Tuesday, February 25, 2025

**** *నీళ్ళు* *నీళ్ళకు, మోకాళ్ళ నొప్పులకు ఏమి సంబంధం?*

 *నీళ్ళు*

*నీళ్ళకు, మోకాళ్ళ నొప్పులకు ఏమి సంబంధం?* 

నీళ్ళు, నీరు, అంబువులు, సలిలము, జలము, తోయము, ఉదకము--వీటిలో కొన్ని సంస్కృత పదాలు.  ఆపః అంటే కూడా సంస్కృతం లో నీరే. ఈ ఆపః అనే పదం వేదంలో ఎక్కువగా కనబడుతుంది. 
[ పంజాబ్ అంటే పంచ ఆపః  అని --జీలమ్ , చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్  ఐదు నదులు ప్రవహించే ప్రదేశము కాబట్టి పంజాబ్ అయింది ఇది విషయాంతరము...]  

సాధారణముగా నీరు అనేది మన దప్పిక తీర్చుటకు ఉంది ---అని మనం అనుకుంటాము.  నీరు తప్పకుండా దాహము తీరుస్తుంది, అంతేకాదు, శరీరానికి అలసట పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది, ఆకలి కూడా తీరుస్తుంది.  కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా హిమాలయాలలోని ఊటలలో దొరికే నీరు రోజుకు ఒకసారి తాగితే చాలు, ఆకలి దప్పులు ఉండవు,  స్వచ్చమైన నీరు రోగాలను రానివ్వదు, ఉన్నవాటిని పోగొడుతుంది కూడా. 

శరీరానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని జీర్ణము గావిస్తుంది,  మనో వ్యాకులతను పోగొడుతుంది.  అందుకే కొన్ని నదుల జలాలను అమృతమయము అని పిలుస్తారు. 

తియ్యటి నూతి నీళ్ళు, త్రిదోషాలను హరిస్తాయి, అగ్ని దీప్తిని [ ఆకలిని  కానపుడు ] ఆరోగ్యాన్ని ఇచ్చును.  అన్నిరోగాలకూ పథ్యమైనవి మంచినీళ్ళు. 

సరే, ఇవన్నీ అందరికీ తెలిసే ఉండును... ఇంకా తెలియనివి యేమంటే, శుద్ధమైన జలానికి జ్ఞాపక శక్తి ఉంటుంది.  అది భావాలను కలిగించగలదు, ఒకరి నుండీ ఇంకొకరికి అనుభూతులను, భావాలను, ఉద్దేశాలను కూడా పంచగలదు. 

నీరు ,తనలో సమాచారాన్ని నిలువ ఉంచుకుంటుంది. ఆ సమాచారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి పంచాలో , తెలిసిన తెలివి ఉంది. 

నీటిలో స్నానము చేసినపుడు, శుద్ధిపరచుట మాత్రమేకాక, మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  మనసును తేలిక పరుస్తుంది. భయము, విహ్వలత, ఆందోళన వంటివి ఉంటే పోగొడుతుంది.

సంధ్యావందనములో నీటిని అనేకరకాలుగా ఉపయోగిస్తాము.
మొదట ఆచమనము చేసినపుడు, అంతఃశ్శుద్ధి కోసము, మార్జనము చేసినపుడు బాహ్యశుద్ధి తోపాటు చిత్తశుద్ధి కోసము, అర్ఘ్యము వదలినపుడు చెప్పే ,మంత్రము వలన మన సందేశాన్ని సూర్యుడికి అందజేస్తుంది. మన సందేశము నీటికి చేరి, నీటి నుండీ సూర్య కిరణాలకు చేరుతుంది. 

తర్పణాలు వదిలేటప్పుడు, ఆయా దేవతలకు హవ్య కవ్యాలు గామారి, వారి సూక్ష్మ శరీరాలకు క్షుత్పిపాసలు తీరుస్తుంది. మంత్రించిన నీటిని శరీరభాగాలకు తాకిస్తే, ఆయా భాగాలలోని చెడు తత్వాలు[ గుణాలు, లేక చెడు శక్తి ] వదలి  స్వఛ్ఛంగా చేస్తుంది. 

పూజలలో దేవతలకు ఏ ఉపచారము చేసినా, దానితోపాటు ఉద్దరిణె నీరు వదలి, ’ సమర్పయామి ’ అంటాము. అప్పుడే అది ఆయా దేవతలకు చెందుతుంది. నైవేద్యములో నీటిని  ప్రోక్షణకు, ఆచమనీయానికి, పరిషేచన కు వాడుతాము. మనము చేసే నివేదన అమృతమయము అవనీ--అని [ అమృతోపస్తరణమసి ] భావిస్తే అది అమృతమే అవుతుంది.

పుణ్యాహ వాచనము చేసిన నీరు అతి శ్రేష్టమైనది. అది గంగ వలె సర్వ పాపాలనూ పొగొడుతుంది, అందుకే ఆ నీటిని గృహ,  భూ, భాండ, పాక శుద్ధికి ఉపయోగిస్తారు. 

శ్రాద్ధాలలో నీరు లేకపోతే ఆ కార్యమే లేదు. ఆచమనాలు, తర్పణాలు, దానాలు, ఔపోశనాలు, పరిషేచనాలు, హోమాలలో హోమకుండాన్ని పరిస్తరణ చేసేదానికి, చివరికి అగ్నిని శుద్ధి చేయడానికి కూడా నీరే వాడుతాము. 

ఏదైనా దానము ఇచ్చినపుడు, మన ఉద్దేశాన్ని నీటిలోకి ప్రవేశింపజేసి, ఆ నీటిధారతో అవతలివారికి ఆ దానము అందేలా చేస్తాము. అంతేకాదు, నీటిని దానము చేయడము వలన కూడా ఎంతో గొప్ప ఫలము లభిస్తుంది. అందుకే ఎండాకాలంలో చలివేంద్రాలు కట్టిస్తారు. భావులు, చెరువులు తవ్వించుట [ దీన్ని ఇష్టాపూర్తం అంటారు ] గొప్ప పుణ్య కార్యము . వసంత నవరాత్రుల్లో బ్రాహ్మడికి ఉదక కుంభము దానము చేస్తే విశేష ఫలితము.

 ఋషులు, మునులు శాపాలు ఇచ్చేటప్పుడు కూడా నీటికి ఆ శాపోద్దేశాన్ని ఆపాదించి, మంత్రించి పైన చల్లుతారు

మైల పోగొట్టుకొని పవిత్రులు కావడానికి కూడా మంత్రోచ్చారణతో సంప్రోక్షణ చేస్తారు. 

దేవుడికి అభిషేకించిన నీరు ఎంతో పవిత్రమైన శక్తిని పొంది ఉంటుంది. అందుకే ఆనీటిని తీర్థముగా ఇస్తారు. ప్రోక్షణ కు కూడా వాడుతారు. 

ఇక పుష్కరాలు వంటి సమయాల్లో నదుల నీరు కొత్త శక్తిని కలిగి ఉంటాయి.  ప్రకృతిలోని సకారాత్మక శక్తులన్నీ ఆ నీటిలో చేరుతాయి.  అందుకే పుష్కరాల్లో నదీస్నానం ఎంతో పాపహరము, కొత్త శక్తిని కూడా ఇస్తుంది.

నీళ్ళు అనేక రకాలు. అన్ని నీళ్ళ కన్నా గంగానది నీరు ఎంతో పవిత్రమైనది. గంగ పేరు విన్నా, తలచుకున్నా, పలికినా, పవిత్రతను ఇస్తుంది. గంగా స్తోత్రము చేసేవారు, ఎక్కడున్నా గంగా సమీపములో ఉన్నవారే.  వేదపారాయణము, యజ్ఞయాగాదులు ,క్రతువులు చేసిన ఫలము గంగా స్తోత్రముతో వస్తుంది. శ్రాద్ధాలలో అభిశ్రవణ మంత్రాలతో పాటూ గంగా స్తోత్రము చదివితే ఆ పుణ్యము మనకు అనేక జన్మలలో ఫలాన్ని ఇస్తుంది. 

సన్యాస స్వీకార సందర్భం లో, ఉత్తరాధికారి/ లేదా శిష్య స్వీకార సందర్భంలో నదీస్నానము తప్పనిసరి.  కొన్ని కొన్ని ప్రత్యేక  సందర్భాల్లో  చెరువు, తటాకము వంటివి ఉంటేనే కార్యాలు సిద్ధిస్తాయి... సర్పసంస్కారము వంటివి.

శ్రాద్ధాలలో పిండాలను నీటిలో కలిపే ఆచారము కూడా ఉంది.

కొన్ని సాంప్రదాయాలలో యతులు మరణిస్తే, జలసమాధి మాత్రమే చేస్తారు 

అలాగే, కొన్ని ఋతువుల్లో, సందర్భాల్లో, గ్రహణాల్లో నీటికి, ముఖ్యంగా నదీజలాలకు రజోగుణము ఆవరిస్తుంది. అప్పుడు ఆ నీటిలో స్నానము చేయరాదు. 
చెడు గుణాలు, చెడు తలపులు ఉన్నవారు ఇచ్చిన నీరు తాగితే మనకు ఆ చెడు ఆవరిస్తుంది. 

అన్నిటికన్నా విశేషము, 
నీటిని ఎప్పుడూ కూడా నిలుచుకొని త్రాగకూడదు. నేల మీదో, కుర్చీ మీదో కూర్చొని మాత్రమే తాగాలి. నిలుచొని తాగితే శరీరములోని వాయువు కీళ్ళ మధ్య చేరి,  మోకాళ్ళ నొప్పులు వస్తాయి.  ఆచమనాలు కూడా ఎప్పుడూ నిలుచుకొని చేయరాదు. మామూలుగా బాసింపట్టు వేసుకొనో, సుఖాసనం లోనో, గొంతుక్కూర్చొనో చేయాలి, తాగాలి. 
తీర్థం తీసుకున్నా, కూర్చొనిమాత్రమే తీసుకోవాలి.

మనిషి నీరు లేకున్నా చనిపోతాడు, నీరు ఎక్కువైనా చనిపోతాడు. 

నీటికి ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. నీరే కదా..అని అలసత వద్దు. 

No comments:

Post a Comment