Monday, February 24, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


118. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః

గొప్పవాడు అనిపించుకున్నవాడు ఏది చేస్తే ఇతరులూ దానినే అనుకరిస్తారు
(భగవద్గీత)

ఎంత గొప్పవారైనా ఎవరి మర్యాద వారు పాటించక తప్పదు. లోక మర్యాదలను అనుసరించడం అనివార్యం. అవతార పురుషులైనప్పటికీ ఏ ఉపాధిని స్వీకరించారో ఆ ధర్మాన్ని అనుసరించవలసిందే! అందునా గొప్పవారనిపించుకున్నవారు మరింత
శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించాలి. ఎందుచేతనంటే తనను గమనిస్తూ ఆదర్శంగా అనుసరించడానికి చాలామంది ఉంటారు. అందుకే తనకు అవసరం లేకపోయినా
తాను ఆచరించాలి.

శ్రీకృష్ణపరమాత్మ, శ్రీరాముడు కర్మజన్మలను దాల్చలేదు. లీలా జన్మలను ధరించిన అవతారమూర్తులు. అయినా సత్కర్మాచరణను విడిచిపెట్టలేదు. వారి పితృభక్తి, గురుభక్తి,
లోకమర్యాదాపాలన అంతా అపూర్వ ఆదర్శం.

జగద్గురువులైనా గురువుల వద్ద వినయంగా శిక్షణ పొందారు. లోక పాలకులైనా ధర్మాన్ని ఏమరలేదు. గుర్రాలను తోలే(సారథ్యం) పనిని చేపట్టాక రథాలను శుభ్రపరచడం, అశ్వాల బాగోగులను చూసుకోవడం ఏమరలేదు జగదీశుడు.
ఎందుచేత?

“గొప్పవాడు అనిపించుకున్నవాడు ఏది చేస్తే ఇతరులూ దానినే అనుకరిస్తారు.అందుకే అనుక్షణం అప్రమత్తత అవసరం" అని బోధించి, ఆచరించాడు గీతాచార్యుడు.

ఒకసారి బలరాముడు తీర్థయాత్ర చేస్తూ నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ
సూతమహర్షి శౌనకాదులకు పురాణ కథలు వినిపిస్తున్నాడు. ఆ సమయంలో ప్రవేశించిన బలరాముని చూసి శౌనకాది మహర్షులు లేచి నమస్కరించి, ఉచితాసనాన్ని
ఇచ్చారు. "మహాత్మా! నారాయణాంశ సంభూతులైన మీరు రావడంచేత మేము ధన్యులం” - అని కీర్తించారు శౌనకాదులు.

తనను సత్కరించి కీర్తించే మహర్షుల స్తోత్రాలకు ఉబ్బిపోయి అహంకరించిన బలరాముడు, తనను చూసి సమస్కరించకుండా కూర్చున్న సూతుని గమనించాడు.తనను అవమానించినట్లుగా భావించాడు. కీర్తిస్తున్న వారికి తన ప్రతాపం
ప్రకటించాలనుకున్నాడు.

"ఈ సూతుడు అల్పజన్ముడు. వ్యాసుని వల్ల విద్యలు నేర్చుకుని పౌరాణికుడయ్యాడు.
ఈ అహంకారిని శిక్షించాలి" - అని సంకల్పించుకుని ఒక దర్భను అభిమంత్రించి సూతునిపై ప్రయోగించాడు. సూతుడు మరణించాడు. సగర్వంగా చూశాడు బలభద్రుడు.శౌనకాదులు హాహాకారాలతో బలరాముని దూరం వెళ్ళమని గర్జించారు. "నువ్వు
పాపాత్ముడవు. బ్రహ్మహత్య చేశావు. నీలాంటివాడు ఈ ప్రాంతంలో ఉంటే
దేవతాశక్తులు రావు. దయచేసి ఈ ప్రాంతాన్ని వదలి వెళ్ళు" - అని ఏవగించుకున్నారు.

ఆశ్చర్యచకితుడైన బలరాముడు - “మహాత్ములారా! నన్ను దైవాంశసంభూతునిగా
కీర్తించిన మీరు ఇలా నిందించడం ఆశ్చర్యంగా ఉంది" అని వినయంగా అడిగాడు.

"బలరామా! ఎంత దైవాంశసంభూతుడైనా ధర్మభ్రష్టుడు శిక్షార్హుడే. సూత పౌరాణికులు దివ్య విషయాలను బోధిస్తున్న గురుస్థానంలో ఆసీనులై ఉన్నారు.
వ్యాసపీఠాన ఉపవిష్ణులై ఉన్నారు. ఆ ఆసనంపై ఉన్నవారు ఎవరు సభలో ప్రవేశించినా లేచి నిల్చోరాదు. అలా చేస్తే వ్యాసుని అవమానించినట్లే. అందుకే సూతులు నీవు వచ్చినా లేచి నమస్కరించలేదు. తన ధర్మాన్ని తాను పాటించారు. నీవు అది గ్రహించక నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా ఆయనను వధించావు. ఈ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం
చేసి తీర్థస్నానాలు చేసి రావాలి" అని నిర్దేశించారు మహర్షులు.

తన యోగశక్తితో సూతుని తిరిగి బ్రతికించి, క్షమించమని వేడుకొని, ధర్మశాస్త్ర ప్రకారం తీర్ధసేవనం చేసి పాపాన్ని బాపుకొన్నాడు బలరాముడు.

ఈ కథను గమనిస్తే - ఎంతటి గొప్పవాడైనా తన హోదానీ, పదవినీ, ప్రతిభనీ అడ్డం పెట్టుకుని పాపానికి ఒడిగడితే క్షమార్హుడు కాడు అని తెలుస్తుంది. ధర్మ విషయంలో మొహమాటం లేని మేధావి వర్గం నిలదీసినప్పుడు, ఎంత పెద్దలైనా
హద్దుల్ని అతిక్రమించరు.  

No comments:

Post a Comment