Vedantha panchadasi:
యావత్స్వదేహదాహం స నరత్వం నైవ ముఞ్చతి ౹
యావదారబ్ధదేహం స్యాన్నాభాసత్వ విమోచనమ్
౹౹243౹౹
రజ్జు జ్ఞానేఽ పి కంపాది శనై రేవోపశామ్యతి ౹
పునర్మన్దాంధకారే సా రజ్జుః క్షిప్తోరగీ భవేత్
౹౹244౹౹
ఏవమారబ్ధ భోగోఽ పి శనైః శామ్యతి నో హఠాత్ ౹
భోగకాలే కదాచిత్తు మర్తోహమితి భాసతే
౹౹245౹౹
ప్రారబ్ధమైన దేహమున్నంత కాలము చిదాభాసత్వము వదలదు.కానీ హఠాత్తుగ కాక నిదానముగనే ఉపశమించును.
వ్యాఖ్య:- తత్త్వవేత్తల్లో
అసలు జీవభావం
ఎందుకుంటుంది? అంటే -
ప్రారబ్ధకర్మ క్షయం అయ్యేంతవరకు జీవభావం వుంటుంది.అందుకు దృష్టాంతం -
అగ్నిప్రవేశం చేసిన వ్యక్తికి తన దేహము సంపూర్ణంగా దహింపబడు వరకు దేవత్వబోధ కలుగక నరత్వబోధయే ఉండునట్లు అంటే ,
శరీరం కాలిపోయేదాకా తగులబడటం వల్ల శరీరానికుండే బాధను వదలలేడు - మనుష్య వ్యవహారం పోదు.
ప్రారబ్ధమైన ఖర్మ ఫలంగా లభించినట్టి ఈ దేహము ఉన్నంతకాలము చిదాభాసత్వము వదలదు.
ఈ దేహము ఉన్నంత వరకు జీవభావ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది.
భ్రమకు ఉపాదానమైన అజ్ఞాన నివారణం జరిగినప్పటికి,
నేను మనుష్యుణ్ణి అనే విపరీత ప్రతీతి వుంటోంది.అది ఎందుకు వదలటం లేదు ?
అందుకు దృష్టాంతం -
పాము అను భ్రాంతి వలన కలిగిన శరీరకంపము,చెమటలు
రజ్జు జ్ఞానము కలిగివున్నా నిదానముగనే తగ్గును.
"ఇది పాము"అనే మిథ్యాజ్ఞానం పోయి "ఇది తాడు"అనే యదార్థ జ్ఞానం కలిగినప్పటికి పాముగ భ్రమించినందువల్ల కలిగిన భయకంపాదులు వెంటనే తొలగిపోవు. మెల్లమెల్లగా తొలగుతాయి. మళ్ళీ మసకచీకటిలో
ఆ త్రాడే పాముగా
అవుతోంది - భ్రమకు కారణమౌతోందన్నమాట,మళ్ళీ పాముగా కన్పింపవచ్చు.
ఈ దృష్టాంతాన్ని దాష్టాంతికంతో అన్వయిద్ధాం -
అట్లే ప్రారబ్ధ కర్మఫల భోగం కూడా హఠాత్తుగ కాక మెల్లమెల్లగా - నిదానముగనే ఉపశమించడం జరుగుతుంది.
ఒక్కసారిగా జరగదు.
ఒక్కొక్కప్పుడు
ఆ భోగకాలంలో
"నేను మానవుడిని"-"మార్త్యుడను"
అనే ప్రతీతి మధ్యమధ్య కలగవచ్చు.
జ్ఞానోదయం అయినపిమ్మట కూడా బుద్ధివృత్తులు ఉదయిస్తాయని అనటం తత్త్వజ్ఞానానికి బాధకమౌతుంది గదా !
నైతావతాపరాధేన తత్త్వజ్ఞానం వినశ్యతి ౹
జీవన్ముక్తి వ్రతం నేదం కిన్తు వస్తుస్థితిః ఖలు
౹౹246౹౹
దశమోఽ పి శిరస్తాడం రుదన్ బుద్ధ్యా న రోదితి ౹
శిరోవ్రణస్తు మాసేన శనైః శామ్యతి నో తదా
౹౹247౹౹
దశమామృతి లాభేన జాతో హర్షో వ్రణవ్యథామ్ ౹
తిరోధత్తే ముక్తిలాభస్తథా ప్రారబ్ధ దుఃఖితామ్
౹౹248౹౹
ఎప్పుడో ఒకప్పుడు మర్త్యత్వ బుద్ధి ఉదయించినా తత్త్వజ్ఞానోదయానికి అది బాధకం కాదు.ఐతే లోగడ భ్రమతో బాదుకొన్నందువల్ల తగిలిన దెబ్బలు వ్రణాలు తగ్గడానికి కొంత కాలం పడుతుంది.
వ్యాఖ్య :- జ్ఞానోదయం అయిన పిమ్మట కూడా బుద్దివృత్తులు ఉదయిస్తాయా ?
తత్త్వజ్ఞానికి
ఎప్పుడో ఒకప్పుడు
"నేను మానవుణ్ణి"
అనే ప్రతీతి కలిగినంత మాత్రంచేత,
ఆగమశాస్త్ర ప్రమాణాలవల్ల కలిగిన బ్రహ్మజ్ఞానము అంతమాత్రపు అపరాధము వలన తత్త్వజ్ఞానము,తానే బ్రహ్మమనెడి జ్ఞానము నశింపదు. హాని ఏమీ ఉండదు. ఎందుచేతనంటే -
ఈ మర్త్యత్వబుద్ధిని పోగొట్టే జీవన్ముక్తి అనేది ఒక వ్రతంలాగా నియమంగా అనుష్ఠింపబడేది కాదు. జీవన్ముక్తి మౌనాదుల వలె వ్రతము కాదు గదా,
భంగము కలిగినంతనే నష్టమగుటకు ,
వస్తుస్థితియే అది. సమ్యగ్విచారణవల్ల కలిగే జ్ఞానం,
భ్రమ జ్ఞానాన్ని నివృత్తి చేసేది మాత్రమే !
అందుచేత ఎప్పుడో ఒకప్పుడు మర్త్యత్వ బుద్ధి ఉదయించినా తత్త్వజ్ఞానోదయానికి అది భాధకం కాదు - హానికలిగించేది కాదు.
ముండకోపనిషత్తు 2.2.8 నందు , బ్రహ్మసాక్షాత్కారమైనంతనే సర్వ కర్మలు క్షయించునని చెప్పును.ఇది ఔపచారికమని గ్రహింపవలెను.ఏలన
ఆగామి,సంచిత కర్మల వలె ప్రారబ్ధము కూడా నశించినచో ఇక శరీరము నిలువదు. జీవన్ముక్తి అసంభవమగును.
జ్ఞానికి తన శరీరమునందు ఇదినాది అనే భావము లేకపోవుటచే అది,అతనికి సంబంధించినంత వరకు మరణించినట్లే.
బృహదారణ్యకోపనిషత్తు జ్ఞానియొక్క శరీరమును పాము కుబుసముతో పోల్చును.
శ్రీ శంకరభగవత్పాదులు ఛాందోగ్యపనిషత్తు 6.14.2 ను వ్యాఖ్యానించుచు బాణముల ఉపమానము చెప్పిరి.
మనము వదిలిన బాణముపై మనకు సంపూర్ణాధికారము లేదు.కానీ,
ఎక్కుపెట్టిన బాణముపై మరియు పొదిలోని బాణముపై మనకు సంపూర్ణాధికారము కలదు.
అట్లే జ్ఞానియొక్క ప్రారబ్ధము వదిలిన బాణమువలె లోక సంగ్రహార్థము పనిచేయును. దాని వలన పుణ్యపాపములు జ్ఞానినంటవు.
మోక్షప్రయత్నము జీవించి ఉన్నపుడే జరుగును.
మరణించిన పిదప సంపాదింప గలుగు విశేష సామర్థ్యమేమీ లేదు.కనుక జీవించి ఉండగనే ముక్తి కలుగుట యుక్తి సమ్మతము.
ఉపనిషత్తులు - కఠ 2.3, 6.4;
కేన 2.5 ; ఛాందోగ్య 6.14.2 ;
బృహదారణ్యక 4.4.6 -8 ;
1.4.10 ; మాండూక్య 2 ;
ఛాందోగ్య 6.8.7
భగవద్గీత 5.19,23,26
మహావాక్యములు కూడా జీవన్ముక్తి సిద్ధాంతమునే బలపరచును.
రజ్జువు అని తెలిసినా - మిథ్యాజ్ఞానం పోయినా కంపనాదులు అనువృత్తి
(మళ్ళీమళ్ళీ కలగడం) ఉంటోంది గదా !
"నేను పదవవాడను" అని తెలిసిన మీదట - భ్రమ నివృత్తి అయినమీదట మళ్ళీ
కార్యం అనువృత్తం అవటం కనిపించలేదేమి ? అంటే -
"దశమోఽస్మి" - నేనే పదవవాడను చావలేదు అని ఆప్తపురుషుని చేత చెప్పబడిన మీదట తెలుసుకొని
ఏడవటం,నెత్తిబాదుకోవటం మానివేస్తాడు.
ఆ భ్రమ నివృత్తి కాగానే నేత్తి బాదుకుంటూ ఏడవటం తగ్గుతుంది.కానీ ,
అట్లా లోగడ బాదుకొన్నందు వల్ల తగిలిన దెబ్బలబాధ మాత్రం వెంటనే తగ్గదు.
ఆ వ్రణలు తగ్గటానికి కొంతకాలం పడుతుంది.
మరి జ్ఞానం కలిగిన తరువాత కూడా సంసార ఆవృత్తి అంటూ వున్నప్పుడు , జీవన్ముక్తి కోసం ప్రయత్నించటం ఎందుకు ? అంటే -
"దశముడు చనిపోలేదు" అనే జ్ఞానం వ్రణం యొక్క బాధను మరపింప జేస్తుంది. అంటే ,
దశముడు జీవించి యున్నాడు అని గుర్తించుటచే కలిగిన ఆనందము,
గాయముల వలన నొప్పిని తోపనీయదు.అట్లే ,
ముక్తి లాభము - జీవన్ముక్తి లభించటం వల్ల కలిగిన ఆనందము ప్రారబ్ధ దుఃఖమును కప్పివేయును.
జీవన్ముక్తి ,ప్రారబ్ధకర్మల వల్ల కలిగిన దుఃఖాన్ని పోగొడుతుంది.
అందువల్ల జీవన్ముక్తి కోసం ప్రయత్నించాలి.
జీవన్ముక్తిని
వ్రతం లాంటిది కాదు అని ఎందుకు చెప్పారు ?
No comments:
Post a Comment