Wednesday, May 22, 2024

ఓర్పు

 ✍️✍️

మనిషి శరీరానికి గాయమైతే మానడానికి మందిచ్చే వైద్యులుంటారు. తగిలిన గాయం మనసుకైతే మందు ఓర్పు రూపంలో అతడి మనసులోనే ఉంటుంది. ఓర్పును భగవద్గీత మనసు నుంచి బయటపడే మానసికేచ్చగా చెబుతుంది.

గీతలో భగవంతుడు కర్మలు ఆచరించడం వరకే మనిషి వంతు అన్నాడు. కర్మఫలాల ఫలితం తెలియాలంటే ఓర్పుతో వేచి ఉండమంటాడు. మహర్షులు ఓరిమిగా చేసిన తపస్సుల తుది ఫలితమే వారికి లభించిన భగవత్ సాక్షాత్కార ప్రాప్తి, భక్త ప్రహ్లాదుడి చరిత్ర ఓర్పు మహత్వపూర్ణతకు మంచి ఉదాహరణ. ప్రహ్లాదుడి ఓర్పు తండ్రీకొడుకులిద్దరికీ మేలుచేసింది. జ్ఞానోదయమై హిరణ్య కశిపుడు శాపవిముక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు భగవంతుడి దర్శనం పొందాడు. ఓర్పు సత్వగుణులందరి సహజ లక్షణం మహర్షి వాల్మీకి రామాయణంలో ఆ

మాటకు నిజమైన అర్ధాన్ని ఆ మహాకావ్యానికి అధినాయకుడైన రాము డిలో ప్రతిఫలింపజేస్తాడు. పట్టాభి షేకానికి సర్వం సిద్ధమైన శుభ సమయంలో తనకు వనవాసానికి వెళ్ళవలసిన పరిస్థితి కల్పించిన పినతల్లి కైకేయిని కన్నతల్లి కౌసల్యకన్నా ముందుగా కలిసి వీడ్కోలు తీసుకు నేందుకు రాముడు వెళతాడు. తన అనుచిత చర్యకు కోపంతో రగులు తుంటాడని ఊహించిన కైక అతడి రాకకు చకితురాలవుతుంది. అణు మాత్రమైనా అసహనం అసంతృప్తి అతడిలో కనిపించక పశ్చాత్తాపంతో ఆమె పరితపిస్తుంది.

భూభారమంతా మోసే భూదేవిని, రాముడి సీతమ్మ సహనానికి ప్రతిబింబాలంటారు.  రామాయణంలో బాలకాండ స్త్రీ పురుషులిద్దరూ ధరించగల ఒకే ఒక ఆభరణముందని, ఆది వారి ఓర్పు గుణమని అంటుంది. విదుర నీతి ఓర్పు బలవంతుడికి బంగారు ఆభరణమని, బలహీనుడికైనా అది గుర్తింపు తెస్తుందని చెబుతుంది. ఆదిశంకరులు ఆహంకార నిర్మూలనకు అవసరమైనవి ఓర్పుతో చేసే ఆధ్యాత్మిక జ్ఞాన సాధనాలని తన రచనలన్నింటా ప్రస్తావిస్తారు. భక్తిమార్గం విడిచిపెట్టక ఓర్పుతో అందులో నడిచి వెళ్ళిన రామకృష్ణ పరమహంసకు అక్కడే భగవంతుడెదురయ్యాడు. ఆయన సతీమణి శారదాదేవి తనకున్న ఓర్పుతో, గృహిణిగా విధ్యుక్తధర్మాలను నిర్వర్తిస్తూనే, ఆధ్యాత్మికపరమైన ఆకాంక్షలు పూర్తి చేసుకున్నారు..

ఓర్పు మరణ బాధనైనా మనిషిని లెక్కచేయనీయదు. స్వచ్ఛందంగా మరణించేందుకు తనకు వరమున్నా. యుద్ధంలో గాయపడి అంపశయ్యమీదున్న భీష్ముడు, ఓర్పుతో ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి బాధంతా భరించాడు. ఆ మధ్యకాలమంతా ధర్మరాజుకు పాలనలో మెలకువలు, ధర్మసూత్రాలను బోధించడానికి వినియోగించాడు. కోతులు కూడా, ఎత్తయిన కొమ్మల మధ్య కూర్చుని కిందకు చూస్తున్నప్పుడు చెట్టుకింద క్రూరమృగాలు కూర్చుని ఉంటే కిందకు దిగే ప్రయత్నం చేయవు. తమకు ప్రాణహాని పొంచి ఉందని గ్రహించి అవి వెళ్ళిపోయేదాకా ఓర్పుతో వేచి ఉంటాయి.

లౌకిక ప్రపంచంలో విజయశిఖరాలు అధిరోహించిన వారంతా ఓర్పుతో నిరీక్షించడమెలాగో తెలిసిన నేర్పరులని వివేకానందుడు వ్యాఖ్యానించేవారు. ఓర్పు మనిషి ఆలోచనలకు స్థిరత్వం, పవిత్రతలనిస్తుంది. సేవాతత్పరత దైవభక్తి వంటి సద్గుణాలు నేర్పిస్తుంది. మహాత్ములైన వారందరూ ఓర్పునకు మహామంత్రానికి ఉన్న శక్తి ఉందని నమ్మినవారే. ఓర్పు కొరవడుతున్న మనుషుల మధ్య జీవిస్తున్నందుకే ఆధునిక సమాజంలో మనిషికి ఎన్నో సమస్యలు. దాపురిస్తున్నాయనిపిస్తుంది.
✍️✍️

No comments:

Post a Comment