వారానికి
70 గంటలు పనిచేయాలి
- అంటాడు ఒక పారిశ్రామిక దిగ్గజం
వారానికి
90 గంటలు పని చేయాలి
అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి
ఇంట్లో కూర్చుని
భార్యా పిల్లల మొహాలు చూస్తుంటే
బోర్ కొట్టదా ....
అని చమత్కరించి
తన చమత్కృతికి తానే
పడి పడి నవ్వేస్తాడు మరో పారిశ్రామిక దిగ్గజం
*******
పోనీ ....
ఇలా పనిచేయటం
దేశ పునర్నిర్మాణం కోసమా అంటే ...
కాదు కాదు
కొందరి సంపన్నుల
జేబులు నింపడం కోసం
కొందరు వ్యాపారవేత్తలను
ప్రపంచ ధనికుల జాబితాలో
నిలపడం కోసం ...
********
రోజుకు
24 గంటలు
ఎనిమిది గంటలు పని
ఎనిమిది గంటలు విశ్రాంతి నిద్ర
మిగిలిన ఎనిమిది గంటలు కుటుంబం కోసం వినోదం కోసం ....
ఇదీ ...
మానవ శరీర నిర్మాణ అధ్యయన వేత్తలు
మానవ మనోవిజ్ఞానవేతలు
పరిశోధించి తేల్చిన నిజం
**********
ఎనిమిది గంటల పని కోసం...
సమాన వేతనాల కోసం ...
పనిచేసే చోట మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ...
కార్మికుల శ్రామికుల ఉద్యోగుల భద్రత కోసం ...
చరిత్రలో
ఎన్నెన్ని త్యాగపూరితమైన
పోరాటాలు జరిగాయో
బహుశా తెలిసుండకపోవచ్చు ప్రస్తుత తరానికి
**********
అందరికీ విద్య
అందరికీ ఉపాది
అందరికీ ఆరోగ్యం
అందరికీ విశ్రాంతి వినోదం ...
అందరికీ సమానమైన అవకాశాలు ....
కల్పించే ఒకానొక వ్యవస్థ కోసం ....
చేయాల్సిన ప్రణాళికా బద్ధమైన పోరాటాన్ని ....
ఒకానొక మహనీయుడు ప్రపంచానికి అందించాడు అన్న విషయం కూడా ఎప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు
*********
ప్రపంచ కార్మికులారా ... ఏకం కండి
పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప
అన్న సంకల్ప మంత్రాన్ని
ఉపదేశించాడు అన్న సంగతి కూడా
ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు
అందుకే ....
పైన చెప్పిన వ్యాపార దిగ్గజాలు
ఇచ్చిన పిలుపులు
దేశభక్తి పూర్వకమైన
ఉపదేశాల్లా అనిపిస్తున్నాయి కొందరికి
ఇప్పటికీ
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment