Monday, February 24, 2025

 Vedantha panchadasi:
అయథావస్తు సర్పాదిజ్ఞానం హేతుః పలాయనే ౹
రజ్జు జ్ఞానేఽ హిధీధ్వస్తౌ కృతమప్యనుశోచతి 
౹౹235౹౹
మిథ్యాభియోగదోషస్య ప్రాయశ్చిత్తత్లసిద్ధయే ౹
క్షమాపయన్నివాత్మానం సాక్షిణం శరణం గతః 
౹౹236౹౹
ఆవృత్త పాపనుత్త్యర్థం స్నానాద్యావర్త్యతే యథా ౹
ఆవర్తయన్నివ ధ్యానం సదా సాక్షిపరాయణః 
౹౹237౹౹
ఉపస్థ కుష్టినీ వేశ్యా విలాసేషు విలజ్జతే ౹
జానతోఽ ఎ్రే తథాభాసః స్వప్రఖ్యాతౌ విలజ్జతే 
౹౹238౹౹
గృహీతో బ్రహ్మణో మ్లేచ్ఛైైః ప్రాయశ్చిత్తం చరన్పునః ౹
మ్లేచ్ఛైః సంకీర్యతే నైవ తథాభాసః శరీరకైః 
౹౹239౹౹
యౌవరాజ్యే స్థితో రాజపుత్రః సామ్రాజ్యవాఞ్ఛయా ౹
రాజానుకారీ భవతి తథా సాక్ష్యానుకార్యయమ్ 
౹౹240౹౹

త్రాడు అనే జ్ఞానము పాముఅనే భ్రాంతిని తొలగింపగా వ్యర్థముగ భయపడితిని కదా అని పురుషుడు విచారించును.
మరల మరల కూటస్థమగు  సాక్షిని ధ్యానించుచు తత్పరాయణుడై ఉండును.

వ్యాఖ్య:- తత్త్వజ్ఞానము వలన భ్రాంతి రహితమగును అనుటకు దృష్టాంతం -
పాము అని భావింపబడిన త్రాడు పురుషుని పలాయనమునకు కారణమగుచున్నది.

త్రాడును చూచి పాము అని అనుకొని భయపడి పారిపోతున్నాము.భయం,
పారిపోవటం అనే కష్టాలకు కారణం భ్రమ అని 
తెలుస్తోంది గదా !
ఇది త్రాడు ! పాముకాదు ! -
అనే యదార్థజ్ఞానం కలగగానే,
సర్పజ్ఞానం - భ్రమజ్ఞానం పోయింది.
దానితోబాటు భయము పలాయనం అనే కష్టాలు సైతం పోతున్నాయి.

అట్లాగే, తత్త్వజ్ఞానం లభించగానే జీవుని జ్వరాలన్నీ
తాపాలన్నీ తొలగిపోతాయి. అక్కడ తాడు మాత్రమే అని తెలుస్తూనే,అంతవరకు 
 భీతి చెందిన భ్రాంతి తొలగింపబడగా అనవసరంగా భయపడితిని కదా అని పురుషుడు విచారించును.

అయితే,సాక్షిని గూర్చిన చింతనం నిరంతరంగా చేేయాలి.
మిథ్యాభియోగము చేసిన వ్యక్తి తన పొరపాటును గుర్తించి ప్రాయశ్చిత్తముగా క్షమాపణము కోరునట్లుగా అంటే,
లోకంలో తప్పుడు నేరం మోపబడినవాడు - తనపై తప్పుడు నేరం మోపిన వానినుండి మాటిమాటికీ క్షమాపణలు కోరినట్లుగా -
ఈ చిదాభాసకూడా -
(జీవుడు కూడా) సాక్షియైన ఆత్మయందు,భోక్తృత్వాది తప్పుడు ఆరోపణలు చేసినందున ప్రాయశ్చిత్తం కోసం మాటిమాటికీ తనను క్షమించవలసినదిగా సాక్షియైన ఆత్మను వేడుకుంటూ శరణుజొచ్చుతుంది.
కూటస్థముపై ఆరోపించిన దోషములకు ప్రాయశ్చిత్తము వలె కూటస్థమునందు లీనమగును.
ఇందుకు మరొక దృష్టాంతం -

పాపియైనవాడు మరల మరల చేసిన పాపములు - తాను అలవాటుగా చేసే పాపంనుండి నివృత్తికోసం, 
స్నాన దానాదులు
ప్రాయశ్చిత్త రూపంలో 
మరల మరల చేయునట్లే -
చిదాభాస(జీవుడు)కూడా 
సంసారిత్వాన్ని ఆరోపించుకోవటం లాంటి దోషాలు పోవటం కోసం ధ్యానాన్ని అభ్యాసంచేస్తూ, నిరంతరం  కూటస్థమగు సాక్షిని 
ధ్యానించుచు తత్పరాయణుడై ఉండును.

ఆ పిమ్మట చిదాభాస తన గుణాన్ని గురించి చెప్పుకోవటానికే సిగ్గుపడుతుంది.ఎలాగంటే,
ఉపస్థేంద్రియంలో కుష్ఠివ్యాధి ఉన్న వేశ్య ఆ తనరోగం విషయం ఎరిగిన విటుని ఎదుట తన 
హావ భావ విలాసములను - చూపుటకు లజ్జించును.అట్లే,
తన మిథ్యత్వము నెరిగిన చిదాభాసుడు కూడా జ్ఞానియెదుట తన గుణాల్ని కర్తగా భోక్తగా  తన ఖ్యాతిని ప్రకటించటానికి "నేను"అని అనటానికి  లజ్జించును.

ఆ స్థితిలో చిదాభాసకు శరీరత్రయంలో తాదాత్మ్యభ్రమ ఉండదు.
మ్లేచ్ఛునిచేత తాకబడిన శ్రోత్రియుడు ప్రాయశ్చిత్తం చేసుకొనిన తరువాత,మళ్ళీ
మ్లేచ్చులతో రాజీపడి ఎట్లా కలియక ఎలా జాగరూకతతో ఉంటాడో అట్లాగే 
చిదాభాస కూడా శరీరాది దోషములతో-
శరీరాత్రయముతోడి తాదాత్మ్యమనే మైలను తొలగించుకొన్నాక
మళ్ళీ వాటితో సంబంధాన్ని పెట్టుకోక,
సంగమేర్పడకుండు నట్లు (సంగత్వ దోషము లేకుండా) జాగ్రత్త వహించును.

మరి చిదాభాసకు సాక్షిని అనుసరించటమనే ప్రవృత్తి ఎందుకు కలుగుతుంది ?

యో బ్రహ్మ వేద బ్రహ్మైవ భవత్యేవ ఇతి శ్రుతిమ్ ౹
శ్రుత్వా తదేకచిత్తః సన్ బ్రహ్మ వేత్తి న చేతరత్
౹౹241౹౹
దేవత్వకామా హ్యగ్న్యాదౌ ప్రవిశన్తి యథా తథా ౹
సాక్షిత్వేనావశేషాయ స్వవినాశం స వాఞ్ఛతి 
౹౹242౹౹

బ్రహ్మమును తెలుసుకొనిన పురుషుడు బ్రహ్మమే అగును.
చిదాభాసుడు సాక్షిమాత్రము ఉండగోరి తన వినాశనము కోరును.

వ్యాఖ్య:- చిదాభాసకు సాక్షిని అనుసరించాలనే ప్రవృత్తి కలగడానికి కారణం -
చిదాభాస కేవలం తన దోషాల్ని పోగొట్టు కొనుటకు మాత్రమే సాక్షిని అనుసరించటం లేదు.
మోక్షమనే ప్రయోజనం కోసం సాక్షిగా అనుభూతిని పొందుతోంది.

యువరాజు పదవిలో ప్రతిష్ఠింపబడినట్టి రాకుమారుడు సామ్రాజ్యాభిలాషతో రాజును అనుసరించినట్లుగానే చిదాభాసకుకూడా ముక్తి పదవిని ఆపేక్షించి సాక్షిని అనుగమిస్తూ ఉంటుంది.

మరి యువరాజు సమ్రాట్ ను అనుసరిస్తే రాజ్యలాభం కలుగుతుంది.మరి చిదాభాసుడు కూటస్థమగు సాక్షిని అనుసరించటం వలన ఏమిటి లాభం ? అంటే -

"స యో హ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి,
నాస్యా బ్రహ్మ విత్కులే భవతి౹
తరతి శోకం తరతి పాప్మానం 
గుహ గ్రన్థిభ్యో విముక్తోఽమృతో భవతి ౹౹ 
ముండకోపనిషత్తు 3.2.9

ఎవడు సర్వోత్తమమగు పరమాత్మను తెలిసికొనుచున్నాడో,అట్టి జ్ఞాని సాక్షాత్ పరబ్రహ్మమే అగుచున్నాడు.

కావున, ప్రవహించుచున్న నదులు తమయోక్క నామరూపములను వదలి సముద్రమునందు ఏ రీతిగా లీనమైపోవునో,అదే రీతిగా ఆత్మజ్ఞాని  నామరూపములనుండి విముక్తుడై పరాత్పరుడగు పరమాత్మను పొందుచున్నాడు.
ఆత్మజ్ఞాని సకల దుఃఖములను దాటిపోవుచున్నాడు.

అటువంటి బ్రహ్మవేత్త యొక్క వంశమందు ఆత్మవేత్తకానివాడు జన్మించడు.పాపములనుండి విముక్తుడగుచున్నాడు.
హృదయములోని అజ్ఞాన గ్రంథుల ను తెంచుకున్నవాడై విడుదలై - ముక్తుడై అమృత స్వరూపుడౌతాడు.
ఇట్టి ఫలాన్ని చెప్పటము వలన,ఆ ఫలాన్ని పొందటానికై సాక్షిని అనుసరించాలనే ప్రవృత్తి కలుగుతుంది.

కాబట్టి "బ్రహ్మ విదురుడు -తదేకచిత్తముతో బ్రహ్మమునే  తెలుసుకుని బ్రహ్మమే అగుచున్నాడు".

మరి బ్రహ్మజ్ఞానము వలన బ్రహ్మప్రాప్తి కలుగుతుందికదా !
అప్పుడు చిదాభాస యొక్క స్వరూపం వినష్టమౌతుంది.
అలా స్వీయనాశనం జరిగే విషయంలో జీవునికి-చిదాభాసకు ప్రవృత్తి ఎందుకు ఉంటుంది ? అంటే -

దేవత్వం - దేవతా స్వరూపం కావాలని కోరేవాడు - అంటే,
మానవులు దేవత్వమును పొందుటకు శాస్త్రోక్తములైన అగ్ని ప్రవేశాదులు చేసి మరణించుటకు సిద్ధపడటం, మరియు గంగ మొదలగు నదుల్లో ప్రవేశం చేస్తునన్నాడు గదా !
అట్లాగే ,చిదాభాస సాక్షిరూపంలో తాను మిగలటానికై - 
సాక్షి మాత్రముగా ఉండగోరి తన వినాశనాన్ని కూడా కోరుతుంది.

ఇందుకు ఉదాహరణముగా దేవత్వ ప్రాప్తికోసం 
భృగువు అగ్నిలోను,
కుమారిలభట్టు గంగలోను ప్రవేశించినట్లు చెపుతారు.

తత్త్వజ్ఞానం వలన జీవభావం పోతుందని అంటున్నారు.
మరి తత్త్వవేత్తలలో అసలు జీవభావం ఎందుకుంటుంది ?              

No comments:

Post a Comment