Saturday, February 22, 2025

 Vedantha panchadasi:
విలయోఽ ప్యస్య సుప్త్యాదౌ సాక్షిణా హ్యనుభూయతే ౹
ఏతాదృశం స్వస్వభావం వివినక్తి పునః పునః 
౹౹218౹౹
వివిచ్య నాశం నిశ్చిత్య పునర్భోగం న వాఞ్ఛతి ౹
ముమూర్షుః శాయితో భూమౌ వివాహం కోఽ భివాంఛతి 
౹౹219౹౹
జిహ్రేతి వ్యవహర్తుం చ భోక్తాహమితి పూర్వవత్ ౹
ఛిన్ననాస ఇవ హ్రీతః క్లిశ్యన్నారబ్ధమశ్నుతే 
౹౹220౹౹
యదా స్వస్యాపి భోక్తృత్వం మన్తుం జిహ్రేత్యయం తదా ౹
సాక్షిణ్యారోపయేదేతదితి కైవ కథా వృథా 
౹౹221౹౹

చిదాభాసుడు మిథ్యయనీ - కూటస్థుము కంటె భిన్నుడనీ తేటపడును.

వ్యాఖ్య :- జగత్తులాగానే చిదాభాస - జీవుడు కూడా నాశస్వభావం కలదని అనుభవంద్వారాకూడా తెలుస్తోంది !

సుషుప్త్యాదులందు - సుషుప్తి,మూర్ఛ మొదలైన అవస్థల్లో చిదాభాస నష్టమవడం - లయమవడం నిర్వికారమగు సాక్షి చూచుచున్నది.అది మనకు అనుభవంలోకి వస్తూనే ఉంది.
ఈ విధంగాకూడా చిదాభాస యొక్క మిథ్యత్వం తెలుస్తూనే ఉంది.

ఇట్లా మిథ్యత్వజ్ఞానం కలిగిన పిమ్మట తన మిథ్యత్వ స్వభావాన్ని గూర్చి మాటి మాటికి కూటస్థ చైతన్యం ద్వారా తెలుసుకుంటాడు.
ఇలా మరల మరల వివేచించుచుండగా ఇట్టి స్వభావంగల చిదాభాసుడు మిథ్యయనీ కూటస్థముకంటే భిన్నుడనీ తేటపడును.
ఇట్లా మిథ్యత్వజ్ఞానం నిశ్చయమైన పిమ్మట ఏమిజరుగుతుంది ? అంటే -

కూటస్థుని ద్వారా స్వప్నరూపాన్ని  వివేచనచేసిన మీదట"తాను నశించునని"
"తనకు వినాశనం తప్పదు" అని నిశ్చయించిన చిదాభాసుడికి ఇక ఆ స్థితిలో భోగేచ్ఛ పుట్టదు.విషయ భోగములను కోరడు. 
ఇందుకు ఒక దృష్టాంతం -

పురుషుని - ముముక్షువైన వానిని మరణమాసన్న మగుటచే భూమిపై పరుండబెట్టబడిన ఆ  స్థితిలో వివాహం చేసుకోవడానికి అభిలషించునా ?
ఆ స్థితిలో ఆ ముముక్షువు వివాహం చేసుకోవాలని కోరడుగదా !

అశాశ్వత శరీరములలో ఉండియున్నను ఈ ఆత్మ శరీరము లేనిది,మిక్కిలి గొప్పది.సర్వ వ్యాప్తి గలది. దేహములందు దేహము లేనివానిగను అనిత్యముల యందు నిత్యునిగను, మహాత్మునిగను 
ఆత్మను తెలిసికొనిన ధీరుడు దుఃఖింపడు అని
"కఠోపనిషత్తు" చెప్పుచున్నది.

బ్రహ్మవేత్త ఆత్మవిజ్ఞానమును ఆచార్యాగమములవలన నిశ్శేషముగా దెలిసికొని సమస్తమైన విషయముల యొక్కదృష్టిని తిరస్కరించవలెను.ఈ రీతిగా 
ఆత్మ విజ్ఞానమును 
అనాత్మ జ్ఞాన దృష్టిని తిరస్కరించుటను నిశ్శేషముగా దెలిసికొని జ్ఞాని కృతకృత్యుడగుచున్నాడని "బృహదారణ్యకోపనిషత్తు" చెప్పుచున్నది.

వివేకియైనవాడు- చిదాభాసుడు,పూర్వమువలె 
"నేను భోక్తను"అని వ్యవహరించుటకు లజ్జించును.
ముక్కు కోసి వేయబడిన వానివలె లజ్జనొందుచు ప్రారబ్ధమును అనుభవించుచుండును.
అంటే -

జ్ఞానియైనవానిని,
"తానుభోక్తను" అనే అనుభవంకూడా సిగ్గుపడేటట్లు చేస్తుంది.జ్ఞానోత్పత్తి జరిగిన తరువాత ప్రారబ్ధకర్మ పరిసమాప్తి పర్యంతం జ్ఞాని ముక్కు కోయబడినవానిలాగా సిగ్గుపడుతూ,
"నేదానీమపి కర్మక్షీయతే" - 
ఇంకా నాకు కర్మక్షయం కాలేదు 
అని !

జ్ఞానం కలిగిన పిమ్మట సాక్షియందు తాను భోక్తననే అనుభవం ఉండదు అని భావం.

తనయందు భోక్తృత్వమును అంగీకరించటానికి - భావించుకొనుటకు సైతం  చిదాభాసుడు లజ్జించుచుండగా ఇక కూటస్థమగు సాక్షిపై భోక్తృత్వమును ఎట్లు ఆరోపింపగలడు ?అంటే -
"స్వగతమైన భోక్తృత్వాన్ని అసంగుడైన సాక్షియందు ఆరోపిస్తాడు" అంటూ ఇటువంటి నిరర్థకమైన మాటలు వద్దు అని భావం.

ఇక శృతి యొక్క ఆశయాన్ని చూద్దాం -

ఇత్యాభిప్రేత్య భోక్తార మాక్షిపత్యవిశఙ్కయా ౹
కస్యకామాయేతి తతః శరీరానుజ్వరో న హి 
౹౹222౹౹
స్థూలం సూక్ష్మం కారణం చ శరీరం త్రివిధం స్మృతిమ్ ౹
అవస్యం త్రివిధో ఽ స్త్యేవ తత్రోచితో జ్వరః 
౹౹223౹౹
వాత పిత్తశ్లేష్మజన్యవ్యాధయః కోటిశస్తనౌ ౹
దుర్గంధత్వ కురూపత్వదేహభఙ్గాదయస్తథా 
౹౹224౹౹
కామక్రోధాదయః శాన్తిదాంతాన్త్యాద్యాః లిఙ్గదేహగాః ౹
జ్వరా ద్వయేఽ పి బాధన్తేప్రాప్త్యాప్రాప్త్యా నరం క్రమాత్ 
౹౹225౹౹
స్వం పరం చ న వేత్త్యాత్మా వినష్ట ఇదకారణే ౹
ఆగామిదుఃఖబీజం చేత్యేతదింన్ధ్రేణ దర్శితమ్ 
౹౹226౹౹

శ్రుతి 'కస్యకామాయ' అని భోక్త లేకుండుటను
సూచించుచున్నది.మూడు శరీరములకు తగినట్లు మూడువిధములైన సంతాపములు ఉండనే ఉండును.

వ్యాఖ్య:- 
"ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరుషః ౹
కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్ ౹౹

బృహదారణ్యకోపనిషత్తు నందు - 
"నేనే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనైన బ్రహ్మను,అని తెలుసుకొన్నవాడు ఇక కోరేదేమి ఉంటుంది ?
ఏ భోగాలకోసం ఈ శరీరం వెంటబడి సంతప్తుడౌతాడు ?అంటే అతనికి కోరవలసినవేవీ ఉండవు.
ఆత్మబోధ కలిగినవానిని జన్మ జరాది దుఃఖాలు బాధింపవు అని భావం.

కూటస్థుడుగాని,చిదాభాసగాని 
పారమార్థికంగా చూస్తే భోక్తలుకారు.ఈ విషయాన్ని చెప్పటానికే 
"కస్యకామాయ ....బృహ.ఉప
శ్రుతి వాక్యం చెప్పబడ్డది.
ఈ మాటల్లో అనుమానానికి తావులేకుండా భోక్తృత్వాన్ని భోక్తకు నిరాకరించింది. అందుచేత జ్ఞానికి తత్త్వజ్ఞానం కలిగిన మీదట దైహిక తాపాలు బాధించవు అని ఫలితార్థం.

జ్ఞానికి శరీరతాపాలు ఉండవని చెప్పారుగదా !
కానీ మూడు శరీరాలు ఆయాశరీరాలకు అనుభవింపదగినట్టి మూడు  రకాల సంతాపాలు తప్పకుండా ఉంటాయి.అవి -

స్థూలశరీరం,సూక్ష్మశరీరము, కారణశరీరం అని మూడు విధములు.
సూక్ష్మశరీరాన్ని లింగశరీరం అనికూడా అంటారు.

స్థూలశరీరంలో వాతము,పిత్తము,శ్లేషము అనే 
త్రిదోషాలవల్ల కలిగే అసంఖ్యాకమైన రోగాలు, దుర్గంధము,కురూపత్వము,
దాహము - జ్వరం ,
అంగభంగం -వికలాంగత్వం,
విరుగుట - ఎముకలు మొదలగునవి,చోరబాధలు
మొదలగు సంతాపాలు అసంఖ్యాకంగా కలుగుతూ ఉంటాయి.ఇవన్నీ సామాన్యంగా అనుభవిస్తునే ఉంటాము. ఇక 
సూక్ష్మశరీరము - లింగశరీరం 

 కామం,క్రోధం,లోభం,మోహ,
మద,మాత్సర్యములు
మొదలైనవి సూక్ష్మశరీరము నకు చెందినవి.
ఇవి లభించటం వల్ల కలిగే జ్వరాలు - తాపాలు :
శమం,దమం,తితిక్ష మొదలైన సద్గుణాలు లభించనందువల్ల కలిగే జ్వరాలు,దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. 

"నాహం ఖల్వయమేవం సంప్రత్యాత్మానం జానాత్యయమహమస్మీతి నో ఏ వేమాని భూతాని వినాశమేవాసీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామి"-

కారణశరీరంలో కలిగే జ్వరాలను గూర్చి ఛాందోగ్యంలో 8-11-1,2 ప్రస్తావించి యున్నారు.

ఈ శ్రుతివచనాన్ని బట్టి ఆత్మ కారణశరీరము లో ప్రవేశించినప్పుడు మృతుని వలె తనను గురించిగానీ, ఇతరుల గురించి కూడా తెలియదు.
అజ్ఞానం వల్ల వినష్టమైపోయినట్లుగా అవుతుంది.ఈ అవస్థయే రాబోయే దుఃఖాలకు కూడా కారణమౌతుంది.అని ఈ విధంగా ఇంద్రుడు తన గురువైన ప్రజాపతి యెదుట చెప్పినట్లుగా ఛాందోగ్యంలో ఉంది.

కాబట్టి, అజ్ఞానంవల్ల ఏమీ తెలియక సర్వమూ నష్టమైపోయినట్లు అనిపించటం,
భావి సుఖ దుఃఖాలకు కారణముగా ,బీజములుగా అవటం ఇవన్నీ కారణ శరీరానికి కలిగే తాపాలు.

సరే, ఐతే వీటన్నింటినీ నశింపచేయుట ఎలా ?              

No comments:

Post a Comment