☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
119. సానో భూమిర్గోష్వప్యన్నే దధాతు
భూదేవి మా గోవులయందు, అన్నమునందు సమృద్ధిగా అనుగ్రహించు గాక (అథర్వవేదం)
వేదవారసత్వంలో మహర్షుల తపోదృష్టి సంస్కార సంపన్నమైన విజ్ఞానాన్ని ఆవిష్కరించింది. అందులో మనకు ఆధారమైన భూమి ఎన్ని విధాల మనకు పోషకమౌతుందో అద్భుతంగా కీర్తించారు. విశ్వాధారమైన ఈశ్వరశక్తి ఒక తల్లి
శిశువును కాపాడినట్లుగా మనల్ని పోషిస్తోంది. అందుకే ఆ శక్తిని 'జగన్మాత' అని సంభావించి, ఆ మాతృత్వం భూమి ద్వారా మనకి లభిస్తున్న సత్యాన్ని గుర్తించి,
ఆరాధించి ఆనందంగా జీవించమని మనలను ప్రబోధించారు.
“సానో భూమిర్విసృజతాం మాతా పుత్రాయ మే పయః" అని పృథ్వీసూక్తంలోని మంత్రవాక్యం. 'పుత్రుడైన నాకు క్షీరా(పోషకమైన ఆహారం)న్ని భూమాత అందించు గాక!'
విశ్వమయుడైన విశ్వపతి విష్ణువు పత్ని(విడదీయలేని శక్తి)గా, భూలక్ష్మిగా ఈ పృథ్విని గౌరవించిన కారణంగా భూమియందున్న వివిధ సంపదలను లక్ష్మీ రూపాలుగా దర్శించే వైదిక సంస్కారం మనకు పరంపరగా ప్రాప్తించింది.
ఒకచోట మహోన్నత పర్వతాలు, మరొక చోట జలప్రవాహాలు, ఇంకొక తావున సారవంతమైన సస్యశామలక్షేత్రాలు, వేరొక స్థలాన కేవల శిలాభూములు, ఒకచోట
పంటలనిస్తోంది. మరొక చోట రత్నాలనందిస్తోంది. అన్యత్ర ఇంధనాలను సమకూర్చుతోంది.
ఇందులో ఒక చోట దొరికేదానిని గ్రహించి, మరొక చోట అది లేని వారితో పంచుకొని, వారి నుండి మనకు లేనిదానిని పొందడం... అనే పరస్పర స్నేహపూర్వక సమన్వయం ద్వారా, ఒకే భూమాత వాత్సల్యాన్ని మనందరం అనుభవించవచ్చు.
ఈ విధమైన దృష్టితోనే 'జననీ పృథివీ కామదుఘాస్తే' అన్నారు కంచి మహాస్వామి శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్రసరస్వతీస్వామివారు. పుడమితల్లి మనకు కామధేనువు. కనిపించే ఈ భూమాత కనిపించని ఒక సమస్త విశ్వసంచాలకునిచే ధరింపబడి ఉంది. అతడే
యజ్ఞస్వరూపుడైన నారాయణుడు. ఆయన కృపయే భూరూపంలో మనల్ని అనుహ్రిస్తోంది. అందుకే భూరూపంలోనున్న పరమేశ్వర కృపను 'శర్వాయ క్షితిమూర్తయే
నమః' అంటూ, ఆ సదాశివుని అష్టమూర్తులలో ఒకటిగా భూమిని వర్ణించారు.
కామదుఘా, పయస్వతి, సురభి, ధేనుః, వసుంధరా వంటి అనేక నామాలు వేద వాఙ్మయంలో భూమికి చెప్పబడ్డాయి. ఆ నామాలలో భూదేవిలోని వివిధ శక్తులను
గుర్తించవచ్చు.
భూమికి, గోవులకూ ఉన్న అనుబంధాన్ని వేదసంస్కృతి ప్రస్ఫుటంగా వర్ణించింది.
పురాణాల్లో కూడా భూమి గోరూపం ధరించి పృథుచక్రవర్తికి కనబడినట్లుగా
వర్ణించారు. అలాగే దుష్టుల భారాన్ని భరించలేని భూమి తనను కాపాడమని పరమాత్మతో వేడుకోవడానికి గోరూపం ధరించినట్లుగా పురాణాలు వర్ణించాయి.పరీక్షిన్మహారాజుకి కూడా భూమి గోరూపంలోనే సాక్షాత్కరించింది. అందుకే గోవుల
క్షేమం భూమికి క్షేమం.
గోవులు అనే మాటకి ఇంద్రియాలు, కిరణాలు, వేదవాక్యాలు అనే వైదికార్థాలను కూడా గ్రహిస్తే, భూమి ద్వారా ఇవన్నీ సమృద్ధిని పొందుతాయి... అనే భావాన్ని
స్వీకరించవచ్చు. మానవులు మాత్రమే కాక దేవతలు, ఋషులు, ఇతర విశ్వశక్తులు కూడా యజ్ఞమయి అయిన భూమి నుండే సమస్తపుష్టినీ పొందుతున్నట్లుగా వేదపురాణాలు విశదపరచాయి. మన ప్రాచీనుల దృష్టిలో విశ్వక్షేమానికి కేంద్రం
భూమియే.
ఈ భూమికి సద్ధర్మమే రక్ష. దాని వల్లనే భూమి సంపదలని ఇవ్వగలిగే సామర్థ్యాన్ని పొందుతుంది. ధర్మహీనత వల్ల భూరూప గోవు వట్టిపోతుంది. అందుకే ధర్మరక్షణతో
భూమిని రక్షించుకుందామని వేదవాక్కుల ప్రమాణంతో ఉద్యమిద్దాము.
No comments:
Post a Comment