*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🦑🦑🦑 🦑🦑🦑 🦑🦑🦑
*సంస్కార సౌరభం*
*'సూర్యచంద్రులవలె మానవులు సమున్నత మార్గంలో నడవాలి. గతి, నియతి తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో ముందుకు కొనసాగాలి. సర్వప్రాణుల్లో అత్యంత శ్రేష్ఠమైన జీవి- మనిషి.*
*సత్సాంగత్యంతో, సద్బుద్ధితో, సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి. ఈ సంస్కారాలన్నీ మానవ జీవితాన్ని మహోజ్జ్వలంగా తీర్చిదిద్దుతాయి’- అని అధర్వవేదం అభిలషించింది. తల్లిదండ్రులను, ఆచార్యుడిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, సౌశీల్య సాధనకు సంస్కారం అత్యంత ఆవశ్యకం. ఒక జాతి సౌభాగ్యం, పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు.*
*సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు. సమాజ పురోగతి, అభ్యున్నతి- రాశి పరంగా కాదు, వాసి పరంగా గణించాలి. వ్యక్తి సాంఘికంగా ఎదగడమంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం. ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయన్నాడు శ్రీరాముడితో వసిష్ఠుడు యోగ వాసిష్ఠంలో! అరిషడ్వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తరవాత ఆధ్యాత్మిక వికాసం అలవడుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాల్ని వెదజల్లు తుంది. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో సత్ప్రవర్తన, సదాచారాల్ని మూలభూమికగా స్వీకరించాలి. సముచితమైన మానవ సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి. అందరితో సౌజన్యయుతమైన, సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడం అద్భుతమైన జీవన కళ! ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించడం మాత్రమే కాదు. ఆదర్శవంతంగా జీవించినవారే చరితార్థులవుతారు. ఇది ఎందరో మహనీయుల విషయంలో నిరూపితమైన సత్యం!*
*అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ- ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. విశాల హృదయులను, అందర్నీ తమతో కలుపుకొనిపోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు. ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు. అలాగే, నిష్కల్మషమైన ప్రేమభావజాలం వ్యక్తుల్ని అభిమానించేలా చేస్తుంది. విచక్షణ, ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ, సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సాధకుడికి, సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్లవంటివి. సాధకుల నిగ్రహాన్ని, ఓర్పును ఇవి నిగ్గుతేలుస్తాయి.*
*జీవితం అశాశ్వతం, యౌవనం, ధనం అస్థిరాలు. కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి! సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తిశేషులు! సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు.*
🦑🦑🦑 🦑🦑🦑 🦑🦑🦑
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment