Monday, October 12, 2020

త్రికరణశుద్ధి

🌸త్రికరణశుద్ధి🌸

చెట్టు మీద పిట్ట వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది. అందులో గుడ్లు పెడుతుంది. అవీ పక్షులై పెరుగుతాయి. ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్లిన చోటే రాత్రి పూట గడపవచ్చు. కానీ, పక్షులు అలా చెయ్యవు. అవి తిరిగి సాయంకాలం గూళ్లకు చేరుతాయి. మనిషి జీవన స్థితీ అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవీ ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి. విన్నవి, కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నింటి సమాహారమే- మనసు. అది అత్యంత శక్తిమంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలదు. పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తరవాతే మనసు నిర్మాణం జరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి- ఆకృతి(రూపం). అంటే, శరీరమే కదా. ‘మనసు’- అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒక వైపు చైతన్యం మరోవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది. శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది. మనసూ చైతన్యాంశమే. కానీ, దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం. వీధుల్లో అక్కడక్కడా అర్థం పర్థం లేకుండా తిరిగే పిచ్చివాళ్లను గమనించండి. వాళ్లు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు. ప్రస్తుత క్షణంతో వారికి ఏ సంబంధమూ ఉండదు. వాళ్లు అస్తమానం గతంతో సంభాషిస్తారు. అంటే, జరిగిపోయిన(దూరమైన) పాత సంఘటనలతో మాట్లాడటం. ఇంటి కాపలాదారు గృహం వద్దే ఉండాలి. కానీ, బాధ్యతలు మరచి జులాయిలా షికార్లు చేయడంలో అర్థం ఉందా? లేదు. మనసులేని మనిషి మర యంత్రంతో సమానం. మనిషి- ఆలోచనలతో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతో, ఎరుకతో ఉన్నప్పుడు మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనీషిగా మారతాడు. అందుచేత ‘మనసు’ మనిషి దగ్గరే ఉండాలి. అందువల్లే కఠోపనిషత్తు- ‘శరీరం ఒక రథం లాంటిది, మనసు ఆ రథాన్ని నడిపే సాధనం’ అని చెబుతోంది. మనిషి(మనసు) ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతూ ఉంటాయి. ఔషధ కర్మాగారమైన కాలేయం- శారీరకంగా అవసరమైన రసాయనాలు అందిస్తుంది. వడపోత కార్యక్రమం చేపడుతూ మూత్రపిండాలు రక్తశుద్ధి చేస్తాయి. తరాల నాటి పూర్వీకుల పోలికలు గుర్తుంచుకుని శతాబ్దాల తరబడీ పుట్టే సంతానానికి అచ్చుగుద్దినట్లు చేర్చుతుంది. ఈ క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికీ మనసు తోడైతే మూడూ ఒక్కటవుతాయి. అప్పుడు, ‘త్రికరణ శుద్ధి’ నెలకొంటుంది. ‘ధ్యానం’ పురివిప్పుకొంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతీపని ఒక ‘ప్రార్థన’ అవుతుంది. నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారి అవుతుంది. మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయం కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. అందుచేత దానితో రోజూ వ్యాయామం చేయించాలి. యోగాసనాల వల్ల శరీరానికి క్రమత ఏర్పడి ఆరోగ్యం చేకూరుతుంది. మనసులో మలినశుద్ధీ జరుగుతుంది. పరిశుద్ధమైన మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment