*"దేహభ్రాంతి ఎలా పోతుంది ?"*
ఇష్టాయిష్టాలు మనసుకు సంబంధించినవేనని, శరీర సంబంధమైనవి కావని గుర్తించాలి. నదిలోకి దిగినప్పుడు నీటి చల్లదనం వల్ల మనసుకే అనుభూతి కలుగుతుంది. కాళ్ళకి ఉండదు. ఈ విషయాన్ని విచారణతో గ్రహిస్తే మనం ఈ శరీరం కాదని తెలుస్తుంది. శరీరాన్ని నడిపే మనసు, దాని మూలంలోని చైతన్యం మన అసలు స్వరూపమని తెలుస్తుంది. మనలోనే ఉనికిగా ఉన్న దైవాన్ని తెలుసుకోవటానికి అనేక పాట్లు పడుతున్నాం. అందుకు కారణం.. మన ఉనికిని మనం మరిచిపోవటమే. నాలుక ఉన్నదని తెలియాలంటే రుచులే చూడాలా ? రుచి తెలుసుకోవటానికి నాలుక కావాలి కానీ నాలుక ఉన్నదని తెలుసుకోవటానికి ఏ రుచితో పనిలేదు. మనసు కూడా అంతే. ఆలోచనలు మనసును ఆవరించి ఉన్నాయేగాని, ఆలోచనలే మనసు యొక్క స్వరూపం కాదు. దానికంటూ ఓ స్వరూపం ఉంది. మన ఉనికే దాని స్వరూపం. ముందు మన ఉనికి మనకు తెలిస్తే మనమేమిటో, దైవం ఏమిటో తెలుస్తుంది..!"*
ఒకపక్క దైవం, మరోపక్క దేహంతో నేను.. ఈ రెండు భావనలతోనే జీవితం సాగిపోతోంది కదా ?
నేను ఈ దేహాన్ని అన్న భావనతో దైవాన్ని వెదికే ప్రక్రియ మనసును ద్వంద్వభావనలో ఉంచుతోంది. దేహానికి, దైవానికి మధ్య అనుసంధానంగా ఉన్న నేను అనే మనసు స్వరూపం తెలిస్తే ఈ ద్వంద్వవైఖరి పోతుంది. మనలోని ఉనికి (అసలు నేను) అటు దైవంగా, ఇటు దేహంగా ఉందని తెలుస్తుంది. అసలు మన ఉనికి మనకి అనుక్షణం తెలుస్తూనేవుంది. కానీ మన జ్ఞాపకాలు, గుర్తులు, వాసనలు ఆ అనుభూతిని పొందనివ్వటం లేదు. దైవం అంటే ఇంకా ఏదోఉందనే భ్రాంతిలో ఉంచుతున్నాయి. ఆ భ్రాంతిపోతే మన ఉనికే దైవంగా, స్వస్వరూపంగా, చైతన్యంగా అనుభవంలోకి వస్తుంది !
No comments:
Post a Comment