Saturday, October 24, 2020

మంచికథ... 'మనం ఎప్పుడూ గుప్పిటని మూసి ఉంచాలి. లోపల ఏముందో ఎవరికీ తెలియగూడదు. తెరిచామా? అయిపోతాం

మంచికథ...👉

భర్త రిటైర్‌మెంట్‌ దగ్గరికొచ్చేసరికి శకుంతలకి దిగులు ఎక్కువైంది. కొన్ని రోజుల క్రితమే భర్త చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి. అప్పట్నుంచి ఆమెకు నిద్రకూడా సరిగా పట్టడంలేదు.
'రిటైరైన తర్వాత పెన్షన్‌ ఎంత వస్తుంది?' అని అడిగింది లక్ష్మణ్‌ని.
'పదిహేను వందలు వస్తుందేమో?' అన్నాడు లక్ష్మణ్‌. ఆమె గుండె గుభేలుమన్నది.
'అంతేనా?' అన్నది.
'ఔనే. నాది గవర్నమెంట్‌ ఉద్యోగం కాదుగా! కార్పోరేషన్‌లో ఉద్యోగం. మాకు పెన్షన్‌ నామమాత్రం. ప్రావిడెంట్‌ ఫండ్‌ పెన్షన్‌ అని వస్తుంది.'
'వేలు వస్తున్నప్పుడే సంసారం అంతంతమాత్రంగా నడుస్తున్నది. వందల్తో ఎట్లా బతికేది?' దిగులుగా అన్నది
'రిటైరైన తర్వాత వచ్చే డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీతో బతకాలి' అన్నాడు.
ఐతే ఆ డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు శకుంతలకు. నలుగురు పిల్లలకూ ఆ వచ్చే డబ్బు మీద కన్నుంది.
పెద్ద కొడుకు నరసింహారావు అడిగేశాడు గూడా.
'అమ్మా! ఎంతకాలం లారీ డ్రైవర్‌గా పనిచెయ్యనూ? వచ్చే జీతం ఖర్చులకే సరిపోవడంలేదు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. చదువులకు చాలా డబ్బు అవసరం అవుతున్నది. నాన్న రిటైరైన తర్వాత వచ్చే డబ్బుతో స్వంత లారీ కొనుక్కుందాం. అప్పుడు అంతా లాభమే. నాన్న, నువ్వు నా దగ్గరేే ఉండొచ్చు. ఏమంటావు?'
'నేనేమంటాను. ఇంకా టైముందిగా? నాన్నతో మాట్లాడదాం.' అన్నది శకుంతల.
ఆమెకు ఆ లారీ వ్యాపారం మీద నమ్మకం లేదు. అది అందరికీ కలిసి రాదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కిరాయిల డబ్బు కళ్లబడుతుంటే, అంతా మనదే అని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు పెంచుకుంటారు. ఒక్కోసారి ప్రమాదాలూ జరుగుతుంటాయి. లారీ వ్యాపారంలో నష్టపోయిన కుటుంబాలు ఆమెకు చాలా తెలుసు.
రెండో కొడుకు శివరావు గూడా టెండర్‌ పెట్టాడు.
'అమ్మా! నాన్నకు రిటైరైన తర్వాత డబ్బు వస్తుందిగా. అది నాకు ఇవ్వమను. కాంట్రాక్టులు మొదలు పెడతాను. చాలా లాభాలు వస్తాయి.'
శివరావు ఒక కనస్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వాడికీ సొంత వ్యాపారం చెయ్యాలని బుద్ధి పుట్టడం ఏమిటో? అని శకుంతలకు అసహనంగా ఉంది. ఆ కంపెనీ పెద్దదే. పేరున్నదే. జీతం బాగానే వస్తున్నది. ఒక ఫ్లాట్‌ కొనుక్కుని ఉంటున్నారు గూడా.
'ముందు రిటైర్‌మెంట్‌ కానీ, డబ్బు చేతికి వచ్చేసరికి ఆరేడు నెలలు పడుతుంది. అప్పుడు చూద్దాం.' అన్నది కొడుకుతో.
పెద్ద కూతురు రామలక్ష్మి ఏం అడుగుద్దో అని శకుంతలకు లోలోపల భయంగా వుంది. మనుమరాలు శ్రావణి బి.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉంది. క్యాంపస్‌ సెలక్షన్లో జాబ్‌ వస్తే సరి. లేకపోతే అమెరికా వెళ్లి ఎమ్‌.ఎస్‌ చేస్తానంటోందట. ఆ సంగతి తన చెవిన వేసింది రామలక్ష్మి. కనీసం పదిలక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందట. ఆ పిల్లకు జాబ్‌ రాకపోతే కూతురు వచ్చి తమ మీద పడుతుంది.
'నాన్నకు డబ్బులు వచ్చాయిగా?' బ్యాంకులో వేస్తే ఏం వడ్డీ వస్తుంది. నా కూతురికి అప్పుుగా ఇవ్వండి. తర్వాత లక్షలు సంపాదిస్తుంది అనడం ఖాయం.
చిన్న కూతురు ఆలోచన ఏమిటో తెలీదు. పిల్లల మనసులో మెదులుతున్న ఆలోచనలు ఎప్పటికప్పుడు భర్తతో చెప్తూ ఉపశమనం పొందుతోంది శకుంతల.
'ఎప్పటి సంగతో కదా? చుద్దాంలే' అంటున్నాడు. లక్ష్మణ్‌
అతనికీ మనసులో ఆందోళనగానే ఉంది. చేతిలో ఉన్న డబ్బు పిల్లలకు ఇచ్చి పంచలో పడి అవమానాల పాలవుతున్న తల్లిదండ్రుల కథలు అతనికి ఎన్నో తెలుసు. తనకూ అదే గతి పట్టదన్న నమ్మకం ఏముంది?
ఎవరో అన్నట్టుగా భూమిని బంగారం పరిపాలిస్తున్నదట. డబ్బు ఉంటేనే విలువ లేకపోతే పనికిమాలిన వెధవ. ఆసంగతి తెలిసినా డబ్బు విషయంలో మోసపోతూ కష్టాలు పడుతూనే ఉంటాడు అమాయక చక్రవర్తి.

లక్ష్మణ్‌ ఆ రోజు రిటైరయ్యాడు. ఆ సందర్భంలో అతనికి శాలువా కప్పి, పూలదండ వేసి, మెమెంటో యిచ్చి కారులో ఇంటికి పంపారు ఆఫీసువాళ్లు. అది ఆఖరి మర్యాద. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో, మనవలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రి డిన్నర్‌ చేస్తున్న వంటకాలతో ఆ వీధి అంతా ఘుమఘుమలాడి పోతోంది.
లక్ష్మణ్‌ కుటుంబంతో పాటు ఊళ్లో ఉన్న వియ్యంకులు, వియ్యపురాళ్లుగూడా ఆనందం పంచుకుంటూ కబుర్లాడుకుంటూ, జోక్స్‌ వేసుకుంటున్నారు. చాలా అరుదైన జీవితంలో ఒకేసారి వచ్చే పదవీ విరమణ సందర్భం అది. ఆత్మీయులంతా ఒక్కచోట కలవడం అందరికీ అరుదుగా దొరికే సమయం.
ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. లక్ష్మణ్‌ చిన్ననాటి స్నేహితుడు రాజారావు కారు దిగాడు.
'రా..రా..రాజా!' అంటూ లక్ష్మణ్‌ ఎదురు వెళ్లాడు.
'అంకుల్‌... రండీ..' అని పిల్లలు కూడా రాజారావుని ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు.
'అన్నయ్యా బాగున్నారా? మా ఇంటివైపు రావడమే లేదు.' అని శకుంతల పలకరించింది.
'ఏం రావడమమ్మా? ఎన్నిసార్లు కలిశాను వీడిని. సిగ్గులేదు మీ ఆయనకి.' సీరియస్‌గా అన్నాడు రాజారావు.
బిందెడు నీళ్లలో ఒక విషపు చుక్క పడినట్టు అక్కడ వాతావరణం కలుషితమైపోయింది. అక్కడున్న అందరిలో ఆనందం ఆవిరైపోయింది. అందరిలో ఆందోళన మొదలైంది.
'ఏమైంది అన్నయ్యా?' అన్నది శకుంతల నిర్ఘాంతపోయి.
'ఏమవ్వాలమ్మా! ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్లుచేశాడు. ఎట్లా చేశాడో మీకు తెలుసా! ఇద్దరు కొడుకులున్నారు సంపాదిస్తున్నారు. పెళ్లికి డబ్బు ఎలా? అని తండ్రిని అడిగారా? స్నేహితుడిని గదా! అని ఆదుకున్నాను. ఇవిగో ప్రామిసరీ నోట్లు ఎందుకు నాలుక గీచుకోవడానికి కూడా పనికిరావు. నేను చేసేది ఫైనాన్స్‌ వ్యాపారం. నాకు పార్టనర్స్‌ ఉన్నారు కదా! వాళ్లకి నేనేం చెప్పేది వీడు డబ్బు తీసుకోవడమే కానీ, వడ్డీ గూడా ఇచ్చి ఎరుగడు ఏదేదో సాకులు చెప్తాడు. కూతుళ్లు పురిటికి వచ్చారనీ, మనమరాలు పెద్దదైందనీ, పెళ్లానికి జబ్బు చేసిందనీ, చాలా ఖర్చయిందనీ చెప్తుంటాడు. కొడుకుల్ని అడుగుతాడో లేదో తెలీదు. ఆఖరికి రిటైరైన తర్వాత వచ్చే డబ్బుతో బాకీ తీరుస్తానన్నాడు.' ఘాటుగా చెప్పి ప్రామిసరీ నోట్లు శకుంతల చేతిలో పెట్టాడు.
గాలివాన వెలిసినట్లయింది. కానీ, ఎవరికీ సంతోషంగా లేదు. లక్ష్మణ్‌ అంత అప్పుున్నట్లు ఎవరికీ తెలీదు. మనిషి గుంభనంగా ఉంటాడు. అన్ని విషయాలు భార్యకీ చెప్పడు. కానీ, తన బాధ్యత బాగానే నెరవేర్చాడు అని బంధువులు చెప్పుకుంటారు. ఏ బంధువునీ కొడుకుల్నీ డబ్బు అడక్కుండా ఇద్దరు కూతుళ్లకు పెళ్ళి చేశాడు. ఇప్పుడే అందరికీ తెలిసింది స్నేహితుడు రాజారావు దగ్గర అప్పుుచేశాడని. ఎందుకు చేశావని ఎవరూ నిలదీసే పరిస్థితిలేదు.
ఆ రాత్రి డిన్నర్‌ ఎవరికీ రుచికరంగా లేదు. చప్పగా ఉంది తెల్లవారి ఎటువాళ్ళటు వెళ్లిపోయారు.
శకుంతల దిగులుగా ఉంది. పదిహేను వందలతో ఎట్లా బతకడం?
'ఎందుకే వెర్రి మొఖమా దిగులుపడుతున్నావ్‌? తిండికి లేక చచ్చిపోములే. నేనున్నాను కదా?' అని నవ్వాడు లక్ష్మణ్‌.
భర్త అంత ధీమాగా ఎట్టా ఉండగలుగుతున్నాడో? శకుంతలకు అర్థం కాలేదు.
'అదికాదు, పదిహేను వందలతో ఎట్లా బతుకుతాం?' అన్నది.
'మనకు ఇద్దరు కొడుకులున్నారు. చెరొక ఆరు నెలలు ఉందాం. మనకు డబ్బెందుకు? పదిహేను వందలే ఎక్కువ. అదిగూడా మనవలకు చాక్లెట్లు, బిస్కెట్లు కొనివ్వడానికే.' అన్నాడు లక్ష్మణ్‌.
కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులనే రోడ్డుమీదకు ఈడ్చిన వాళ్లని, బతికుండగానే శ్మశానంలో తల్లిని వదిలి వెళ్లిన బిడ్డల గురించి టీవీల్లో చూసిందీ, బైటపడని కథలెన్నో ఇటువంటివే. అసలు ఏ ఆస్తీలేదు ఇవ్వడానికి. కొడుకులు తమని జీవితాంతం ఆదరిస్తారా? శకుంతల మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.
'రిటైర్‌మెంట్‌ డబ్బు వచ్చి వాళ్ళకి యిచ్చివుంటే అదివేరేగా వుండేది. రూపాయి ఇవ్వడం లేదు మనం. కొడుకు మనవాడైనా కోడలు పరాయిదే. ఎట్లా చూస్తారో మనల్ని?' అని అనుమానం వ్యక్తం చేసింది భర్త ముందు.
'ముందే అనుకోవడం ఎందుకు? వెళ్ళివుందాం. చూద్దాం. కనిపెంచి పెద్ద చేసిన తల్లదండ్రుల్ని ముసలితనంలో చూడాల్సిన బాధ్యత కొడుకులదే కదా? నేను ఒక్కడినే కొడుకుని అయినా మా అమ్మనానల్ని చివరివరకూ పోషించాను కదా!' అన్నాడు లక్ష్మణ్‌.
'మీ తరం వేరు. ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బుని బట్టే బంధాలు. ఎన్ని చూట్టం లేదూ?' అన్నది శకుంతల.

ఇద్దరి కొడుకుల దగ్గర చెరొక ఆర్నెల్లు వుందామని వెళ్ళిన లక్ష్మణ్‌ దంపతులు అనుమానపడినట్లే అయింది. పెద్దకొడుకు దగ్గర నెల రోజులు ఉండేసరికి గగనం అయింది. అప్పులు చేసి కూతుళ్లకీ పెట్టారని మొగుడు పెళ్ళాం ఇద్దరూ ముఖం మీదే విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడ వుండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. పది రోజులకే వాళ్ళ తత్వం తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చేశారు.
లక్ష్మణ్‌ ఆరింటికే లేచి స్నానం చేసి టీ తాగి బయల్దేరాడు.
'నేను రాత్రికే వచ్చేది.' అన్నాడు.
'ఎక్కడికి వెళ్ళేది?'
'ఉద్యోగంలో చేరుతున్నాను. పదిహేను వందలతో ఎట్లా గడుస్తుంది మనకి?' అని నవ్వాడు లక్ష్మణ్‌.
'ఏం ఉద్యోగం?'
'రాజారావుకి హోటల్‌ వుందికదా! భారత్‌కేఫ్‌. అందులో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం. ఇప్పుడు వెళ్ళగానే టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అక్కడే. రాత్రి కూడా తినొచ్చు గానీ, నీ కోసం ఇంట్లో తింటాను.' అన్నాడు లక్ష్మణ్‌.
శకుంతలకు సంతోషం కలిగింది. రాజారావు ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు. అవసరంలో ఆదుకున్నాడు అనుకుంది. లక్ష్మణ్‌ వెళ్ళేసరికి రాజారావు హోటల్లోనే ఉన్నాడు. స్నేహితుడిని ఆలింగనం చేసుకుని లోపలకు తీసుకెళ్ళాడు.
'ఇదిగోరా నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్‌. ఐదేళ్ళకు ఫిక్స్‌్‌ చేయించాను. నెల నెలా నీ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌కి వడ్డీ జమవుతుంది. పదిహేను లక్షలకు నెల నెలా పదివేలు వస్తుంది.' అంటూ సర్టిఫికెట్‌ లక్ష్మణ్‌ చేతిలో పెట్టాడు.
'నువ్వు ఐడియా ఇవ్వబట్టి సరిపోయింది. నీకు బాకీ ఉన్నట్టు దబాయించడంతో అంతా నీరు కారి పోయారు. లేకపోతే డబ్బంతా పంచుకునేవాళ్లు' అన్నాడు లక్ష్మణ్‌ చెమ్మగిల్లిన కళ్లతో.
'మనం ఎప్పుడూ గుప్పిటని మూసి ఉంచాలి. లోపల ఏముందో ఎవరికీ తెలియగూడదు. తెరిచామా? అయిపోతాం. గుర్తుంచుకో. డిపాజిట్‌ సంగతి ఎవరికీ చెప్పకు. పెదవి దాటితే పృధ్వి దాటుతుంది అంటారు. ఈ సర్టిఫికెట్‌, నీ బ్యాంక్‌ పాస్‌బుక్‌ ఇక్కడే బీరువాలో ఉంచు. హోటల్లో నా బదులు నువ్వే ఓనర్‌వి. ఇవిగో తాళాలు' అంటూ తాళాలు లక్ష్మణ్‌కి ఇచ్చాడు రాజారావు. 'రాజారావులాంటి స్నేహితుడు మీకున్నాడా?!!

Source - Whatsapp Message

No comments:

Post a Comment