Monday, February 24, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


117. పక్షేభిరపి కక్షేభిరత్రాభి సంరభామహే

మా పక్షము వారితో, ఇతర పక్షములతో అన్ని విధాల కలిసి పనిచేయుదుము (వేదవాక్యం)

గొప్పజీవితము కలవారు ఎలా ప్రవర్తించాలనుకుంటారో పై మంత్రంలో
కనబడుతుంది. తమవారు, పై వారు అనేది తప్పనిసరి విభజన. వ్యక్తికిగానీ, ఒక సామూహిక విభాగానికిగానీ ఈ భావాలు అనివార్యం. అయితే 'సమాజ శ్రేయస్సు' అనే లక్ష్యం సాధించడంలో అందరూ సమైక్యం కావాలి.

ఒకొక్క పక్షంలో ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక సులక్షణాలను ఏ విధంగా వినియోగించి మంచిని సాధించవచ్చో గ్రహించి ఏకత్వం సాధించాలి.

మొత్తానికి పై మంత్రం చెప్తున్న గొప్పభావం - "పక్షపాతం లేకుండా ఉండడం”.

మంచి ఏ పక్షాన ఉన్నా దానిని ప్రశంసించాలి, ప్రోత్సహించాలి, స్వీకరించాలి.

కులం, మతం, వర్గం, వర్ణం, సిద్ధాంతం, పార్టీ... ఇలా ఎన్నో పక్షాలు ఏ సమాజంలోనైనా ఉంటాయి. ఎవరైనా అటూ యిటూ ఉన్నవారు మనుష్యులే. వారి మధ్య వైషమ్యాలు కూడా అనివార్యమే.

తన పక్షం కానివారు ఏం చేసినా తప్పుగా కనబడడమో, తప్పుగా చూపించాలని తాపత్రయ పడడమో సహజం. అదే విధంగా తన పక్షం ఎప్పుడూ సరియైనదే అనే
భావమూ సహజమే. కానీ అవతలి తప్పును ఎండగట్టడానికి, వారు దోషం చేయకుండా నిగ్గదీయడానికి ఈ భావం పనికివస్తుంది. ప్రశ్నించి, నిలదీసి అడ్డుకునే విపక్షం
ఉన్నప్పుడు ఇవతలి పక్షంవారు జాగ్రత్త వహిస్తారు. ఇదొక విధంగా 'నియంత్రణ'గా సహకరిస్తుంది.

కానీ - ప్రతి మంచిని అడ్డుకొని, ధ్వంసం చేసే విషమభావం కలిగిన విపక్షతత్త్వము ప్రమాదకరమే.

ఈ అవాంఛనీయ వైపరీత్యం కలగకుండా ఉండాలని పై మంత్రాకాంక్ష. యుగాలనాటి వేదధర్మంలో సమాజంలో సౌమనస్య, సామరస్యాలను ఎంత చక్కగా
ఆకాంక్షించారో ఈ మంత్రమే చెబుతుంది. సమైక్య సమాజ దృక్పథం కలిగిన గొప్ప నాగరికత ప్రాచీన భారతీయ సిద్ధాంతంలో అత్యంత సహజంగా ఉందని ఈ
వేదవిజ్ఞానమే స్పష్టపరుస్తోంది.

ఈ మంత్ర పూర్వభాగంలో... “దేవతా సంబంధులమైన మేము ఎవరినీ
హింసించము. ఎవరినీ దారి తప్పించము. మంచి ఆలోచనా విధానాన్ని అమలు పరుస్తాము” అనే మంత్రముంది. 'దేవతా సంబంధులు' అంటే విశ్వహితాన్ని కాంక్షించే
సుమనస్కులు. సమూహహితం కోసం వైయుక్తిక పక్షపాత ధోరణులను పరిత్యజించాలి.అని శ్రుతిమతం - అదే దివ్య జీవనం. ఈ దివ్యలక్షణాన్ని సమాజంలో ప్రబోధించి
భారతీయధర్మాన్ని పటిష్ఠపరచాలి.

సమైక్యత భారతీయ హైందవ సహజ విధానం.

హిందువులకు సమైక్య జీవనం, సహన సామరస్య భావన రక్తనిష్ఠమైనవి. వేదకాలం నుండి విస్తరిల్లిన ఈ పవిత్ర భావన ముఖ్యంగా నాయకవర్గాల వారు గ్రహించాలి. చక్కని పాలనా విధానానికి ఇదే పరమమంత్రం.

స్వపక్ష, విపక్షాలు దేశహితం కోసం ఏకోన్ముఖంగా కృషి చేయడం కంటే ప్రగతి ఏముంటుంది?   

No comments:

Post a Comment