*💦భేతాళ కథలు💦*
*🌻3వ కథ ఆగ్రహించిన దేవత🌻*
♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు రాసాగాడు.
♦️అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఏ దేవతను తృప్తి పరచటానికి గాను నీవీ నిశిరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు గాని, దేవతలను తృప్తి పరచటం మానవులకు సాధ్యమైన పని కాదు.. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్ళకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. అందుకు తార్కాణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను." అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
♦️ఒకప్పుడు నరకంలో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి, కాళ్ళూ, చేతులూ విరిచి కట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు.
♦️అప్పుడు ఆకాశమార్గాన వెళుతున్న ఒక దేవతాస్త్రీ వాడి ఆక్రందన విని, జాలిపడి, వాడున్న చోటికి దిగి వచ్చి, వాడి కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి, వాడి బాధ కొంత తగ్గించి, తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది.
♦️అయితే, నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందున ఆమె చేతి వేళ్ళకు నరక మలినం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్ళకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీ లందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది.
♦️దేవేంద్రుడు ఆమెను పిలిపించి, ఆమె వేళ్ళు. పరీక్షించి, " ఈ నరక మాలిన్యం నీ కెలా సోకింది ?" అని అడిగాడు.
♦️ఆమె జరిగిన సంగతంతా దేవేంద్రుడికి చెప్పింది.
♦️అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతూంటే నీవు జోక్యం కలిగించు కోవటం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుతూ ఉండు. నీ తప్పుకదే శిక్ష!" అన్నాడు.
♦️దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. ఒక వెయ్యి జతల చెప్పులు కుట్టే సరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది,” అన్నాడు దేవేంద్రుడు.
♦️దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టే వాళ్ళు ఎన్నుకుని, రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారే సరికల్లా సిద్ధంగా ఉంచింది.
♦️ఆ చెప్పులు కుట్టే వాడు చాలా సత్పురుషుడు, దైవ భక్తి కలవాడు. అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకొనింది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టటం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టి ఇచ్చింది.
♦️మర్నాడు ఉదయం వాడా చెప్పులు చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. అవి ఎవరు కుట్టారో, ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కాని అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే. వాడు ఆ చెప్పులను ఆమ్ము కుందామని నగరంలోకి వెళ్ళాడు. అవన్నీ ఆతి శీఘ్రముగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకుని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కుని, వాడు ఇంటికి తిరిగి వచ్చాడు.
♦️ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళ నన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జతల కింద మార్చేసింది.
♦️ఏ దేవతో తనకు సహాయ పడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్ధమయింది. ఆరోజు కారోజు వాడు హెచ్చు డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్ళు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంతా మర్నాటికి దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నది.
♦️కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరుకూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొర్లసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజాద్రవ్యాలూ, గంధమూ, పుష్పాలూ, తాంబూలమూ, ధూపమూ, దీపారాధనా ఉంచసాగాడు.
♦️చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి గానీ, తన పై ఇంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటి తాక లేదు. దేవత అరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యం ఉంచాడు. వాటినీ దేవత తాక లేదు.
♦️ఒక నాడు కొత్త బట్టలుకొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు.
♦️ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మర్నాడు ఉదయం, పోసిన రూపాయలు పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి.
♦️చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు, "ఓ దేవతా, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేను ఇచ్చేది ఏదీ ముట్టవెందుకు ? నా మీద ఎంతో దయలేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో, ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు! నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకుని అనుగ్రహించిన దాకా నా మనస్సుకు శాంతి ఉండదు.” అంటూ వాడు రోజూ దేవతను ప్రార్థించసాగాడు.
♦️చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కాని వాడు ప్రార్థనలు మొదలు పెట్టాక ఆమె సహించ లేకపోయింది. రెండు మూడు రోజులు ప్రార్థించి, విసిగి, వాడే మానేస్తాడేమోనని ఆమె ఆనుకున్నది.
♦️కాని ఆ రోజు కారోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచ సాగాయి.
♦️ఆ బాధ పడలేక దేవత వాడి ఇల్లు వది లేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలావరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలిసి ఉన్నది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటన్నిటినీ చెప్పుల జతల కింద మార్చేసి, తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకుని, స్వర్గానికి వెళ్ళి పోయింది.
♦️ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు, దేవత తనను విసర్జించి పోయినట్టు తెలుసు కున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగినది. వాడికి తెలియదు. వాడా దిగులుతో మంచం పట్టి తీసుకుని, కొంత కాలానికి చనిపోయాడు.
♦️బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నా కొక సందేహం. బీదవాడైనప్పటికీ, సత్పురుషడనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టే వాళ్లు ఎన్నుకుని వాడిపై అనుగ్రహించింది? మంచి వాళ్ళకు దైవభక్తి ఉండటం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చటం దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒకటి ముట్టక, వాళ్ల అసంతృప్తి పరచటానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహ పరచటానికి ఏమిటి కారణం ? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది,” అన్నాడు.
♦️దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టే వాణ్ణి అనుగ్రహించటమూ, వాడికి లాభం చేకూర్చటమూ కాదు. తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగు పడితే ఆమెకేమీ అభ్యంతరం లేదు. కాని చెప్పులు కుట్టేవాడు మూఢుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా, నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటు కుంటుందేమోనని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు,” అన్నాడు.
♦️రాజుకు ఏ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼
No comments:
Post a Comment