Saturday, February 22, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


114. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః

స్వధర్మాన్ని భగవదర్పణగా ఆచరించడమే సిద్ధిని కలిగిస్తుంది(భగవద్గీత)

ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు కూడా అహంకారం చోటు చేసుకొనే
అవకాశముంటుంది. 'నేను గొప్ప ఉపాసకుణ్ని', 'గొప్ప తపస్విని', 'గొప్ప ధర్మపరుణ్ణి'- ఇలా ఏర్పడే అహమూ సాధనకు అవరోధమే. అహాన్ని జయించి, వినయాన్ని
పెంచుకొనే సాధనకే సరియైన సిద్ధి లభిస్తుంది.

అంతేకాక ప్రపంచాన్నీ, కర్తవ్యాలనీ విడిచిపెట్టి ఎక్కడికో పారిపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుందనే భ్రమలను దూరం చేస్తూ సరైన జీవనవిధానమే తపస్సు అని
స్పష్టం చేసే కథారూపబోధ 'మహాభారతం' అందించింది.

జాబాలి అనే ముని గృహస్థాశ్రమం లంపటాలమయమని భావించి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు. ఏకాంతంలో సాగించిన యోగ సాధనవల్ల నిష్ఠతో నిశ్చలంగా
కూర్చొనే శక్తి లభించింది. ఆ నిశ్చలత ఎంత గొప్పగా స్థిరపడిందంటే, జడలగుబురు కట్టిన శిరస్సుపై పిచ్చుకల జంట ఒకటి కాపురం పెట్టుకుంది.

కొంతకాలానికి సమాధినుంచి బయటపడ్డ జాబాలి, తన తలపై ఉన్న గందరగోళాన్ని పరిశీలించాడు. తనకంత గొప్ప సమాధి కుదిరిందని తృప్తిపడ్డాడు. ఆ తృప్తి కాస్తా
గర్వంగా మారింది. ఆ పిచ్చుకలను తలపై సహనంతో, దయతో భరిస్తున్న నిష్ఠ తనకి ఉందనీ, అంత గొప్ప యోగిననీ భావించాడు.

ఈలోగా ఆకాశవాణి - "మునీ! వారణాసిలో నివాసమున్న ధర్మాత్ముడు తులాధారుడు
ఇలా ఏనాడు గర్వించలేదు" అంది.

గర్వం ఈర్ష్యకు తల్లి - అందుకే తులాదారుడని తనంతటి వాడొక్కడున్నాడని తెలిసి
సహించలేక, ఆయనని చూసి వద్దామని కాశీకి బయలుదేరాడు. అక్కడ ఆరా తీయగా,
తులాధారుడు ఒక వ్యాపారి అని తెలిసింది. ఎంతో గొప్పయోగి, ధార్మికుడు అంటే పెద్ద ఆశ్రమం కట్టుకుని ఉంటాడనుకున్నాడీయన. తీరా చూస్తే ఒక దుకాణంలో
వ్యాపారం చేసుకుంటున్న సామాన్యుడు. అతడిని చూసి పలకరించబోయాడు జాబాలి.

వెంటనే తులాధారుడు నమస్కరించి - "మహాత్మా! వందనం. మీరాకతో ధన్యత చెందాను. మీ తపస్సు అమోఘం. పిచ్చుకలు తలపై కాపురముంటున్నా చలించని
నిష్ఠ మీది" అని స్వాగతం పలికాడు.

జాబాలి ఆశ్చర్యచకితుడయ్యాడు. పరిచయం లేకుండానే తన గురించి చెప్పగలిగే శక్తి ఈయనకి ఎలా వచ్చింది? ధర్మానికి ఇంత బలముందా? అనుకుని అతనికి
నమస్కరించి వివరాలడిగాడు.

"అయ్యా! నేను పెద్ద యోగిని కాను. నేను చేసే పనిని చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగానిర్వహిస్తాను. వ్యాపారంలో ఎవరినీ వంచించను. అవినీతినిఅవలంబించను.న్యాయంగా నాకు లభించిన దానిని సంతృప్తిగా అనుభవిస్తాను. సుఖదుఃఖాల్ని సమంగా చూస్తాను. నిందాస్తుతులు నాకు ఒక్కటే. ఏవిధంగా ఎవరినీ హింసించను. దయ,సత్యం వదలను. ధర్మాన్ని కీర్తి కోసమని ఆచరించను. నా మాటలు ధర్మాలో, కావో నీ తలపై పిచ్చుకల్ని అడుగు" అన్నాడు.

( ధార్మికజీవనమే ఆధ్యాత్మికత. శాశ్వతమైన ఆత్మ శాశ్వతానందాన్ని పొందాలంటే ధర్మాన్ని తప్పరాదు. వ్యక్తి తన కర్తవ్యాలని వ్యామోహంతోనో, స్వార్థఫలాపేక్షతోనో కాక ధర్మదృష్టితో, ప్రసన్న స్వభావంతో నిర్వహిస్తూనే, భగవద్ధ్వానాన్నీ, ఆత్మజ్ఞానాన్నీ ఏమరకుండా ఉండాలి. ఇదే అసలైన తపస్సు. భారతీయ ధర్మం బోధించే కర్మనిష్ట ఇది.
అర్జునునికి గీతాచార్యుడు ప్రబోధించిన కర్తవ్యమిది.)  

"పిచ్చుకలు ధర్మాలు వల్లిస్తాయా!" అని ఆశ్చర్యపోతుంటే తలలో పిచ్చుకలు నింగికి ఎగిరి తేజోమయాకృతిలో సాక్షాత్కరించాయి. "మునివరా! మేము ధర్మదేవత భటులం.
నీకు సరియైన మార్గాన్ని చూపించడానికి ధర్మదేవత మమ్మల్ని వినియోగించింది.ధర్మాచరణలో స్పర్ధ పనికి రాదు. శ్రద్ధ కలిగిన కర్మాచరణ ధర్మం నెత్తిమీద గూడు
ఉన్నా చలించలేదని గర్వించావు నువ్వు. ఎంత సంసారభారాన్ని మోస్తున్నా నిర్వికారంగా, ధర్మపరంగా జీవిస్తున్నాడు తులాధారుడు. ఇది ఇంకా గొప్ప యొగం”అని బోధించారు ధర్మకింకరులు. ఆ బోధతో కనువిప్పు కలిగి, తులాధారునికి నమస్కరించి జాబాలి సెలవు తీసుకున్నాడు.

ప్రపంచం నుంచి పలాయానం చేయకుండా, సమాజంలోనే ఉంటూ ధర్మబద్ధమైన,స్వార్థరహితమైన గృహస్థాశ్రమంతోనే సిద్ధిని పొందగలమని గ్రహించి ఆ మార్గాన్ని
అనుసరించాడు.

మహాభారతం చెప్పే ఈ కథే 'గీతాసారాంశం'.

ఇక్కడ మనమొకటి గమనించాలి - ధార్మికజీవనమే ఆధ్యాత్మికత. శాశ్వతమైన ఆత్మ శాశ్వతానందాన్ని పొందాలంటే ధర్మాన్ని తప్పరాదు. వ్యక్తి తన కర్తవ్యాలని వ్యామోహంతోనో, స్వార్థఫలాపేక్షతోనో కాక ధర్మదృష్టితో, ప్రసన్న స్వభావంతో
నిర్వహిస్తూనే, భగవద్ధ్యానాన్నీ, ఆత్మజ్ఞానాన్నీ ఏమరకుండా ఉండాలి. ఇదే అసలైన తపస్సు. భారతీయ ధర్మం బోధించే కర్మనిష్ఠ ఇది.

అర్జునునికి గీతాచార్యుడు ప్రబోధించిన కర్తవ్యమిది. ఇటువంటి సాత్విక జీవితమే అచ్చమైన ఆధ్యాత్మిక జీవనం.          

No comments:

Post a Comment