*ఈరోజు పురాణ కథ యయాతి గురించి:*
నహుషునికిని ప్రియంవదకును పుట్టిన ఏవురు కొడుకులలో ఒక్కఁడు. నహుషునికి అనంతరము ఇతఁడు మహాఖ్యాతితో రాజ్యము ఏలెను. ఇతఁడు శుక్రాచార్యుల కొమార్త అయిన దేవయానను పెండ్లియాడి ఆమెయందు యదువు, తుర్వసువు అను ఇరువురు కొడుకులను, వృషపర్వుని కూఁతురును దేవయాన చెలికత్తెయును అగు శర్మిష్ఠయందు ద్రుహ్యుఁడు, అనువు, పూరుఁడు అనుమువ్వురు కొడుకులను కనియెను. మఱియు ఇతని వివాహకాలమున శుక్రుఁడు 'దేవయానవలెనే సర్వవిషయములయందును శర్మిష్ఠను చూచుకొనుము శయనవిషయమున మాత్రము శర్మిష్ఠను పరిహరింపుము' అని నియమించెను. అందులకు ఇతఁడు ఒప్పుకొని ఉండియు ఆనియతి తప్పెను కనుక శుక్రుఁడు కోపించి 'నీవు యౌవనగర్వముచే నాకొమార్తను అవమానించితివి కావున ముసలివాఁడవు అగుము' అని శపింపఁగా అతఁడు 'ఇంకను కొన్నిదినములు దేవయానతోడి విషయభోగములను అనుభవింప వలయును అను కోరిక ఉన్నది, మరల యౌవనము కలుగునట్లు అనుగ్రహింపుము' అని వేఁడఁగా 'నీ కొడుకులలో ఒకనియందు నీముదిమిని ఉంచి వానియౌవనము కొని విషయసుఖములు అనుభవించి నీముదిమి తీసికొన్న కొడుకునను నీరాజ్యము ఒసఁగుము' అని ఆనతిచ్చెను. అట్లు శుక్రశాపముచేత ముసలితనమును పొంది తనకు ముసలితనము వచ్చిన విధమును తనకు కల విషయాభిలాషయు తన కొడుకులకు తెలియచేసి నాముదిమిని కైకొనుము అని కొడుకులను అడిగెను. అందులకు పెద్దకొడుకులు నలువురును సమ్మతింపక పోయిరి. కడపటి వాఁడు అయిన పూరుఁడు మాత్రము సమ్మతించెను. అంతట యయాతి వానివలన యౌవనమును కొని తన మాట వినని కొమాళ్లను రాజ్యార్హులు కాకుండునట్లు శపియించి విషయానుభవమువలన తృప్తిపొంది పూరుని యౌవనమును వానికి ఇచ్చి తన ముదిమి తాను కైకొని వానిని రాజ్యాభిషిక్తుని చేసి తపస్సుచేయ పోయెను. ఇట్లు యయాతి శాపముచే యాదవులు రాజ్యమునకు అనర్హులు అయిరి. అనంతరము ఇతఁడు అతిఘోరము అగు తపముచేసి ఆమాహాత్మ్యము వలన బ్రహ్మలోకము మొదలుగాఁగల దేవలోకములు అన్ని తిరిగి కడపట ఇంద్రలోకమునకు పోయి ఇంద్రునితో తన తపోమాహాత్మ్యమును పొగుడుకొనెను. అందులకు ఇంద్రుఁడు సహింపక ఆత్మస్తుతి చేసికొనువారు ఈలోకమున ఉండను అర్హులు కారు అని అతనిని అధోలోకమున పడత్రోసెను. అంత యయాతి ఖిన్నుఁడు అయి ఇంతకాలము తపముచేసి ఈలోకమునకు వచ్చి మరల భూలోకమునకు పోను ఓపను. నన్ను మన్నించి అంతరిక్షమున సద్భువనమున (నక్షత్రలోకమున) ఉండునట్లు అనుగ్రహింపుము అని వేఁడఁగా అతఁడు అట్లె అనుగ్రహించెను. అట్లే ఇతఁడు నివసించెను.
ఈయయాతి కొడుకులలో జ్యేష్ఠుఁడు అగు యదువునుండి యాదవ వంశము కలిగెను. రెండవ కొడుకు అగు తుర్వసువునుండి పాండ్య చోళ కేరళ వంశములు కలిగెను. మూడవ కొడుకు అగు ద్రుహ్యునినుండి గాంధారవంశము కలిగెను. నాలవ కొడుకు అగు అణువువంశస్థుఁడు అయిన ఉశీనరుని కొడుకు అగు శిబికి సౌవీర మద్ర కేకయ అంబష్ఠ దేశాధిపతులు పుట్టిరి. ఆ ఉశీనరుని తమ్ముని వంశస్థుఁడు అగు బలికి అంగ వంగ కళింగ పౌండ్ర దేశాధిపతులు పుట్టిరి. అయిదవ కొడుకు అగు పూరువు నుండి బార్హదిష పాంచాల కౌరవ రాజవంశములును, కాణ్వాయ గార్గ్యాది బ్రాహ్మణ వంశములును కలిగెను. అందు కురువంశస్థుఁడు అగు ఉపరిచర వసువునుండి మగధవంశము ఉత్పన్నము ఆయెను.
No comments:
Post a Comment