Wednesday, May 21, 2025

 ఇదిగో అందుకే మగాళ్లని తిట్టేది బిల్లులు చూసి కళ్ళు తిరగటం ఏంటి చోద్యం కాకపోతే మా ఆడాళ్ళు shopping పోతే మాములు బిల్లులు కడతమాఎంత పెద్ద బిల్లు ఐనా తక్కువే ఖర్చు పెట్టేము అని easy గా అనుకుంటాము 😄😄😄 అర్ధం చేసుకోరు 

బయట గర్ గర్ మంటూ చప్పుడు వస్తే ఏమిటా అని తలుపు తీసి చూస్తే  మీటర్ రీడింగ్ కుర్రాడు కనపడ్డాడు. పర్రని బిల్ చింపి ఇస్తుంటే పట్టుకోగానే జిల్ మని కరెంట్ షాక్ కొట్టినట్లయి ధభీమని కుర్చీలో కూలబడ్డా...
⚡⚡⚡⚡⚡⚡

పార్థ సారధి గారి post 😄😄😄

"ఏమైంది అంకుల్ "అంటూ చేయి పట్టుకున్నాడు చాన్నాళ్ల నుంచి పరిచయమున్న  ఆ కుర్రాడు.

"ఏంటో బిల్ తాకగానే జిల్ అంది...బిల్ ఎంత వచ్చింది చూసి చెప్పు బాబూ...కళ్ళజోడు లేదు"

"5300 వచ్చింది ... దీనికే అలా అయిపోయారేంటి అంకుల్...మీలాగే పక్క వీధిలో పెద్దాయన బిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాడు, నేను, వాళ్ళ అబ్బాయి కలిసి కారులోకి సాయం పట్టి హాస్పిటల్ లో చేర్చాము.... ఇప్పటికే పది వేలు అయిందట హాస్పిటల్ బిల్లు"

"ఇంతకీ ఆయన కరెంట్ బిల్లు ఎంతో" మన కుతూహలం మనది

"ఎంత అంకుల్..జస్ట్ ఏడు వేలే"

నీకు జస్ట్ ఏడు వేలే బాబూ... కట్టేవాడికి తెలుస్తుంది బాధ అనుకుని లోపలికి వచ్చాను.

ఎండాకాలం రాకముందు 1500 లోపలే వచ్చే బిల్లు మార్చ్ వచ్చి ఎండలు ముదరగానే ఆ సూర్యుడి వేడి లాగే పెరిగిపోతుంది. ఇంకా అసలు వేసవి నెలలు ఏప్రిల్,మే,వర్షాలు పడని జూన్ లు ముందు ఉన్నాయి

లాభం లేదు...ఇంట్లో కొంత పొదుపు పాటించాలి అనుకుని పుస్తకం చదువుకుంటున్న మా ఆవిడ దగ్గిరకు కుర్చీ లాక్కుని కూచుని నాందీ ప్రస్తావన లాగ చిన్నగా దగ్గి

"చూసావా ఈ నెల 5300 వచ్చింది కరెంట్ బిల్...కొంచెం పొదుపు చేయాలోయి మనం"అన్నాను

"అవునా? సరే ఎట్లానో అది కూడా మీరే చెప్పండి" అంది పుస్తకం మూస్తూ

"ఆజెండా ఏమిటంటే విద్యుత్తు ఆదా ఎలా?"

"ఇదేమైనా review మీటింగా? అజెండా, మినిట్స్, కోరం అంటూ మొదలెట్టారు. రిటైర్ అయి పదేళ్ళయినా ఇంకా ఆ మీటింగ్  వాసనలు పోలేదు మీకు"అంది నవ్వుతూ

"పొనీలే...informal మీటింగ్ అనుకుందాము..హాల్లో మూడు ఫ్యాన్లు వేయకుండా ఒక ఫ్యాన్ దగ్గిరే కూచుని టీవీ చూద్దాము"

"Ok"

"గీజర్ వెయ్యడం ఆపేద్దాము"

"గీజర్ ఎవరు వేస్తున్నారు? పంపు తిప్పితే  చాలు ట్యాంక్ లోంచి భగ భగ మంటూ వస్తున్నాయి, సల సల లాడుతున్న వేడి నీళ్లు"

"అవును గదా...అయితే ఫ్రిజ్ మీద లోడ్ తగ్గిద్దాము"

"సరే...పొద్దున్నే వెళ్లి ఏ రోజు కూరలు ఆరోజే తెండి..
Bottles పెట్టను..ఒక కుండ కొనుక్కురండి...నెక్స్ట్"

"Microwave వాడకు"

"సరే...oven బదులు ఫ్రిజ్ లోంచి తీసి తినే ముందు ఎండలో కొంచెం సేపు పెడతాను.అవే వేడి ఎక్కుతాయి"అంది నవ్వుతూ

"తెల్లార్లు కాకుండా ఏసీ రాత్రి రెండు అవగానే ఆపేద్దాము. అప్పటికి చల్లబడుతుంది"

"ఇదేదో బాగానే ఉంది గానీ మీ మనవడు పడుకునేటప్పటికే 11 దాటుతుంది. ఏసీ అపగానే లేచి కూచుంటే మటుకు వాడిని మళ్ళీ నిద్రబుచ్చే డ్యూటీ మీదే నంటే దీనికి నేను సై"

అమ్మో ఇది చాలా కష్టమయిన డ్యూటీ అనుకున్నా మనసులో..

"వాషింగ్ మెషీన్ dryer వాడొద్దు..బాగా ఎండగా ఉంటోంది కదా తడి బట్టలు పిండి ఇలా అరేయగానే అలా ఎండిపోతాయి"

"అలాగే. మరి నాకు చెయ్యి నొప్పి గదా...పిండడం ఎట్లా?....సరేలెండి నారు పోసినవాడు నీరు పోయడా అన్నట్లు ఐడియా చెప్పినవాళ్లే ద్రోవ చూపెడతారు"అంది గడుసుగా!

"రూముల్లో లైట్లు,ఫ్యాన్ లు పని అయిపోగానే ఆపేయాలి. అన్ని లైట్లు  LED లతో మార్చేద్దాము"

"ఆలా మార్చడానికి ఇప్పుడో రెండువేల కొత్త ఖర్చు"అంటూ దీర్ఘం తీసింది

"మిక్సీ,వెట్ గ్రైండర్ కూడా చాలా తక్కువగా వాడు"

"అయితే ఎండాకాలం వెళ్లేవరకు ఇడ్లీ,దోసా బంద్ ఇంట్లో....
 నాకు చెయ్యి నెప్పి కదా!
 పోనీ మీరు పిండి రుబ్బుతానంటే సరే"

అమ్మో..అన్నిటికీ ఇలా పెడుతోందేమిటి మెలిక అనుకుని అయినా జంకక 

"కాఫీ ఫిల్టర్ కూడా ఎలక్ట్రిక్ ప్రీతి కాకుండా పాతది
స్టీల్ ది బీరువా లో ఉందిగా, అది తీసి వాడు"

తల కొట్టుకుంటూ "దాని కెంతవుతుంది కరెంట్ మహాశయా" అంటూ సరేనంది

ఇలా నేను చెప్పిన పాయింట్స్ అన్నిటికీ ఎదో ఒక వంక పెడుతూ ,చైనా వాడు భద్రతా సమితి లో వీటో చేస్తున్నట్లు, అంటుంటే వళ్ళు మండి,

 "నాకివే తట్టాయి...నువ్వు చెప్పు ఇంకేవైనా పొదుపు పథకాలు" అన్నాను రోషంగా

నా చేతిలోంచి బిల్లు లాక్కుని
"మీటింగ్  అన్నారుగా, అయితే కంక్లూజిన్ చెప్పి వందన సమర్పణ చేస్తాను .. సావధానంగా వినండి...
స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనే మాటలు విన్నారా?

"విన్నాను"

"అలాంటిదే ఈ కరెంట్ బిల్ వైరాగ్యం...రెండు రోజులు ఉంటుంది...మనం ఎంత గీచి గీచి కాల్చినా వేసవి కాలం నాలుగు నెలలు ac ల వల్ల బిల్లులు ఇలానే వస్తాయి. రెండు రోజులు పోగానే మరిచిపోతారు..మళ్లీ బిల్లు వచ్చినప్పుడు ఆవేశం వస్తుంది..."
"......."
"అందుకని, పార్ధా, ఎక్కువ చింతించకు, దీనినే పాలపొంగు ఆవేశం అని, మధ్య తరగతి మనస్తత్వం అని గీతలో చెప్పబడింది, ఎక్కువ ఆవేశపడకండి, అసలే ఎండాకాలం కొంచెం మజ్జిగలో ఉప్పేసి నిమ్మకాయ పిండి ఇస్తాను...తాగి బెడ్ రూమ్ లో  
ఏసి లో కూచోండి, చల్లబడతారు"
అని  పార్థుడికి ఆయన సారధి గీతోపాదేశం చేసినట్లు జ్ఞానబోధ చేసి మజ్జిగ తేవడానికి లేచి వెళ్ళింది.

నిజమే గదా అనిపించి నీరసంగా ఏసీ స్విచ్ వేయడానికి లేచి వెళ్ళాను.
🙁🙁🙁🙁🙁🙁🙁

No comments:

Post a Comment