Tuesday, October 27, 2020

ఉత్కృష్ట మార్గము

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఉత్కృష్ట మార్గము

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...?

అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే,
దానికి పరమహంస ఇలా

జవాబు చెప్పారు.
నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.
నీ మనసును మాత్రం
ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...

నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన
వాళ్ళుగానే వ్యవహరించు.
నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.

తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది.
తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది.

నా బాబువి కదూ,
నా తల్లివి కదూ...
అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది.
కాని, ఆమెకు తెలుసు,
ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...
దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.

అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.
నీ మనసును మాత్రం,
ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే ...
సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి
ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది.

సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది.

ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ ...
వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి.
లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు.

అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో...
ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు.

దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

పాల నుంచి వెన్న దొరకదు.
ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి.
తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది.
చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది.
ప్రపంచం నీళ్ల లాంటిది.
మనస్సు పాల లాంటిది.
పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా
కలిసి ఏకమవుతుంది.
వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి.
జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి.
ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.

ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁


మన శరీరం ఒక క్షేత్రం, దానిలో ఏదైనా పండించవచ్చు.

ఈ శరీరమనే క్షేత్రంలో మంచి గుణాలు పండించవచ్చు, చెడు గుణాలు పండించవచ్చు.

నేలలో మొక్కరావాలి అని గింజ నాటితే అసలు పంట కంటే కలుపు ఎక్కువగా వచ్చినట్లే మన శరీరంలో అసురీప్రవృత్తులే ఎక్కువ పైకి వస్తాయి, మంచి దైవీ గుణాలతో కంటే.

మంచి గుణాల పంట పండాలి అని మనం కోరుకోవాలి. కానీ జీవుడు చాలా బలహీనుడు, శరీరం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు.

మనం ఎట్లా ఈ శరీరమనే క్షేత్రాన్ని ఎట్లా నడుపాలో తెలుపడానికే

"అహం ఆత్మా గుణాకేశ సర్వ భూత ఆశయ స్థితః"

మన వెంట ఉండి సహకరిస్తూ ఉంటా అని భగవంతుడూ మనతో ఎప్పుడూ ఉంటాడు.

కానీ మనకు ఆయనపై భారం వదలాలని అనిపించదు.

అన్నీ నేనే చేస్తున్నా అనే అహంకారం మనకు.

మనలోని చెడును వదలాలన్నా బెంగనే. భగవంతునిపై భారం పెడితే నేను చెడుని తొలగిస్తా అని చెప్పాడు, కానీ మనం కష్టపడి సంపాదించిన చెడు ఎక్కడైనా పోతుందేమోనని బెంగ. మంచివారిమి అవుతామేమో అని బెంగ. ఇది మానవుడి బలహీనత.

భగవంతుడు నిరాశ చెందలేదు, యుగ యుగాలుగా సాగిస్తున్న ప్రేమ కృషీవరుడు.

ఆ మంచి ప్రేమనే భక్తి అని పేరుపెట్టారు.

ఈ నాడు మనం దిగజారుతున్న దాన్ని ప్రేమ అని చెబుతున్నాం. ప్రేమ తండ్రి యందు ఉంటే గౌరవం అని పేరు, ఒక పిల్లవాడి యందు ఉంటే అది వాత్సల్యం అని పేరు, తోటివాడి యందు ఉంటే ఆదరం అని అంటాం, సమాన వయస్సు కలవారి యందు ఉంటే అది మైత్రి అని అంటాం. ఇవన్నీ ప్రేమనే.

అదే మన వెనకాతల ఉండి నడిపే భగవంతుని యందలి కృతజ్ఞతా భావం ఉంటే దాన్నే భక్తి అని అంటాం.

అది ఎంత బాగా పండితే మనమే కాదు మన తోటివారికి కూడా అందివ్వగలం.

అట్లా భగవంతుడు మనలో ప్రేమని పండించడానికి పడరాని శ్రమలు పడ్డాడు.

నమ్మళ్వార్ చెబుతారు ఒక ప్రబంధంలో "పడాదన పట్టు మనిషర్కా" అని.

హే భగవన్! ఈ మనుష్యుల కోసమా నీవు పాట్లు పడ్డావు. అయ్యో చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోరయ్యా వీళ్ళు. ఇలాంటి వారికోసం నీవు ఈ నాటికీ ఎన్ని పాట్లు పడుతున్నావో అని రామావతారాన్ని తలచుకొని అంటారు.

ఎవడైనా మనిషి మనస్సున్నవాడైతే రామ నామం తప్ప మరొకదాన్ని స్మరిస్తాడా "కర్పాల్ ఇరామ పిరానై అల్లాళ్ మత్తుమ్ కర్పరో" అని సవాలు విసిరాడు నమ్మాళ్వార్.

ఎదైనా నేర్వాలి అని ఆరంభంచేసిన వ్యక్తి రామ నామం తప్ప వేరేది నేరుస్తాడా ? ఇది మన సమాజంలో ఎంతో లోతుగా నాటుకున్న విషయం.

అక్షరాలు రాయడం రాకున్నా శ్రీరామ అనేది రాయగలిగేవారు. ఎందుకంటే ఈ మనుషుల కోసం పడరాని పాట్లు పడ్డాడు రాముడు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment