Saturday, February 22, 2025

 *ఈరోజు పురాణ కథ గరుడుడు గురించి:*

కశ్యపప్రజాపతికి వినతవలన పుట్టిన కొమారుఁడు. ఇతని అన్న అనూరుఁడు. 
ఇతఁడు తన తల్లి అయిన వినతయొక్క దాసీత్వమును మాన్పుటకై కద్రువయొక్క పుత్రులు కోరినప్రకారము దేవేంద్రుని గెలిచి అమృతము తెచ్చి ఇచ్చెను. అట్లు తేఁబోవు సమయమున గరుడుఁడు తనకు లావుగలుగ తగిన ఆహారమును ఉపదేశింపుము అని తల్లిని వేఁడి ఆమె సముద్ర మధ్యమునను ఉండి అప్పుడప్పుడు ప్రజలకు అపకారము చేయుచు ఉండెడు పుళిందులను భక్షింపుము అని చెప్పఁగా అతఁడు అట్లచేసి అది చాలక మార్గమునందు తండ్రిని చూచి మఱియొక ఆహారముచూపుము అని అడుగఁగా అతఁడు విభావసుఁడు సుప్రతీకుఁడు అను నిద్దఱు అన్నదమ్ములు పితృద్రవ్యమును పంచుకొనుటకై పోరాడి ఒకరిని ఒకరు శపించుకొని ఆఱుయోజనముల పొడవును పన్రెండు యోజనముల నిడుపును కల గజమును, మూఁడుయోజనముల లావును పది యోజనముల మండలమును కలిగిన కచ్ఛపమును అయి ఉన్నారు; వారిని కొని భుజించి పొమ్ము అనెను అంతట ఇతఁడు ఆగజకచ్ఛపములు ఉన్నచోటికి పోయి వాని రెంటిని తన్నుకొనిపోవుచు మార్గమందు ఒక గొప్పవృక్షశాఖయందు నిలువ పోవ అది ఆభారమునకు తాళక విఱిగెను. అప్పుడు వాలఖిల్యమహామునులు ఆశాఖయంధు వ్రేలుచు తపస్సుచేయుచు ఉండిరి. కనుక వారికి విపత్తు కలుగును అను భీతిచే ఆశాఖను క్రింద పడనీయక ముక్కున కఱచి పట్టుకొని తండ్రియొద్దకు పోయెను. అప్పుడు ఆయన ఇతని అభిప్రాయమును ఎఱిఁగి వాలఖిల్యమునులను శాఖయందు ఉండిదిగుఁడు అని ప్రార్థించి వారు విడిచిపోఁగా ఆశాఖను హిమవంతమునొద్ద నిష్పురుషనగమునందు పాఱవైవుము అని గరుడునికి చెప్పెను. గరుత్మంతుఁడు అట్లేచేసి గజకచ్ఛపములను భక్షించి చనియెను. ఇతఁడు పక్షీంద్రుఁడు.

No comments:

Post a Comment