Thursday, February 27, 2025

 ఉపనిషద్దర్శనం -21

అద్వైతం... ఆత్మజ్ఞానప్రదా యకం 
మాండూక్యోపనిషత్తు 
హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది.    కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా  ప్రధానమైన పది  ఉపనిషత్తులలో ప్రము ఖ స్థానాన్ని పొందింది.   సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధా నపాత్ర వహించింది.    ఓంకారాన్ని ‘ప్రణప్రవం’ అంటారు.       అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే  మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే   నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో  అన్ని దశలలో అందించే  ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే  శాస్త్రీయ మైన  నాదోపాసన.   కులమతాలతో, స్త్రీపు రుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం. 

విశ్వమంతా  ఓంకారమే.     భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే.     ఓంకారమే   పరబ్రహ్మ  . పరమాత్మ. ఇదినాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది.    మొదటిది  మెలకువగల బాహ్యప్రజ్ఞ.      ఇదిఅగ్నిస్వరూపం.    అగ్నికి   ఏడు అంగాలు, పందొమ్మిది  ముఖాలు ఉంటాయి.     స్థూలమైన అనగా భౌతిక దృష్టి  కలిగి  ఉంటుంది. 
రెండవది  స్వప్నస్థానం.    అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమైఉంటుంది.    ఈ తైజసరూపానికి  కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది  ముఖాలు ఉంటాయి.   ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది. 
ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను  ‘సుషుప్తి’ అంటారు.    ఇదిమూడవ స్థానం. పరబ్రహ్మ  సుషుప్తస్థితిలో, ఒకేఒక్కడుగా, ‘ ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై  ఉంటాడు. 
ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషోతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హిభూతానామ్ 
ఇతడే  సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి.   అన్నిటి   పుట్టుకకు, నాశనానికి  మూలకారణం ఇతడే.    అద్వైతస్థానం నాలుగవది.    ఇదేపరమాత్మ. అంతఃప్రజ్ఞకు,   బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ  అతీతం.    ప్రజ్ఞాసహితమూ  కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు.    పట్టుకోవడానికి  దొరకదు.     ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ  రహితం.    శాంతం, మంగళప్రదం  , అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ.   దానిని తెలుసుకోవాలి.    దానికి  ఓంకారమే  ఆధారం.
 వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో  లీనం కావడానికి మానవులకు ఆధారమైనది  ఓంకారం.    ఆత్మయొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం  అవుతాడు.    ఆనంద మయుడు అవుతాడు.    శబ్దరూపమైన పరబ్రహ్మ మే  ఓంకారం.     ఓంకారంలో మూడు మాత్రలు  ఉన్నాయి.   (మాత్ర అంటే చిటిక  వేసినంత  కాలం).    అవి అ, ఉ, మ్ అనే  మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి.    దానికి  మకారాన్ని కలిపితే  ఓమ్   అయింది.    దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం.    దానితో ఓంకారం సంపూర్ణ   పరబ్రహ్మం  అవుతుంది.
 ఓంకారంలోని మొదటిపాదం   ‘అ’.    ఇది   జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం.    వ్యాప్తి, ప్రథమ స్థానం అనే  లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ  సరిపోతాయి. ఇది  తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు.   సాధకులలో ప్రథముడు అవుతాడు.    ప్వప్నస్థానంలో ైతెజసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది.   మాత్ర ఎక్కువదనం వల్ల,    రెండిటిమధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి  తేజస్సుకీ  పోలికలున్నాయి.    ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై   ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మ  జ్ఞానం లేనివాడు పుట్టడు. 

సుషుప్త స్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది.   కొలత కొలిచే  నేర్పు, గ్రహింపగల శక్తీఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం.    ఇది   తెలుసుకున్నవాడు   దేనినైనా అంచనా వేసి  తెలుసుకో  గలుగుతాడు.   
 అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః 
ప్రపం చోపశమః శివోద్వైత 
ఏవ మోంకార ఆత్మైవ! 
సంవిశత్యాత్మనాత్మానం
య ఏవం వేద, య ఏవం వేద.

 నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు.    అది వ్యవహారాలకు అందదు.    జ్ఞానేంద్రియా లు     ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైత  స్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మ  మని తెలుసుకుంటాడు.    ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే  నిజమైన జ్ఞాని.    ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి   బ్రహ్మ  జ్ఞానం స్వయంగా 
లభిస్తుం ది.    ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుం ది.   సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞాన  ప్రదా  యిని మాండూక్యోపనిషత్తు. 
ఓం శాంతి

No comments:

Post a Comment