****
దొరస్వామికి ఏదో అయింది.
అతడికి ఆడపిల్ల లాగా పావడ, రవిక తొడుక్కోవాలనిపిస్తోంది.
పూలు పెట్టుకోవాలని కోరికగా వుంది.
పచ్చటి పొలంలో పనిచేసేప్పుడు ఆడపిల్లల్లా ఊహించుకుంటూ పాటల పాడాలనిపిస్తోంది.
ఏడో తరగతిలో చంద్రమతి వేషం వేసినప్పుడు పట్టరాని సంతోషం వేసింది .తాను అబ్బాయి అయినా మగ పిల్లల్ని ప్రేమించాలని ఉబలాటంగా వుంది.
అదొక స్వభావం!
మగ, ఆడ పిల్లల లాగే ఇలాంటి వాళ్ళూ ప్రకృతిలో వున్నారు.
అక్షరాలా 1, 53, 24 ,000 మంది–
కజకిస్తాన్, ఈక్వెడార్, కంబోడియా దేశాల జనాభా అంత మంది ఈ భూమి మీద వున్నారు !
దొరస్వామి కూడా ఇలాంటి వాడే !
దొరస్వామి అత్యంత సహజంగా రేవతిగా మారాడు.
కానీ ఆ ప్రస్థానం ఎంత దుర్భరమైంది !ఎంత విహ్వలమైంది !ఎన్ని పచ్చి నిజాలు మరెవ్వరికీ తెలియనివీ, తెలిసినా కళ్ళు మూసుకున్నవీ అందులో వున్నాయి!
ఈ కథ సొంత కథ. రేవతి రాసిన “ఉనర్వం ఉరువమం” తమిళ మాతృకను సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి సత్యవతి గారు “ఒక హిజ్రా ఆత్మకథ ” పేరుతో తెలుగులోకి తెచ్చారు.( అనువాదానికి మూలం ఆంగ్లంలోని The truth about me-A Hijra life story ). మంచి పుస్తకాల మాతృసంస్థ “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” దీన్ని ప్రచురించింది.
దొరస్వామికి వచ్చిన మొదటి సమస్య ఇక తాను ఇంటిలో వుండలేకపోవడం. ఈ శారీరక పరిణామాన్ని అంగీకరించి కొడుకుల్లాగా, కూతుళ్ల లాగా తల్లిదండ్రులు ప్రేమగా, పెంచి పోషించే పరిస్థితి లేదు. నిత్యం ఘర్షణ, తన్నులు, అవమానాలు, గెంటివేతలు! మరోవైపు వుండవట్టనివ్వని శరీరం. వీటి మధ్య రేవతి పడ్డ నరకయాతన మన కడుపు చుమ్మలు చుట్టేస్తుంది. ఇదేమీ కథ కాదు. అమె అనుభవించిన నిజం. పచ్చి నిజం. మన నాగరిక సమాజం దీన్నెందుకు ఒక సంప్రదాయంగా మార్చిందో అర్థం కాక మనసు వికలమవుతుంది.
దొరస్వామి రేవతిగా మారడానికి చాలా తతంగం వుంది. దానికి మొదట తన పురుషాంగ అవశేషాన్ని ఆపరేషన్ చేసుకోవాలి. దీన్ని “నిర్వాణం” అంటారు. ఇందుకోసం ఒక గురువు కావాలి. ఆ గురువుకు కూతురిగా అంటే “చేలా” గా చేరాలి. “పొట్టం” హిజ్రాగా మారడానికి “జమాత్ “సమావేశం కావాలి. ఇది “రేవతి కోసం దీన్ దీన్ ” అని నెమ్మదిగా అనాలి. ఇక అప్పటినుంచి ఈ హిజ్రాకు గురువే సర్వస్వం. ఆ గురువు బంధువులే, శిష్యులే తన బంధుగణం. తర్వాత అన్ని గురువే చూసుకోవాలి. ఆ గురువుకు బిక్షమెత్తి, సెక్స్ వర్క్ చేసి కానుకలు ఇవ్వాలి.
హిజ్రాలు ఏర్పరచుకున్న సొంత సంస్థ ఇది. జమాత్ హిజ్రాల మంచి చెడ్డలు చూచే వ్యవస్థ. దీని పరివార్ లో ఎక్కడెక్కడి వారూ ఇమిడిపోతారు. ఆ పరివార్ లకు తెగలు వుంటాయి. కాకుంటే అందులో కులాలు వుండవు.. (హమ్మాయ్య! వీళ్ళకైనా కులాల బెడద తప్పింది ఈ పుణ్యభూమిలో!) ఇదంతా చదివినప్పుడు మనకు తెలియని సంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవస్థలు ఇన్ని వున్నాయా అనిపిస్తుంది. హిజ్రాలు ఎంతటి చట్రంలో ఇరుక్కుపోయారా అని ఆశ్చర్యం వేస్తుంది.
శ్రీరాముడు వనవాసాంతరం వీరికి “మీ పలుకు ఎప్పుడూ సత్యమగు గాక” అని వరమిచ్చాడట. హిందీ దేశం వీరిని గౌరవిస్తుందట. పెళ్లికి, ప్రసవాలకు పిలిచి సత్కరిస్తారట. హిజ్రాలు పిల్లల్ని దీవిస్తారట. వరమో శాపమో. గాని ఇదే బాగున్నట్టుంది ! అలా వీళ్ళ జీవితం గడిచినా గౌరవప్రదంగానే వుండేది. కానీ ఏం చేద్దాం అంతటి రాముడి వరమూ హిజ్రాల విషయంలో ఇలా తెల్లారింది .
మహాభారత యుద్ధం మొదలైనప్పుడు ఒక నరుడిని బలి ఇవ్వాల్సి వచ్చిందట. కృష్ణుడు, అర్జునుడు తప్ప అలాంటి వీరుడు ఎవరూ లేకపోతే అర్జునుడికి నాగ కన్యకు పుట్టిన “అరవాన్” దీనికి సరిపోతాడని తీసుకొచ్చారట. బలికి ముందు అరవాన్ తనకు దాంపత్య సుఖం కావాలని పట్టుబట్టాడట. అప్పుడు కృష్ణుడు పెళ్లికూతురై అతన్ని పెళ్లాడట. అరవాన్ చనిపోగానే కృష్ణుడు విధవగా మారి పోయాడట. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవగంలో చైత్ర పూర్ణిమ రోజు అరవాన్ ఉత్సవం జరుగుతుంది. అక్కడికి వేల మంది హిజ్రాలు చేరుతారు. పట్టుచీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని, తాళిబొట్లు ధరించుకొని పండగ చేసుకుంటారు. అరవాన్ బలిపీఠం ఎక్కగానే తాలిబొట్లు తెంచేసి, పూలు విసిరేసి వితంతువుల్లా మారి హృదవిదారకంగా ఏడుస్తారు. అందుకే తమిళంలో హిజ్రాల్ని “అరవాణి” అని పిలుస్తారు. అంటే హిజ్రాలకూ ఒక పురాణం వుంది. ఒక దేవుడున్నాడు. ఒక వారసత్వం వుంది. పాపం ఇవన్నీ ఎన్ని వున్నా వాళ్లకు మిగిలింది మాత్రం కన్నీళ్ళు, కష్టాలు తప్ప ఏమీ లేదు.
రేవతి కథ నిండా అవమానాలూ, వేధింపులూ, ఎవరూ తనకంటూ లేరనే ఒంటరితనం, పూట గడవడం కోసం ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం ఒకవైపు కనిపిస్తే ; సమాజంలోని ప్రతి వ్యవస్థ హిజ్రాల పట్ల ఎందుకు అంత క్రూరంగా నీచంగా వ్యవహరిస్తోందన్న ఆవేదన మరొకవైపు కనిపిస్తాయి. వాళ్ల తల్లిదండ్రులే కావచ్చు. పోలీసులే కావచ్చు. విటులే కావచ్చు. సంస్కర్తలే కావచ్చు. తోటి మహిళలే కావచ్చు. నమ్ముకున్న గురువులే కావచ్చు. ఎవరి నుంచి చూచినా, ఏ వైపు నుంచి చూచినా ఒక్కింత సానుభూతీ దొరకని సమాజంలో వీరుండడం హృదయ విదారకమే కాదు, ఏవగింపు కలిగించే అంశం. ఈ ఏవగింపు క్రోధంగా, తిరుగుబాటుగా ఎప్పుడు మారుతుందో మరి! వీళ్ళ కోసం ఏ బుద్ధుడో, ఏ ఏసుక్రీస్తో ఎప్పుడు పుడతారో మరి!
అన్నిటికంటే ముఖ్యమైన కోణం ఒక స్త్రీగా తనకు గుర్తింపు కోసం, గౌరవం కోసం, తోడు కోసం, శారీరక తృప్తి కోసం రేవతి పడే ఆవేదన, అడుగడుగునా చేసే పోరాటం. ఇవన్నీ ఫలించి ఒక తోడు దొరికిందంటే అతడు కూడా పక్కలో పామని తెలిసి రావడం రేవతి జీవితంలో తిరిగిరాని మలుపు! వయసు మీద పడ్డాక మళ్ళీ పాతవృత్తిలోకి పోలేక, అమ్మని వదులుకోలేక, తనకంటూ ఏమీ మిగుల్చుకోక దారీ తన్నూ లేని దశలోనే ఈ ఆత్మకథ ముగిసిపోవడం మనసును మెలిపెట్టేస్తుంది. భారంగా ముగించాక రోజుల తరబడి వెంటాడే పుస్తకమిది!
దీన్ని వీలున్నంతమంది చేత చదివించాలి. కొని చదివించాలి. చర్చించాలి. కనీసం మనకు తెలియని విషాదాలు మన చుట్టూ వున్నాయన్న స్పృహనైనా మనలో ఎంత మందికి పెంచగల్గితే అంత పెంచాలి.
రేవతి మన తెలుగు అమ్మాయే అనిపించేలా సత్యవతి గారు చేసిన అనువాదం అనువాదకులందరికీ అనుసరణీయం, ఆదర్శం!
- విఠపు బాల సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment