☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
115. న బిభేతి కదాచన
(జ్ఞాని) ఎన్నడూ భయపడడు(అథర్వవేదం)
ఈ వాక్యం అనేక పర్యాయాలు వేదాలలో ఆవృతమౌతుంది. ముఖ్యంగా ఇది ఉపనిషద్వాక్యం. ఎక్కడ చెప్పినా ఈ వాక్యపు సందర్భం ఒక్కటే. ఆత్మజ్ఞానం (పరబ్రహ్మ
గురించి ఎఱుక) కలిగినవాడు ఎన్నడూ భయపడడు... అనేది సందర్భం. దీనిని భక్తిపరంగా, జ్ఞానపరంగా కూడా అన్వయించవచ్చు.
జ్ఞానం వలన భయం ఉండదు... అని లౌకికంగా కూడా స్వీకరించవచ్చు. భౌతికంగా కూడా కొంత విజ్ఞానం సంపాదించినవాడు భయాన్ని కొంతమేరకు అధిగమిస్తాడు.
చీకట్లో భయం కలుగుతుంది. వెలుగులో కాస్త ధైర్యం చిక్కుతుంది. చీకటి అజ్ఞానానికి సంకేతం. కాంతి జ్ఞానానికి ప్రతీక. అజ్ఞానమే భయానికి మూలం. జ్ఞానమే అభయస్థితి.
దేవతాకృతులలో అభయముద్రకి ప్రాధాన్యం ఉంది. భగవద్ జ్ఞానం అభయం అని దాని భావం.
భక్తిపరంగా - భగవంతునిపై అఖండ విశ్వాసం కలవాడు దేనికీ భయపడడు. విశ్వమంతా పరమాత్మయే అని గ్రహించిన ఆ ధీరుడు నిరంతర శాంతస్థితిలోనే
ఉంటాడు. 'సర్వమున్నతిని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి'న ప్రహ్లాదుని
'నిర్భీకుండు ప్రశస్త భాగవతుడున్ నిర్వైరి' అని భాగవతం కీర్తించింది.
‘అభయం సత్త్వసంశుద్ధి' అంటూ భగవద్గీత... దైవీగుణాలలో మొదటిది 'అభయం’ అని పేర్కొంది. జ్ఞానపరంగా - తాడును చూసి పాము అనుకోవడం (రజ్జుసర్పభ్రాంతి) వలన భయం కలిగింది. పాము అనుకున్నంత సేపు తాడు కనబడలేదు. తరువాత
కాంతి సహాయంతో 'అది తాడు' అని తెలిశాక, మరి పాము కనబడలేదు. భయమూ పోయింది. యథార్థజ్ఞానం భయాన్ని పోగొట్టింది.
అదేవిధంగా పరమాత్మయందు భాసించే జగతిని చూస్తూ ఈ జగద్విషయాలే సత్యమని భ్రమించేవాడు, దానికి అధిష్ఠానమైన పరమాత్మను గ్రహించడం లేదు.
పరమాత్మను గ్రహించగలిగేవానికి జగమంతటా భాసిస్తున్నది అతడేనని తెలుస్తుంది.
అద్దంలో ఎన్ని ప్రతిబింబాలు కనిపించినా, 'అది అద్దం' అనే జ్ఞానం ఉన్నప్పుడు ఆ ప్రతిబింబాలు సత్యం అనుకోము. అద్దంలో అవి ఆభాసలే కానీ, 'ఉనికి' కావు. ఉనికి నిర్వికారమైన అద్దమే. అయితే ఈ ఉపమానంలో - బింబం బైట ఉంటేనే
అద్దంలో ప్రతిఫలిస్తోంది. అప్పుడు బింబరూపంలో జగతికి (బైటవిషయానికి) ఉనికి
ఉంది కదా - అనవచ్చు, కానీ ఈ దర్పణాన్ని 'చిత్రదర్పణం'గా భావించవచ్చు. బైట బింబం లేకుండానే తనయందు ప్రతిబింబాన్ని ప్రతిఫలించే వింత అద్దం - పరమాత్మ.
అలా భాసింపజేసే మాయాశక్తి ఆయనకి ఉంది. ఇంద్రజాలికునిలో ఇంద్రజాలంలో,ఇంద్రజాలం చేసినప్పుడు అందులో సృష్టించే నిప్పుల్నీ, ఉప్పెనల్నీ చూసి మనం
భయపడవచ్చు. అవి ప్రదర్శన సమయంలో వాస్తవా(వ్యవహార సత్యాలు)లే కానీ 'ఇది ఇంద్రజాలం' అని తెలిసినవాడు, ఆ ఉత్పాతాల్ని వినోదంగానే చూస్తాడు కానీ
భయపడడు. పైగా ఇంత ఇంద్రజాలమూ ఇంద్రజాలకుని ప్రతిభ అని మెచ్చుకుంటాడు.
అలా పరమేశ్వరుని మాయాజాలమైన జగమంతా ఆతని లీలాశక్తి రచన - అని గ్రహించి, అంతా ఆయన మహిమే అనే జ్ఞానంతో తన ఉనికి (సత్తా) కూడా ఆయనేనని ఎరుకలో, అభేదభావంతో ఉంటాడు. ఇదే అభయ స్థితి. ఉపనిషత్తు ఈ ఉదాత్తార్థంలో పై వాక్యాన్ని చెప్పింది.
లౌకికంగా ఆలోచించినా... భయపడేవాడు ముందుకు వెళ్ళలేడు. ఒక విషయంపై సంపూర్ణమైన అవగాహన కలిగిపప్పుడు అజ్ఞానము పోతుంది - భయము నశిస్తుంది.
ధైర్యంతో సాగే మనస్తత్త్వమున్నవాడే భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ
పురోగమించగలడు.
షదోషాః పురుషేణేహ హతవ్యా భూతిమిచ్చతా!
నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్ఘసూత్రతా॥
- అని సుభాషితం. నిద్ర, కునుకుపాటు, భయం, క్రోధం, సోమరితనం, వాయిదాలు
వేయడం అనే ఆరు లక్షణాలు విజయానికి అవరోధాలు. అందుకే 'మా భీః' (భయపడకు) అని ప్రబోధించింది వేదమాత.
☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
116.ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః
రెప్పలు మూయడంలో విలయాన్నీ, తెరవడంతో సృష్టినీ, చూపుల ప్రసరణతో స్థితినీ కొనసాగించే చైతన్యశక్తి లలితాంబిక (లలితా సహస్రనామం)
విశ్వరచనకు మూలం 'ఈక్షణశక్తి' అని మన వైదిక శాస్త్రాల వచనం. (స ఐక్షత బహుస్యాం ప్రజాయేయ - అని వైదిక వాక్యం).
పరమాత్మ కళ్ళు తెరచి ఈ జగతి నిర్మాణాన్ని సాగించాడు. అంతర్ముఖ యోగనిద్ర అంటే కళ్ళు మూసుకోవడం. ఈ స్థితిలో జగమంతా ఆ పరబ్రహ్మలో అణగి ఉంటుంది.తిరిగి వెలికితీయడమే కనులు తెరవడం. ఇది బహిర్ముఖం. ('ఒకపరి జగముల వెలిని, ఒకపరి లోపలికి గొనుచు' - అని భాగవత వచనం)
కేవలం ఆ కనుచూపులతోనే ఈ జగద్రచనను కొనసాగించినది పరమేశ్వర శక్తి.మనం కళ్ళు తెరచుకున్నప్పుడు లౌకిక వ్యవహారాలను సాగించి, తిరిగి నిద్రతో
(కనుమూతతో) విశ్రమిస్తాం. అదేవిధంగా - జగతి సృష్టి స్థితి లయల వికసనమే కనులు తెరచుకున్నట్లుగా, తిరిగి అంతర్లీనావస్థయే కనులు మూసుకున్నట్లుగా సంభావించారు మహర్షులు.
ఈ చూపుల శక్తినే 'ఈక్షణశక్తి' అంటారు. సమర్థుడైన పాలకుడు కనుసైగలతోనే పాలన సాగించినట్లుగా పరమాత్మ చైతన్యం తన చూపులతోనే విశ్వాన్ని నిర్వహిస్తున్నది.ఆ కటాక్ష రూపచైతన్యాన్ని విశ్వపోషణ చేసే మాతృరూపంగా ఆరాధించడం మన
సంప్రదాయం.
“నీ కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేయమ"ని అమ్మవారిని మనం ప్రార్థిస్తాం.కనులు తెరచి మూసుకోవడమే వ్యాకోచ సంకోచాలు. వికసనం, ముకుళం. ఈ వీక్షణశక్తిగల పరమాత్మను, ఉపాసన సంప్రదాయంలో 'మీనాక్షి, విశాలాక్షీ, కామాక్షీ' అనే పేర్లతో జగదంబా రూపంగా ఆరాధిస్తున్నాం. కన్నులు భావాల స్థానాలు.కాంతి క్షేత్రాలు. బహుభావాల జగతికి మూలశక్తులివి.
తన చూపులతోనే విశ్వాన్ని సంరక్షించి పోషించే జగన్మాతను 'మీనాక్షి' అన్నారు.
ఈ విశాల విశ్వంలో ప్రతి అణువును గమనించే తల్లి కటాక్షానికి అవధి లేదు.ముక్కాలాలని, ముల్లోకాలని నిత్యం వీక్షించే అనంత దర్శనశక్తి కల తల్లి కనుక ఆమె 'విశాలాక్షి'. సర్వజనుల మనోకామనల్ని కరుణ నిండిన చూపులతోనే నెరవేర్చే లోకజనని కనుక 'కామాక్షి'.
క + అ + మ = కామ. ఈ నామం పరబ్రహ్మవాచకం. సృష్టిస్థితి లయలకు
హేతుభూతమైన ఈశ్వరశక్తి ఇది. 'క' అనే అక్షరం మంత్ర (శబ్ద) శాస్త్ర రీత్యా
బ్రహ్మవాచకం. 'అ' విష్ణువాచకం, 'మ' రుద్రవాచకం'. ఈ మూడు సృష్టి స్థితి లయలకు హేతువైన సత్వరజస్తమోగుణాలకు, త్రికాలాలకు, త్రిలోకాలకు, ఓంకారంలోని అక్షరత్రయానికి సంకేతాలు. ముగురమ్మల సంకేతం కూడా ఇదే. ఈ మూడింటినీ
నిర్వహించే మూలపుటమ్మ కనుక 'కామాక్షి' (కనుచూపులతోనే సృష్టి స్థితిలయలను సాగించే తల్లి). ‘'త్రిపురసుందరి' తత్త్వం ఈ పేరులోనే ఉంది.
సూర్యుచంద్రులు కూడా అమ్మ నేత్రాల శక్తులే కదా! అందుకే అమ్మవలె అందరిపైనా సమంగా ప్రసరిస్తూ, పోషిస్తూ విశ్వానికే ప్రాణశక్తిని అందిస్తున్నారు. బ్రహ్మాండ
జనని సూర్యచంద్రాత్మిక శక్తుల్ని తన నేత్రాల నుండే నిర్వహిస్తున్నది. అంటే మనం నిత్యం ఆ తల్లి చూపుల చలువతోనే బ్రతుకులను సాగిస్తున్నామన్నమాట. ఇది తెలిస్తే
నిత్యం అమ్మ సన్నిధిలోనే ఉన్నామన్న ఆనందాన్ని సొంతం చేసుకొని - పిల్లల్లా
నిశ్చింతగా, నిర్మలంగా, నిబ్బరంగా, హాయిగా ఒక ఆటలా జీవితాన్ని గడపగలం.ఈ గ్రహింపునే జ్ఞానం అంటారు.
అమ్మవారికి 'శతాక్షి' (అనంత దర్శన శక్తి గలది), 'ఆమ్నాయాక్షి' (ఎడతెగని
చూపులు గలది, వేదవిజ్ఞానాన్ని ప్రసరించే శక్తి) - వంటి నేత్ర సంబంధ
నామాలున్నాయి.
No comments:
Post a Comment