Friday, February 28, 2025

****2035 . ముచ్చర్ల న్యూరో సిటీ , హైదరాబాద్ ! రాగిణి !

 2035 . ముచ్చర్ల న్యూరో సిటీ ,  హైదరాబాద్ !
  
రాగిణి !

 47 ఏళ్ళ వయసు . 
 క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ లో పని చేస్తోంది . 
నెలకు ఇరవై లక్షల జీతం . 
స్మార్ట్ హోమ్ . 
నాలుగు బెడ్ రూమ్స్ విల్లా.

  ఐఐటీ ముంబై లో చదివినప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండేది . 
సంవత్సరానికి బ్రేక్ అప్ అయ్యింది . 
పురుషాధిక్యతను భరించలేక పోయింది . 
ఇక జీవితం లో ... లివ్ ఇన్...  పెళ్లి లాంటి ... జంజాటాలు వద్దనుకొంది.

 నాన్న నాలుగేళ్ళ క్రితం...  అమ్మ...  మూడేళ్ళ క్రితం పోయారు .
అప్పట్లో ..  పెళ్లి చేసుకోమని  వారు చెబుతుంటే...  చిరాకు పడేది. 
వారి మాటల విలువ ఇప్పుడు   అర్థమవుతోంది . 

"మిడ్ లైఫ్ మేట్స్"  అనే వివాహ సంస్థకు అప్లై చేసింది . 
తనకంటే వయసులో మూడేళ్లు చిన్నవాడు రాకేష్ .
 మొదటి భార్యతో విడాకులు తీసుకొన్నాడు . 

ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు . 
తమకు పొసగదని ఆరునెలల్లోనే ఇద్దరూ గ్రహించి విడాకులు తీసుకొన్నారు .

రాగిణిది...  తిరిగీ...  ఒంటరి జీవితం . 
" ఏ  వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి . ఇరవైలోనే  ముడిపడితే పొందికగా కలిసుంటారు .వయసు  పెరిగే కొద్దీ బంధాలు నిలవడం కష్టం. 
 ఒంటరి జీవితం నరకం "... 
 ఇరవై అయిదేళ్ల  ఏళ్ళ క్రితం అమ్మమ్మ చెప్పిన మాటలు .

 అప్పట్లో...  చాదస్తం అని తాను తీసిపడేసిన మాటలు ..
 ఇప్పుడు పదేపదే గుర్తొస్తున్నాయి .

 తన కంపెనీ లో రోబో బైట్ అనే  పెద్ద కాంటీన్  ఉంది   . 
  రోబో చెఫ్ . రోబో సెర్వింగ్ అసిస్టెంట్స్ .

  బ్రేక్ ఫాస్ట్ మొదలు  రాత్రి  డిన్నర్  దాక .. అన్నీ అక్కడే ఫ్రీ గా దొరుకుతాయి .
ఒక్కో పూట  ఇరవై ముప్పై  ఫుడ్ ఐటమ్స్ బఫెట్ .
 వారం లో ప్రతి రోజు కొత్త మెనూ .  

అయినా తిన బుద్ధి పుట్టదు .
 ఆ ఫుడ్ తిని తిని ..  బోర్ కొట్టేసింది . కాంటీన్ వాసన సోకితేనే వాతొస్తుంది.
  ఫుడ్ డెలివరీ అప్స్ లో ఆర్డర్ ఇస్తే...  అది ఇంకా చెత్తగా ఉంటోంది . 

 ఫాటీ లివర్ వచ్చింది .
"  రిఫైన్డ్ కార్బ్స్, ట్రాన్స్ఫాట్స్ ఎక్కువ తింటున్నారు . షుగర్ ఫ్రీ అడిటివ్స్ ... ఆర్టిఫిషల్ కలర్స్ కూడా ఎక్కువగా తింటున్నట్టున్నారు   . కాన్సర్ కు  అతి దగ్గరలో వున్నారు"  అని  రోబో డాక్టర్...  హెల్త్ చెక్ అప్ లో భాగంగా హెచ్చరించాడు .

తన కంపెనీ కాంటీన్  లో ఆర్గానిక్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది .
 అయినా ఏదీ...  తిన బుద్ధి కాదు . 

ఆ రోజుల్లో అమ్మ చేతి వంట ఎంత బాగుండేదో  . 
 నాన్నమ్మ   వంట నేర్చుకోమని చెబితే తాను పడీపడీ నవ్వేది .  
బామ్మ మాట బంగారు మాట...  అని తనకు ఇప్పుడు అనిపిస్తోంది .

 రాగిణి .. వర్క్ ముగించుకొని రాత్రి పన్నెండుకు పడుకొంది. 
నిద్ర పట్టడం లేదు . 
ఈ మధ్య కాలం లో గట్టిగా మూడు గంటలు నిద్రపోలేక పోతోంది . 
అప్పటికీ ... ఇన్సొమ్నియా మందులు తింటోంది .

 తెల్లవారు జామున మూడు గంటలు .
 బెడ్ పై అటు ... ఇటు దొర్లుతోంది .

 అమ్మ...  నాన్న...  అమ్మమ్మ...  నాన్నమ్మ ... చెప్పిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి . 

నెలకు ఇరవై లక్షల జీతం .
 తిండి సహించదు . 
నిద్ర పట్టదు . 
 ఒళ్ళు రోగాల పుట్ట .
 మెడికల్ ఇన్సూరెన్సు ఉన్నా...  సంపాదనలో సగం ఆసుపత్రులకు పోతోంది .

 ఒంటరి   జీవితం.
 తనదీ ఒక బతుకేనా ? 
ఎందుకు బతుకుతున్నట్టు ?
 ఎవరి కోసం బతుకుతున్నట్టు ? 
ఇంత చదువు చదివి తాను సాధించింది ఏంటి ?

కంపెనీ కూలి .
 కాదు కాదు ..
 కూలి...  పనయ్యాక ఇంటికెళ్లి పోతాడు . 
తానేమో   కంపెనీ కి బానిస .
కంపెనీ కోసం . కంపెనీ  ద్వారా  కంపెనీ చేత .. 
ఇదీ తన బతుకు.

 
   ఏడ్చి ఏడ్చి దిండు తడిచిపోయింది .

తెల్లవారుతోంది . కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ .. ఏడ్చి ఏడ్చి  మొఖం   ఉబ్బి పోయింది .
 కనీసం ఓదార్చేవాళ్ళు లేరు . 
ఇదీ నా బతుకు అనుకొంటూ .. లేచి కూర్చొని ఫోన్ తీసుకొంది.

 రామ్  ఆన్లైన్ లో ఉన్నాడు. 
ఆఫీస్ కొలీగ్ . 
తనదీ ఒంటరి జీవితం . ఇద్దరి మధ్య  అర గంట చాటింగ్ . 
చివర్లో  కొన్ని లింక్స్ పంపాడు . 

రాగిణి వాటి గురించి..  చాట్ బాట్ ద్వారా మరింత సమాచారం పొందింది .

1 . తాయారమ్మ బంగారయ్య ! 

ఇదో ఎమోషనల్ వెల్నెస్ కంపానియన్ కంపెనీ . 
అచ్చ తెలుగులో చెప్పాలంటే..  అద్దెకు ఆమ్మ నాన్న .

గంట సర్వీస్ కు పదివేలు . 
బుక్ చేసుకొంటే అరవై - డెబ్భై లో   ఉన్న ..ఒక జంట .. అంటే తన ఆమ్మ నాన్న బతికుంటే ఎంత వయసులో ఉండేవారో అదే వయసు వారు  ఇంటికి వస్తారు .
 వారిని "అమ్మా" " నాన్న"   అని పిలవొచ్చు .
 మనసు విప్పి మాట్లాడొచ్చు .
 తన బాధల్ని వారు శ్రద్ధగా వింటారు . 
ఓదార్చుతారు .
ఆమ్మ ఒడిలో పడుకొని ఏడవొచ్చు . కన్నీళ్లు తుడుస్తుంది. నాన్న తల నిమురుతాడు . భుజం తడుతాడు.
ఇదీ క్లుప్తంగా తాయారమ్మ బంగారయ్య సర్వీస్ వివరాలు .   
  ఇది ఈ మధ్య బాగా పౌపులర్ అవుతోందని రేట్ కాస్త ఎక్కువగా ఉన్నా మంచి ఫలితం ఉంటుందని రామ్  చెప్పాడు .

రెండో సర్వీస్ .. 
 2 . బొమ్మరిల్లు !

ఇదో లోన్లినెస్ కేఫ్ .
తెలుగులో చెప్పాలి అంటే పూట కూళ్ళ  భోజనం .

 ముందుగా బుక్ చేసుకోవాలి .
 ఆదివారలైతే సంవత్సరం దాక స్లాట్లు బుక్ అయిపోయాయి .
 వారం దినాల్లో అయితే ఇప్పుడు ప్రీమియం రేట్స్ .
 ఒక ఇంటికి...  ఒక రోజుకు ... ఒకరు లేదా ఇద్దరు మాత్రమే .

 పొద్దునే ఇచ్చిన చోటు...  అంటే పెద్ద వారి ఇంటికి  వెళ్ళాలి .
 అక్కడ బామ్మ లాంటి వ్యక్తి  తలంటి స్నానం చేయిస్తుంది .
 తలకు సాంబ్రాణి వేస్తుంది . 
అటు పై నష్టా.. కట్టె పొంగలి.. సాంబారు...  గట్టి చట్నీ . 
టిఫిన్ అయ్యాక కాసేపు కబుర్లు . వైకుంఠ పాళీ .. దాయాలు.. 

  మధ్యాహ్నం ...  రాత్రి అరిటాకు భోజనాలు   . 
ఆమ్మ లాంటి  వ్యక్తి కొసరి కొసరి  కొసరి వడ్డిస్తుంది  . 
అచ్చం ఆమ్మ చేతి వంట .
 అమృతం .  

 రాత్రి ఆరుబయట వెన్నెల్లో డిన్నర్ .డిన్నర్ అయ్యాక కబుర్లు . లాలి పాటలు . 

 ఒక రోజు సర్వీస్  కు కేవలం లక్ష . 
ఆదివారాలు ఇంకా తత్కాల్ బుకింగ్ అయితే రెండు లక్షలు మాత్రమే .

౩, బడి పంతులు !
ఇదో పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కంపెనీ . 
తెలుగులో చెప్పాలంటే  మీ ఇంట్లో మాస్టారు ! 

జనాలు పాసైకియాట్రిస్టు ల తో విసిగిపోయారు . 
ప్రతి చిన్న దానికి గంపెడు మందులు రాసి...  కొండ నాలుకకు మందేస్తే అసలు  నాలుక ఊడినట్టు చేస్తున్నారు . 

అందుకే ఈ కంపెనీ కి బాగా డిమాండ్ పెరిగింది .
 ఒక విధంగా ఇది కూడా తాయారమ్మ బంగారయ్య కంపెనీ లాంటిదే .
 అక్కడ పెద్దలు తన బాధల్ని వింటారు .ఓదార్చుతారు .
 బడిపంతులో కంపెనీ ద్వారా వచ్చిన పెద్ద ... బాధల్ని వినడమే కాకుండా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు చూపుతాడు .

తన సమస్యలకు బడిపంతులు కంపెనీ ద్వారా నే మంచి పరిష్కారం దొరుకుతుందని  రాగిణి .. అప్ ద్వారా బుక్ చేసింది . నెల తరువాత స్లాట్ దొరికింది . 

ఆ రోజు...  ఒకాయన ఇంటికొచ్చాడు .
రాగిణి చెప్పింది శ్రద్ధగా విన్నాడు .

" కిందబోసి .. ఏరుకోవడం...  అని దీన్నే అంటారు . నా లాంటి వాళ్ళు ఆరోజుల్లో వివాహం కుటుంబ వ్యవస్థల గురించి చెబితే పెద్దగా పట్టించుకొనే వారు కారు . 
ఇప్పుడు అనుభవిస్తున్నారు . 
రాగిణీ...  నీ సమస్యలకు ఒకటే పరిష్కారం . నీకు నాలుగు బెడ్ రూమ్స్ విల్లా ఉంది కదా  . ఇందులో నువ్వు  ఒకతే.
 ప్రకటన ఇవ్వు .
 సెంట్రల్ జైలు లో ఏకాంత కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిలా ... ఈ రోజు కోట్లమంది . 
ఇంటర్వ్యూ  చేసి ముగ్గురిని ఎంపిక చేసుకో . 
వారు కూడా నీ వయసు...  నీ మెంటాలిటీ ... ఉన్నవారు కావాలి .
 చెరి ఒక్కరికి ఒక్కో బెడ్ రూమ్ . 

హాల్ ...  కిచెన్...  అందరికీ  కామన్ . 

కలిసి వంట చెయ్యండి .
 నీ కంపెనీ వాడు ఫుడ్ ఫ్రీ గా పెట్టి నిన్ను కట్టుబానిస చేసాడు .
 ఫుడ్ ఫ్రీ గా వస్తుందని నువ్వు పొద్దునుంచి రాత్రి దాక అక్కడే ఉంటున్నావు . 

ఇల్లు అనేది ఒకటుంది .  
అది లేక పొతే మనిషి లేడు. 

పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడిపే రోజులు పోయాయి . బతకడం కోసం పని .. డబ్బు .
 కానీ ఇప్పుడు నీలాంటి వారు పని కోసమే బతుకుతున్నారు .
 నీ పే ప్యాకేజి నీ జీవితానికి ఉరితాడు అయ్యింది . 

   ఇంటికి వంటగది ముఖ్యం . 
పూజ గది కన్నా అది పవిత్రం . 
మరో ముఖ్యమయిన చోటు డైనింగ్ టేబుల్ .

 వారం లో ఏడు రోజులు . 
రోజుకు మూడు పూటలు . అంటే 21 .
 కనీసం 19  సార్లు ఇంట్లోనే వంట చెయ్యాలి . 
కలిసి తినాలి . అందరూ కూర్చొని మాట్లాడాలి .

 మనసు విప్పి...  బేషజాలు లేకుండా ఆత్మీయంగా మాట్లాడుకోవాలి .
 షో ఆఫ్ లు వద్దు . 
బడాయి మాటలు వద్దు . 
లక్షాది కారి అయినా లవణ మన్నమే. 

మనం తినే తిండే మన ఆరోగ్యం .
 మనం మాట్లాడుకొనే మాటలే మన మానసిక ఆరోగ్యం . 

ఈ కంపెనీ ని నా  ఆలోచన మేరకు నా విద్యార్థులు  స్టార్ట్ చేసారు .

 నేను ఫ్రీ గా సర్వీస్ ఇస్తున్నాను . 
ఇదిగో బుక్ చేసేటప్పుడు నువ్వు కట్టిన లక్ష ఫీజు .
 నా సర్వీస్ నీకు ఫ్రీ . 

పదేళ్ల క్రితం బాలమిత్ర అని క్లాసులు స్టార్ట్ చేశా . ప్రారంభం లో పెద్దగా పట్టించుకొనేవారు కారు .
 ఇదిగో ఇప్పుడు కొండవీటి చేంతాడు అంత వెయిటింగ్  లిస్ట్ . 

పదో రౌండ్ బాలమిత్ర క్లాసులు నడుస్తున్నాయి . పోయిన వారమే సూర్యాపేట , ఖమ్మం , వరంగల్ కరీంనగర్ క్లాసులు అయ్యాయి . నెక్స్ట్ వైజాగ్ వెళుతున్నా.. ఈ లోగా ఈ రోజు  జిం కు వెళ్ళాలి " అంటూ బడిపంతులు మెరుపు వేగం తో వెళ్ళిపోయాడు .

రాగిణి ఆలోచనలో పడిపోయింది . 
పది పదహైదు ఏళ్ళ క్రితం ఈ బడిపంతులు తనకు తారసపడి ఉంటే నా జీవితం ఏ రోజు అడవి కాచిన వెన్నెల అయివుండేది కాదు  .. నా ఖర్మ"  అనుకొంటోంది . 

శుభోదయం .

No comments:

Post a Comment