Saturday, May 24, 2025

 *అమ్మ మనసు*
                

*ఇది పూరిగుడిసెలోని పచ్చి బాలింత కథ. బయట హోరున వర్షం. కొబ్బరాకు పందిరిలాంటి పూరిపాక పైకప్పు ఆ వర్షాన్ని ఆపలేకపోతోంది. ఎక్కడికక్కడ కారిపోతోంది. ఒళ్లోని పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో ఆ తల్లి చీరకొంగును గొడుగులా ఎత్తి పట్టుకొంది. అయినా పసికందు నానిపోతూనే ఉన్నాడు- 'వాననీటితో కాదు, ఆ దీనురాలి కన్నీటితో...' అన్నాడు గాథాసప్తశతిలో అజ్ఞాత కవి.* 

*అది కన్నతల్లి కడుపుతీపికి కరుణ రసాత్మకమైన వ్యాఖ్యానం.*

*'అవును నిజం, అవును నిజం చేదువిషం జీవఫలం' అని మహాకవి శ్రీశ్రీ ఊరికే అనలేదు. త్యాగమూర్తులైన పేద తల్లుల జీవితాలన్నీ పరమ విషాద కావ్యాలు.*

*అనంతుడి భోజరాజీయంలో... పులిపంజాను తప్పించుకొంటూ ఓ గోమాతదయనీయంగా అర్థిస్తుంది- 'ముద్దులపట్టి! అతడు పుట్టి ఏడెనిమిదినాళ్ల పాటి గలడు... ఇంతియ పూరియు(పూరిగడ్డి) మేయ నేర్వడు... ఏన్ జని కడుపార చన్దుడిపి చయ్యన వచ్చెద...' నీకు పుణ్యంఉంటుంది, ఒక్కసారి విడిచిపెట్టు అంటూ ప్రార్ధిస్తుంది.*

*అమ్మదనానికి అరమరికలు తెలియవు. మానవులు, జంతువులన్న తేడాలుండవు. అమ్మ- అమ్మే! మనిషికి లభించే మహోన్నత సుఖ అనుభూతుల్లో అత్యున్నతమేదన్న ప్రశ్నకు- 'కన్నబిడ్డను కావలించుకోవడం' అని చెప్పారు మన పెద్దలు.*

*‘ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్- పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబునట్లు హృద్యంబే?... ముత్యాల హారాలు కర్పూర పరాగం, మంచిగంధం వెన్నెల... ఏవైనా బిడ్డను హత్తుకొన్నప్పటికన్నా సుఖంగాను, చల్లగానూ ఉంటాయా' అన్నాడు శకుంతలోపాఖ్యానంలో నన్నయ.*

*ఆత్మజుల ఆలింగన సౌఖ్యం అత్యంత సుఖావహం కాబట్టే- పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే స్త్రీమూర్తులు ఆందోళన చెందుతారీ దేశంలో. అమ్మదనం కోసం ఎంతగానో ఆరాటపడతారు.*

*తన కన్నుల పంట తనను విడిచి కనుమరుగైపోతుంటే ఆ కడుపుకోత ఎంత బాధాకరమైనదో- శంకరుల తల్లి ఆర్యాంబనో, కర్ణుడి తల్లి కుంతీమహాదేవినో అడిగితే తెలుస్తుంది.* 

*చేతికందిన కొడుకు సర్వసంగ పరిత్యాగియై ఒంటరిగా వదిలిపోతుంటే ఆర్యాంబ ప్రాణం ఎంతగా విలవిల్లాడిపోయిందో విద్యారణ్య మహర్షి తమ శంకరవిజయంలో హృద్యంగా వివరించారు…*

*కర్ణుణ్ని నీటిపాలు చేద్దామని కాదు- బిడ్డతో సహా గంగలో దూకి ఆత్మహత్య చేసుకొందామని కుంతి గంగాతీరానికి చేరింది.*
*విధివశాన ఒక పెట్టె తీరానికి కొట్టుకొచ్చింది.*

*'ఆత్మహత్యయు శిశుహత్యయనక, గంగపాలు కానున్న ఈ దీనురాలిమీద భువనబంధునకే జాలిపుట్టెనేమొ! పెట్టె పంపించి తెరువు చూపెట్టినాడు' అనుకొంది - కరుణశ్రీ కుంతీవిలాపంలో.*

*'నీ వరహాల మోము నేనెన్నటికైన చూతునె! ఏ యమయైన ఇంత నీకు అన్నము పెట్టి ఆయువు ఇడినప్పటి మాట గదోయి నాయనా!' అంటూ పొగిలిపొగిలి ఏడ్చింది.*

*ఆయువుంది కర్ణుడికి. కాబట్టే బిడ్డను సూతుడు చేరదీశాడు. స్లొవేకియాలో తాజాగా ఇలాంటిదే జరిగింది. వెయ్యి కిలోమీటర్ల దూరానగల ఉక్రెయిన్ నుంచి రైలులో వచ్చిన 11 ఏళ్ల ఒంటరి బాలుణ్ని చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. భీకర యుద్ధ వాతావరణంలో కుటుంబసభ్యులు అనారోగ్య స్థితివల్ల దేశం విడిచి రాలేకపోయారు. పిల్లవాడైనా చల్లగా బతకాలన్న ఆశతో- పొరుగుదేశానికి పంపేశారు. 'వీనిని ఏ తల్లి చేతిలోనైన పెట్టి మాట దక్కింపు మమ్మ! నమస్సులమ్మ' అన్న కుంతీదేవి మాదిరే, స్లొవేకియాలోని బంధువు ఫోన్ నెంబరు పిల్లవాడి చేతిమీద రాసి ఒంటరిగా బండి ఎక్కించారు.* 

*అధికారులు చూసి చుట్టాల ఇంటికి చేర్చారు. బిడ్డకు దూరమవుతున్న ఆ సమయంలో తల్లి సంగతి తలచుకొంటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. మనసు కలవరపడుతుంది!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment