Tuesday, August 27, 2024

*ఎన్నటికీ వీడనిది…* *ఋణానుబంధం*

 🍀*ఎన్నటికీ వీడనిది…*


            *ఋణానుబంధం*
                ➖➖➖✍️

*"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు"* 
అని మహాభారతం చెబుతోంది. 
```
పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది...

శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. 

దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’అని కన్నీరుమున్నీరు కాసాగాడు. 

అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, “ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను” అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను” అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.

కంసుని చెఱసాలనుండి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు..
```
“మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు”```
(దశమస్కంధం- పోతన భాగవతం)

“అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ 
మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు!”

బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.```

*నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం.*

తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.    

No comments:

Post a Comment