియక వివేకాన్ని కోల్పోతూ ఉంటాడు. వ్యసనపరుడు తన బలహీనత వలన ఎదుటివారి చేతిలో మోసపోతూ ఉంటాడు. మేకను చూపించి పులిని, చెఱకుగడను చూపించి ఏనుగును బంధించినట్లు వ్యసనపరుని ధన, మాన, ప్రాణాలను అపహరిస్తాడు. రహస్యాలు రాబట్టుకుంటారు. వివేకాన్ని నశింపచేస్తారు.
శుక్రాచార్యునికి మాత్రమే తెలిసిన మృతసంజీవని విద్యను నేర్చుకొనిరమ్మని బృహస్పతి తన కుమారుడుయిన కచుడిని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు. కచుడు తన వినయవిధేయతలతో శుక్రుడిని మెప్పించాడు. దేవగురువు కొడుకు తన దగ్గరకు చదువుకోవటానికి వచ్చాడని శుక్రుడు ఎంతో వాత్సల్యంతో కచుడిని ప్రేమగా చూడటం సహించలేక రాక్షస విద్యార్థులు మాత్సర్యంతో కచుడిని చంపేశారు. అడవిలో అతని మృతదేహం ఉందని దివ్యదృష్టితో చూసిన శుక్రుడు మృతసంజీవనితో అతడిని బతికించాడు. రాక్షస విద్యార్థులు మళ్లీ కచుడిని చంపారు. ఈసారి దేహం మిగలకుండా కాల్చి బూడిద చేశారు. ఆ బూడిద కూడా మిగలటం ఇష్టం లేక దానిని మద్యంలో కలిపి గురువుగారి చేత తాగించారు.
మద్యపానం రుచిలో సమస్తమూ మరచిపోయిన ఆచార్యుడు తన కుమార్తె దేవయాని పిలుపుతో మెలుకువ తెచ్చుకుని జరిగిన అనర్థాన్ని దివ్యదృష్టితో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. కడుపులో ఉన్న కచుడిని బతికించి బయటకు తేవటానికి కడుపులో ఉన్నవాడికి మృతసంజీవని విద్య నేర్పవలసి వచ్చింది. శత్రుపక్షంవాడైన కచుని ప్రయోజనం సులువుగా నెరవేరింది. అప్పుడు కాని మద్యపానం వల్ల కలిగే నష్టాలు శుక్రాచార్యునికి తెలిసిరాలేదు. వెంటనే లోకానికి సందేశాన్ని, కఠినమైన ఆదేశాన్ని ఇలా ఇచ్చేశాడు.
మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మముల్
పరగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనులకాక్షణ మాత్రన
చెఱుచు మద్యసేవ సేయనగునె
'గత జన్మలో చేసిన ఎన్నో పుణ్యాల వలన కలిగిన జ్ఞానాన్ని ఈ జన్మలో ఒక్క క్షణంలో పోగొడుతుంది కనుక మద్యపానం చేయరాదు’
'ఈనాటి నుంచి ఎవరూ మద్యపానం చేయకండి. చేసినవారు నా శాపానికి గురి అవుతారు’ అని గట్టిగా చెప్పారు. మద్యపానం దుర్వ్యసనం. దానిని మానుకోండి ... అని ఎవరో పెద్దలు, సంస్కర్తలు చేసిన హితబోధ కంటె దానివలన స్వయంగా కష్టనష్టాలను అనుభవించి చెప్పిన శుక్రాచార్యుని మాట వ్యసనాంధకారంలో 'వేగుచుక్క' (శుక్రగ్రహం). మానవజాతికి శిరోధార్యం.
🌿🌿🌿🌿🌿
No comments:
Post a Comment