Saturday, February 22, 2025

 Vedantha panchadasi:
ఏతే జ్వరాః శరీరేషు త్రిషు స్వభావికా మతాః ౹
వియోగే తు స్వరైస్తాని శరీరాణ్యేవ నాసతే
౹౹227౹౹
తన్తోర్వియుజ్యేన్న పటో వాలేభ్యః కంబలో యథా ౹
మృదో ఘటస్తథా దేహో జ్వరేభ్యోఽ పీతి దృశ్యతామ్ 
౹౹228౹౹
చిదాభాసే స్వతః కోఽ పి జ్వరో నాస్తి యతశ్చితః ౹
ప్రకాశైక స్వభావత్వమేవ దృష్టం న చేతరత్ 
౹౹229౹౹

వస్త్రం నుండి పోగులు వేరైన వస్త్రానికి ఉనికి లేనట్లే, 
శరీర సంతాపములు తొలగించినచో శరీరములు కూడా నశించును.చైతన్యం కన్నా భిన్నంగా ఏదీలేదు.

వ్యాఖ్య:- జన్మ జరాది దుఃఖాలను - తాపములను నశింపచేయుట ఎలా ? 

స్థూల సూక్ష్మకారణ శరీరాలకు కలిగే జ్వరాలు శరీరంతో పాటే పుడతాయి కాబట్టి ఈ సంతాపములు మూడు శరీరములకును 
"స్వాభావికాలు " అంటారు.
ఈ జ్వరాలకు శరీరంతో వియోగం కలిగిందంటే ఇక ఆ శరీరాలు ఉండజాలవన్నమాటే !
వీటిని తొలగించినచో శరీరములు కూడా నశించును కాబట్టి ఆ జ్వరాలు స్వాభావికాలన్నమాట.

శరీరములను తొలగించడమంటే -
వస్త్రము నుండి దారపుపోగులన్నీ వేరైపోయినప్పుడు ఇక వస్త్రమనేది ఉండదు.
కంబళినుండి రోమములన్నీ  (వెంట్రుకలు) 
విడిపోయినప్పుడు కంబళి అనేది ఉండదు.
అట్లాగే మట్టి రేణువులన్నీ కుండ నుండి విడిపోయినప్పుడు ఇక కుండయొక్క అస్తిత్వమే ఉండదు , అనే విషయం ప్రత్యక్షంగా కనిపిస్తున్నదే !

 అలాగే ఈ సంతాపములను వేరు చేసినచో ఆయా శరీరములు కూడా నశించును.
కూటస్థ చైతన్యంలో ఏ జ్వరాలు - సంతాపాలు లేవుకదా ! ముందుగా చిదాభాస గురించి చూద్దాం.

అయినా చిదాభాసమైన జీవునిలో ఏవిధమైన జ్వరమూలేదు.
ఎందుచేతనంటే - 
చిద్రూపం స్వయంప్రకాశం 
కలది కదా ! 
బింబం ఎట్లా ఉంటే ప్రతిబింబం కూడా అట్లాగే ఉంటుంది కదా !

ప్రకాశమే స్వరూపంగా కలిగిన చిద్రూపం - చైతన్యం.
అందుచేత , ఆ చిద్రూపానికి ప్రతిబింబరూపమైన చిదాభాసలో - జీవునిలో కూడా  ఇతరములయిన 
జ్వరాలు - తాపాలు ఉండటానికి వీలులేదు.

అయినా ఈ సంతాపములు చిదాభాసకు సహజములు కావు.ఆయా శరీరములతో తాదాత్మ్యమును భావించుట చేత అవి చిదాభాసుని బాధించును.

చిదాభాసుడు చైతన్యము కంటె స్వరూపమున భిన్నుడు కాడు కనుక అది కూడా చైతన్యము వలె ప్రకాశమే స్వభావముగ కలిగియున్నది.

ఆకాశమును ప్రతిఫలించుచున్న నూనెను కాచినచో ఆ వేడి ఆకాశమునకు గాని ఆకాశప్రతిఫలనమునకు గాని అంటదు.అట్లాగే -
శరీర తాపములు చిదాభాసను గాని చైతన్యమునుగాని భాధింపవు.

చిదాభాసేప్యసంభావ్యా జ్వరాః సాక్షిణి కా కథా ౹
ఏవమప్యేకతాం మేనే చిదాభాసో హ్యవిద్యయా 
౹౹230౹౹
సాక్షి సత్యత్వమధ్యస్య స్వేనోపేతే వపుస్త్రయే ౹
తత్సర్వం వాస్తవం స్వస్య స్వరూపమితి మన్యతే 
౹౹231౹౹
ఏతస్మిన్ భ్రాంతి కాలేఽ యం శరీరేషు జ్వరత్స్వథ ౹
స్వయమేవ జ్వరామీతి మన్యతే హి కుటుంబివత్ 
౹౹232౹౹
పుత్రదారేషు తప్యత్సు తపామీతి వృథా యథా ౹
మన్యతే పురుష స్తద్వదాభాసోఽ ప్యభిమన్యతే
౹౹233౹౹
వివిచ్య భ్రాంతి ముజ్ఘిత్వ స్వమప్యగణయన్సదా ౹
చిన్తయన్సాక్షిణం కస్మాచ్ఛరీర
మనుసంజ్వరేత్ 
౹౹234౹౹

చిదాభాసుడు శరీరతాపములు తన తాపములే అని నిరర్థకముగ అభిమానించును. భ్రాంతి తొలగిన పరితాపము ఉండదు.

వ్యాఖ్య:- మరి ఈ తాపములు సాక్షి యందు వుంటాయా ? అంటే -
ఈ బాధలు చిదాభాసునియందే -జీవునిలోనే ఈ జ్వరాదులు ఉండటానికి  అసంభవములనినచో సాక్షి యందు అసంభవములని వేరుగా చెప్పవలయునా ?
అక్కరలేదు.ఇక ,
సాక్షియైన కూటస్థునియందు తాపాలుంటాయనే కల్లబొల్లి కథలన్నీ ముగిసినట్లేకదా !

అయినా అవిద్య వలన చిదాభాసుడు శరీరములతో తాదాత్మ్యమును భావించుకొని పరితపించుచుండును.
అవిద్యవలన శరీరాదులతో ఏకత్వాన్ని - తాదాత్మ్యాన్ని భావించటంవల్ల 
"నేను దుఃఖిని" అని అంటున్నాడు.అంటే శరీరత్వాన్ని అనుభవిస్తున్నాడన్నమాట.

చిదాభాసుడు తనపైనను స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయముపైనను సాక్షిగతమైనట్టి  సత్యత్వమును 
ఆరోపించుకొని-కల్పించుకొని తాపాలను కలిగించే ఈ మూడువశరీరాలను తన పారమార్థిక స్వరూపం - 
అసలు స్వరూపం -
వాస్తవమైన స్వరూపం 
అని అనుకోవడం ప్రారంభిస్తాడు.

ఇదే భ్రమాజ్ఞానం.
ఈ భ్రమాజ్ఞానం వల్ల ఏమి జరుగుతుంది ? అంటే -
ఈ చిదాభాస,ఇటువంటి భ్రాంతి దశలో శరీరముల తాపాలను తనపై ఆరోపించుకొని దుఃఖితుడౌతూ తానే తపించుచున్నానని భావించును. ఎట్లాగంటే -
కుంటుంబియైన వాడు తన కుటుంబ సభ్యులైన 
పుత్ర కళత్రాదులకు కలిగిన విపత్తులు - సుఖదుఃఖా లన్నింటిని తనకు ఆరోపించుకొని వాటివల్ల తాను సుఖియైనట్లు తాను దుఃఖితుడైనట్లు భావించునట్లు !

గృహస్థుడైనవాడు పుత్ర కళత్రాదుల దుఃఖాలవల్ల 
"నేను దుఃఖితుణ్ణి"అని అనవసరంగా,వ్యర్థముగా భావిస్తున్నాడు.అట్లాగే,
చిదాభాసకూడా ఈ శారీరక దుఃఖాల్ని తనయందారోపించుకొని -
ఈశరీరం తనదని -
తానే ఈశరీరమని అనుకొని దుఃఖితుడౌతూ ఉంటాడు. అజ్ఞాన దశలో,ఈ విధమైన జ్వరం భ్రాంతివల్ల కలుగుతుంది.

వివేకదశలో ఈ విధమైన జ్వరం - తాపం ఉండదు.
వివేచనచే ఆ భ్రాంతిని తొలగించుకొని తనను కూడా సత్యమని లెక్కింపక సర్వదా కూటస్థమగు సాక్షిని గూర్చి చింతించే  చిదాభాసుడు ఇక శరీరతాపములను అనుసరించి ఏల పరితపించును ?

చిదాభాసం - జీవాత్మ తన పారమార్థిక స్వరూపమైన కూటస్థుని,తనకంటె భిన్నమైన శరీరాదుల్ని గుర్తించి - ఎరిగి
తన నిజస్వరూపమైనట్టి జ్వరాదితాపాలేవీ ఉండనట్టి 
సాక్షి స్వరూపాన్ని ఎల్లప్పుడూ చింతచేస్తూ ఉంటే,
ఇక ఈ శరీరాదుల వెంటబడి ఎందుకు పరితపించాల్సి వస్తుంది ?పరితపింపడు.
అటువంటి అగత్యం ఉండదు అని భావం.
జీవుడు,శరీరాదులు తనకంటె భిన్నమైనవని తెలుసుకొన్నందువల్ల వాటికోసం సంతాపం చెందడు
అని భావం.

భ్రాంతిజ్ఞానమనేది 
సంతాప కారణం అనీ ,
తత్త్వజ్ఞానమనేది 
సంతాప రాహిత్యానికి కారణమనీ అన్నప్పుడు ఇందుకు దృష్టాంతం ఏంటి ?              

No comments:

Post a Comment