Thursday, February 27, 2025

 మనస్సులో మాలిన్య దోషాలు, దేహాది అహంకారము పోతే చిత్త శుద్ధి కలుగుతుంది. అప్పుడు సాధనలో పురోగతి లభిస్తుంది. 

విహిత కర్మలను, అంటే, చెయ్యవలసిన పనులను కర్తవ్యతా బుద్ధితో చెయ్యడమే కర్మయోగమంటే. 

మనస్సు అంతర్ముఖమై, పరమాత్మ ఆశ్రయమైనపుడు, ఇంద్రియాల చేత చెయ్యబడే పనులవల్ల ; మనోవృత్తులు ఉదయించవు♪ గనుక, కామ వాసనలూ ఉండవు. కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది. 

అట్టి మనోవృత్తులు ఉదయించని స్థితినే ఆకర్మము అని అంటారు. 

అందుకే కర్మకు ఫలము కూడ ఉండదు♪. సంకల్పంతో కలసి అంతః కరణంలోవృత్తులు జనించినపుడే ఆ కర్మ బంధకారణం అవుతుంది.*

*కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ సంబంధమైన పనులన్నీ శరీరంతో చేయబడుతున్నాయి. 

ఈ పనులలో ఆసక్తి లేకుండా గనుక చెయ్యగల్గితే, అవి కర్మఫలాలను కలిగించ లేవు. 

అట్టివాడే అన్ని శాస్త్రముల యందూ అధికారి. జ్ఞానికి ఫలాపేక్ష, దేహేంద్రియాభిమానము, కర్తృత్వాభిమానమూ లేకుడటం వల్ల కర్మలు చేసినా ; కొంచెమైనా కర్మము చెయ్యని వాడే. 

అట్టి వాడు లోకసంగ్రహార్ధం/ శరీర యాత్రకోసం కర్మలను చేసినా దోషం లేదు. 

సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం వల్ల దోషముండదు. 

జ్ఞాన సిద్ధికి కర్మమార్గము సాధనమని చెప్పబడింది. నిష్కామ కర్మయోగంతో కూడిన విహిత కర్మలను చెయ్యటం అందరికి యోగ్యమే♪.*

*కర్మయోగి ఏ సిద్ధాంతాన్నీ నమ్మనక్కర లేదు. 

స్వార్ధ రాహిత్యాన్ని మాత్రం కర్మాచరణ ద్వారా స్వయంగా సాధించాలి. 

అహంకారం వదులుకొన్నపుడే నిష్కామ కర్మాచరణం సాధ్యం♪. 

నేను, నా వారు అనే భావం లేకుండా ఉండాలి. 

అహంకారంతో చేసే పనులు ప్రవృత్తి. 

అహంకార మమకారాలను వదలి చేసే పనులు నివృత్తి ; 

ఈ పనులకు కర్మత్వం ఉండదు.*
*ప్రవృత్తి వల్ల సంసారము, నివృత్తి వల్ల మోక్షమూ లభిస్తాయి.*

*తామరాకుపై నీటిబిందువు నిలిచి ఉన్నా అది తామరాకును అంటనట్లు ; కర్మయోగి ఎట్టి పనిచేసినా ఏ కర్మనూ చెయ్యనివాడే. 

కోరికలను జయించక సన్యసించినవాడు ఏకాంతవాసములో ఉండి ఏకర్మనూ చెయ్యకున్నా, సమస్త కర్మలూ చేసిన వాడే అవుతున్నాడు. 

కర్మయోగులకూ, కోర్కెలు లేని వారికీ భగవదనుగ్రహం వల్ల హృదయ గ్రంధి క్షీణించి అహంకార మమకారాలు నశిస్తాయి. 

జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల తత్త్వ జ్ఞానము, తత్త్వజ్ఞానం వల్ల ముక్తీ కలుగుతాయి.*

🦢🪷🦢🪷🦢🪷🦢

No comments:

Post a Comment